సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (17:05 IST)

'యాత్ర మీది.. రథం మాది'.. మోత్కుపల్లికి విజయసాయి రెడ్డి ఆఫర్

తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు నేత మోత్కుపల్లి నర్సింహులుకు వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడీపీ అధినేత చంద్రబాబు నా

తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు నేత మోత్కుపల్లి నర్సింహులుకు వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మోత్కుపల్లి తిరుగుబాటు బావుటా ఎగురవేయడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నట్టు మోత్కుపల్లి ప్రకటించారు.
 
దీన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు వైకాపా పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా, మోత్కుపల్లితో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోత్కుపల్లికి విజయసాయి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. యాత్ర మీరు చేస్తే.. దానికి అవసరమైన రథాన్ని మేము సమకూర్చుతామంటూ హామీ ఇచ్చినట్టు వైకాపా వర్గాలు వెల్లడించాయి. 
 
ఇదిలావుంటే, మోత్కుపల్లి మరోమారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'జగన్ ఇల్లు కులరహితమైనటువంటిది. పేదవాళ్లను ప్రేమతో చూసే ఇల్లు అది. ఈరోజున జగన్ రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఆయన (జగన్)కు నా మద్దతు. అవసరమైతే ఓ రోజు ఆయనతో కలిసి పాదయాత్రలో నడుస్తా. అవసరమైతే, పవన్ కల్యాణ్‌తోను, సీపీఐ, సీపీఎంలతోనూ కూడా కలిసి నడుస్తా అని ప్రకటించారు. 
 
అంతేకాకుండా, చంద్రబాబు నాయుడు గారూ, నీతిమంతులపై మాట్లాడితే శాపం తగులుతుంది. నాకు అందరూ మద్దతు తెలుపుతారు. అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా.. అన్ని పార్టీలూ నాకు సహకారమందించాలని కోరుకుంటున్నా. నాకు సహకారమందించడం కన్నా చంద్రబాబుకు వ్యతిరేక శక్తులన్నీ ఏకమై అతన్ని ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఏ రోజు అయితే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశాడో, రాజకీయంగా ఆయన పతనం ఆ రోజే ప్రారంభమైంది. అవసరమైతే, అన్ని పార్టీల వాళ్లను కలుస్తా' అంటూ మోత్కుపల్లి ఆవేశంగా హెచ్చరించారు.