సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (09:33 IST)

సెకండ్ వేవ్‌తో షేకవుతున్న జనం ... అప్రమత్తమైన కేంద్రం

దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. గత కొన్ని రోజులుగా ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఫలితంగా లక్షకు పై చిలుకు కేసు కేసులు వెలుగు చూస్తున్నాయి. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మహారాష్ట్రలో అయితే, ప్రతి 5 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. 
 
ముఖ్యంగా, గత మూడు రోజులుగా వరుసగా రోజూ దాదాపు లక్ష కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశం మొత్తం ఆంక్షల చట్రంలోకి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బుధవారం జరుగుతున్న కేంద్ర కేబినెట్‌ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన కఠిన ఆంక్షలపై చర్చించనుంది. ఇక వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
 
దేశంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతుంది. తొలుత 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వ్యాక్సినేషన్‌ ప్రారంభించింది. అనంతరం ఐఎమ్‌ఏ మార్గదర్శకాలతో 45 ఏళ్ల వయసు వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే కరోనా ఉధృతి కొనసాగుతోన్న నేపథ్యంలో 45 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్‌ వేయాలనే డిమాండ్‌ వినిపిస్తుంది. ఈ డిమాండ్‌పై కేంద్రం గతంలో స్పష్టత నిచ్చింది.
 
వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారిని రక్షించడమే తమ తొలి ప్రాధాన్యమని కేంద్రం స్పష్టం చేసింది. 'కోరుకున్న వారికి టీకాలు వేయం.. అవసరమైన వారికే వేస్తాం' అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. పాశ్చాత్య దేశాల్లో సైతం దశల వారీగా టీకాలు వేస్తున్న సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కరోనా మరణాలను టీకాల ద్వారా సాధ్యమైనంతగా తగ్గించడమే లక్ష్యం. ఆరోగ్య వ్యవస్థను కాపాడడం మరో లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు.