మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (08:21 IST)

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న బీ.1.1.529 - డెల్టా కంటే డేంజర్!!

చైనాలోని వుహాన్ నగరంలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తించింది. ప్రపంచ దేశాలన్నింటిలో పెను విషాదాన్ని మిగిల్చింది. రెండేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ మహమ్మారి నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న తరుణంలో మరో పిడుగులాంటి వార్త వినిపించింది. 
 
దక్షిణాఫ్రికా దేశంలో ఇటీవల వెలుగు చూసిన బి.1.1.529 అనే రకం వైరస్ ఇపుడు శాస్త్రవేత్తలతో పాటు ప్రపంచ ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటివరకు చూడనటువంటి తీవ్రమైన వేరియంట్‌గా దీన్ని చెబుతున్నారు.
 
గత కొన్ని రోజులుగా సౌతాఫ్రికా దేశంలో నమోదయ్యే రోజువారి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. అయితే, గత బుధవారం ఒక్క రోజే 1200 కేసులు నమోదుకాగా, గురువారం ఈ సంఖ్య రెట్టింపు అయింది. అంటే 2465 కేసులు నమోదయ్యాయి. పైగా, మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా ఆరు రెట్లు పెరిగింది. 
 
దీంతో రంగంలోకి శాస్త్రవేత్తలు ఈ వైరస్ మూలాల అన్వేషణ చేపట్టారు. ఈ పరిశోధనలోనే భాగంగా కరోనా కొత్త వేరియంట్ బి.1.1.529 అనే వేరియంట్‌ను కనుగొన్నారు. సౌతాఫ్రికా దేశంలోని బొత్సువానాలో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న ఓ ఎయిడ్స్ రోగిలో ఈ వేరియంట్  ఉత్పన్నమైవుండొచ్చని భావిస్తున్నారు. 
 
అదేసమయంలో ఈ వైరస్ డెల్టా వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు. ముఖ్యంగా, కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌ సమయాల్లో ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లలోని స్పైక్ ప్రోటీన్లలో రెండు, మూడు ఉత్పరివర్తనాలే ప్రమాదకరమైనవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
అయితే, తాజా గుర్తించిన బి.1.1.529 రకం వేరియంట్‌లో 50కి పైగా ఉత్పరివర్తనాలను కనుగొన్నారు. దీంతో గతంలో కనుగొన్న ఉత్పరివర్తనాల కంటే ఇది చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు.