బడ్జెట్ 2018 : ఆదాయ పన్ను పరిమితి పెంపు తథ్యమా?
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దేశంలో వస్తు సేవల పన్ను విధానం (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న బడ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దేశంలో వస్తు సేవల పన్ను విధానం (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల ప్రజలు దీనిపై గంపెడు ఆశలు పెట్టుకునివున్నారు. ముఖ్యంగా, వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని పెంచుతారని భావిస్తున్నారు.
అంతేకాకుండా, కార్పొరేట్ పన్ను 30 నుంచి 25 శాతానికి, కనీస ప్రత్యామ్నాయ పన్నును 15 శాతానికి తగ్గించవచ్చని ఆశిస్తున్నారు. అలాగే, అన్ని రకాల కొకింగ్ కోల్‌పై కనీస కస్టమ్స్ సుంకం తగ్గించి, అల్యూమినియం స్క్రాప్‌పై కనీస కస్టమ్స్ సుంకం పెంచవచ్చని భావిస్తున్నారు. బంగారం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వీలుగా దిగుమతి సుంకాన్ని తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇకపోతే, బ్యాంక్ డిపాజిట్ల వడ్డీలపై పన్నుకోత పరిమితి పెంచే సూచనలు ఉన్నట్టు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకుల వద్దనున్న నిరర్థక ఆస్తులపై పూర్తిగా పన్ను తగ్గించవచ్చని ఆశిస్తున్నారు. రిటైల్ డిపాజిట్ల కాలవ్యవధిపై పన్ను మినహాయింపును తగ్గించవచ్చని భావిస్తున్నారు. గృహ కొనుగోళ్లపై జీఎస్టీ, స్టాంప్ డ్యూటీల్లో కోత విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మౌలికరంగాల అభివృద్ధిపై అధిక దృష్టిసారించవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా, రహదారులపై 10-15 శాతం పెట్టుబడులు పెంచే అవకాశం ఉందనీ, రైల్వే ప్రాజెక్టుల కోసం నిధులను 10 శాతం మేరకు పెంచవచ్చని భావిస్తున్నారు.
ఐటీ, దాని అనుబంధ రంగాల విషయానికి వస్తే, డిజిటల్ లావాదేవీల కోసం గొప్ప ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉంది. డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చేలా చర్యలు, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటర్లపై ఎక్సైజ్ సుంకాల హేతుబద్దీకరణ, టెలికం సేవలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించే అవకాశం ఉందనీ ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.