తెలంగాణ గవర్నర్ తమిళసైని రాష్ట్రపతి పదవి వరించనున్నదా? ప్రధాని ఏం చెప్పారు?
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరాజన్‌ను రాష్ట్రపతి పదవి వరించనున్నదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత ఏ రాష్ట్ర గవర్నర్‌తోనూ సమావేశం కాలేదు. ఈ నేపధ్యంలో ప్రధానితో తెలంగాణ గవర్నర్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవిలో వున్నారు. ఐతే ఆర్.వెంకట్రామన్ తర్వాత రాష్ట్రపతి పదవిని అలంకరించిన వారు దక్షిణాది నుంచి లేరు. కనుక తమిళనాడుకు చెందిన తమిళసై సౌందరాజన్‌ను రాష్ట్రపతి పదవికి ఎన్డీయే ఎంపిక చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్-గవర్నర్ తమిళసైని ప్రోటోకాల్ విషయాల్లో పట్టించుకోవడంలేదన్న వాదనలు వస్తున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద తెలంగాణ గవర్నర్ తమిళసైకి రాష్ట్రపతి పదవి చర్చ జోరందుకున్న నేపధ్యంలో దీనిపై క్లారిటీ రావాల్సి వుంది.