శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2021
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 25 జనవరి 2021 (17:18 IST)

బడ్జెట్ 2021లో ఆదాయపు పన్ను స్లాబ్స్ ఎలా వుండబోతున్నాయి?

రాబోయే బడ్జెట్ 2021-22లో ప్రభుత్వం ఆదాయపు పన్ను స్లాబ్స్ విషయంలో ఎంతమేరకు మార్పులు చేస్తారన్న దానిపై ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఆదాయపు పన్ను స్లాబ్స్ కొంతమేరకు మార్పులు వుంటాయని అంటున్నారు. పొదుపు, ఆరోగ్య సంరక్షణ, గృహాల నిర్మాణాలను ప్రోత్సహించే దిశలో ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టి సారించే అవకాశం వుందంటున్నారు.
 
ప్రస్తుతం రూ. 2.5 లక్ష వరకు ఆదాయం వున్న వారు పన్ను పరిధిలోకి రారు. రూ. 2.5 -5 లక్షల మధ్య ఉన్నవారికి 5%, రూ. 5-10 లక్షల వార్షిక ఆదాయం వున్నవారికి 20%, రూ .10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30%గా పన్ను వసూలు చేస్తున్నారు. ఐతే కొత్త పన్ను పాలసీలో పన్ను రేట్లు కొద్దిగా భిన్నంగా ఉంటాయి.
 
పన్ను స్లాబ్‌ల విషయాన్ని అలా వుంచి ఇళ్లను కొనడానికి ప్రజలను ప్రోత్సహించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సెక్షన్ 80సి కింద మినహాయింపు పరిమితిని రూ . 1.5 లక్షల నుంచి రూ .2 లక్షలకు పెంచుతున్నట్లు సమాచారం. ఆరోగ్య బీమా ప్రీమియంపై తగ్గింపు పరిమితిని రూ. 25 వేలకు మించి పెంచవచ్చని అంటున్నారు. మొత్తమ్మీద ఆదాయపు పన్ను శ్లాబ్స్ విషయంలో కూడా మరో రకంగా ఉపశమనం కలిగించే నిర్ణయాలు వెలువడుతాయని అంటున్నారు.