ప్రధాని కాన్వాయ్ ఫ్లయ్ ఓవర్ పై ఆగినంత మాత్రాన హత్యకు కుట్రయేనా?
పంజాబ్ లో ప్రధాని కాన్వాయ్ నిలిచిపోవడం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని మోదీ హత్యకు పాకిస్థాన్ ఐ ఎస్ ఐ, ఖలిస్థాన్ ఉగ్రవాదసంస్థ కుట్ర పన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికి పూర్తి సహాయ సహకారాలు అందించింది పంజాబ్ కాంగ్రెస్స్ ప్రభుత్వం అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కొంత మంది నిరసనకారులు రోడ్డు మార్గాన్ని అడ్డుకోవడంతో దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఫ్లైఓవర్‌పై ఇరుక్కుపోయారని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. పంజాబ్‌లో బుధవారం జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ రద్దు అయింది. సభకు ప్రధాని మోదీ వెళ్లే మార్గంలో కొంత మంది నిరసనకారులు రోడ్డును దిగ్బంధించారు. దాంతో 20 నిమిషాలపాటు ఓ ఫ్లైఓవర్‌పైనే ఆగిపోయారు. అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయారు.
పంజాబ్ ఫిరోజ్పుర్లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దయింది. పంజాబ్‌లో మోదీ అడుగుపెట్టినప్పటి నుంచి పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని కారణాల వల్ల సభకు మోదీ హాజరు కావడం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా సభా వేదికపై ప్రకటించారు. అయితే సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోం శాఖ తెలిపింది.
బఠిండా విమానాశ్రయానికి బుధవారం చేరుకున్న మోడీ హుస్సేనీవాలాలోని స్వాతంత్య్ర సమర యోధుల స్మారకం వద్ద నివాళి అర్పించేందుకు హెలికాప్టర్లో వెళ్లాలని భావించారు. అయితే వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. రెండు గంటల పాటు ప్రయాణించేందుకు మోడీ రెడీ అయ్యారు. రోడ్డుమార్గంలో వెళ్లేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని పంజాబ్ డీజీపీ చెప్పారు. మోదీ కాన్వాయ్ హుస్సేనీవాలాకు బయల్దేరింది. గమ్యస్థానానికి మరో 30 కిలోమీటర్ల దూరం ఉందనగా అనూహ్యంగా పరిణామం జరిగింది. కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌పైకి చేరుకోగానే కొంతమంది నిరసనకారులు రోడ్డును దిగ్బంధించారు. దీనితో ప్రధాని ఎయిర్ పోర్ట్ కి వెనుదిరిగారు.