ప్రపంచ ప్రఖ్యాత రేడియాలజిస్టు ఇకలేరు..
ప్రపంచ ప్రఖ్యాత రేడియాలజిస్ట్ ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన... ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ కాకర్ల వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈయన.. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా అందుకున్నారు. 1951లో హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లోనే ఉత్తీర్ణత సాధించారు.
1954 నుంచి 1956 వరకు అమెరికాలోని వివిధ నగరాల్లోని ఆసుపత్రులలో పనిచేశారు. 1956లో భారత్‌కు తిరిగొచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి ప్రధాన రేడియాలజిస్ట్‌గా పదోన్నతి పొందారు.
నిమ్స్ డైరెక్టర్‌గానూ సేవలు అందించారు. పదేళ్లపాటు ఎలాంటి వేతనం తీసుకోకుండానే సేవలు అందించారు. రేడియాలజీ విభాగంలో అనేక పుస్తకాలు రాశారు. పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అలాగే, రాజీవ్ చక్ర నేషనల్ అవార్డు, నేషనల్ యూనిటీ అవార్డు సహా లెక్కలేనన్ని పురస్కరాలను డాక్టర్ కాకర్ల అందుకున్నారు.
డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డితో పాటు.. విపక్ష నేతలు చంద్రబాబు, భట్టి విక్రమార్క, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు తమ సంతాపాన్ని తెలిపారు.