శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 29 జనవరి 2022 (16:46 IST)

మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మనవరాలి ఆత్మహత్యకు అదే కారణమా?

చక్కటి కుటుంబం, ఉన్నత వర్గానికి చెందినవారు. తాతయ్య మాజీ ముఖ్యమంత్రి. మేనమామలు కానీ అత్త తరపు వారు కానీ స్థితిమంతులు. ఆర్థికపరంగా ఎలాంటి సమస్యలు లేవు. అలాంటిది... వైద్యురాలిగా వున్న యడియూరప్ప మనవరాలు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటన్నది అంతుబట్టడంలేదు.

 
ఎప్పుడూ నవ్వుతూ... సరదాగా వుండే తన మనవరాలు ఇలా ఆత్మహత్య చేసుకున్నదని తెలిసి యడియూరప్ప కుప్పకూలిపోయారు. తీవ్రంగా ఆవేదన చెందారు. ఆయనను ప్రధానమంత్రి మోదీ, మంత్రులు, భాజపా నాయకులు ఓదార్చారు. తన మనవరాలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నదోనని యడియూరప్ప కన్నీరుమున్నీరవుతున్నారు.

 
30 ఏళ్ల డాక్టర్ సౌందర్య మూడేళ్ల కిందట డాక్టర్ నీరజ్‌ను వివాహం చేసుకున్నారు. 9 నెలల క్రితం బిడ్డను ప్రసవించింది. అంతకుముందు వరకూ వృత్తిరీత్యా రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలు అందిస్తూ వచ్చారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆమె ఇంటికే పరిమితమయ్యారు. కోవిడ్ పరిస్థితుల రీత్యా ఎక్కువగా ఒంటరిగా గడిపారు.

 
ఈ ఒంటరితనమే ఆమెను బలితీసుకుని వుండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మానసికంగా ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడి వుంటారని అనుకుంటున్నారు. ఐతే ఆమె ఆత్మహత్యకు కారణం ఏంటన్న దానిపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి అని చెప్పేందుకు ఆమె 9 నెలలుగా ఇంట్లోనే వున్నారు. కనుక ఆమె ఒంటరితనాన్ని భరించలేక ఇలా అఘాయిత్యానికి పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు.