శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 13 ఫిబ్రవరి 2020 (18:04 IST)

రేపే ప్రేమికుల రోజు, ఫిబ్రవరి 14న ఏమిస్తున్నారు?

ప్రేమ
ప్రేమికుల రోజు రేపే. ఫిబ్రవరి 14 నాడు ప్రియురాలి చేతికి ఒక ఉంగరాన్ని తొడగండి, లేదా ఓ పుష్పాన్ని బహూకరించండి, ఆ సమయంలో ఆమె ముఖం ఎలా వెలిగిపోతుందో చూడండి అనే క్యాప్షన్లతో ఇటీవల పలు షాపులు బ్యానర్లు కడుతున్నాయి. ప్రేమికుల రోజునాడు తమ ప్రేమను వెల్లడించడానికి ఆభరణాలు - పుష్పాలకు మించిన మార్గం లేదని ప్రేమికులు పాతకాలం నుండే భావిస్తూ వస్తున్నారు. ఆ రోజు తమ స్వీట్‌హార్ట్‌కు వాటిని బహూకరించడం అంటే, తమ హృదయాన్ని కాబోయో భాగస్వామి ముందు ఆవిష్కరించుకోవడమేనట!
 
ఈ వేలంటైన్స్ డేకి రెయిన్‌బో గులాబీలు...
 
"ఎప్పుడూ.. వేలంటైన్స్ డే నాడు ఒకే రకమయిన గులాబీలనే ఎలా ఇస్తాం చెప్పండీ.. మా ప్రేమను వెల్లడించడానికి ఇచ్చే ఈ గులాబీల్లోనే వేరే రకాలు లేవా?" అని వాపోయే ప్రేమికులకు ఇప్పుడు రెయిన్‌బో గులాబీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రేమికుల రోజున ప్రేమికురాలికి ఇవ్వడానికి ప్రస్తుతం ఈ రెయిన్ బో గులాబీలకే పెద్ద ఎత్తున ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఇంద్రధనుస్సులో మాదిరిగా ఒకే గులాబీలో నానా రకాల వర్ణాలుండటం ఈ రెయిన్ బో గులాబీల ప్రత్యేకత. ఇవి ఎక్కడ పడితే అక్కడ పుష్పించవు. ఈక్వెడార్ ప్రాంతం వీటి పుట్టినిల్లని వీటి విక్రయదారులు చెబుతున్నారు. అయితే, మరీ అంత సీరియస్‌గా కాకుండా, ప్రపంచం కోసం, ఆ.. ఏదో ప్రేమించుకుంటున్నాం అంటే ప్రేమించుకుంటున్నామనే ధోరణితో ఉండే నామ్‌కే వాస్తే ప్రేమికులు మాత్రం ఫిబ్రవరి 14న ఇచ్చుకోవడానికి, సాధారణ పూల బొకేనో, లిల్లీలో ఇచ్చుకోవడం ఉత్తమమట. 
ఇంకో మాట.. మీరు ఇష్టపడే పువ్వులనే మీ ప్రియురాలు ఇష్టపడుతుందనే రూల్ లేదు కాబట్టి, ఏదో ఒకటిలే అనుకుంటూ పువ్వులకు ఆర్డరిచ్చేయకుండా, ముందుగా ఆమె అభిప్రాయం కూడా తెలుసుకోండని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని నేరుగా ఆమెను అడకపోవడమే మంచిది. తన ఇష్టాయిష్టాలేమిటో కూడా తెలియలేని స్థితిలో నా ప్రియుడున్నాడని ఆమెలో కించిత్ బాధ కలిగే అవకాశం ఉండవచ్చు. కాబట్టి, ఆమె స్నేహితురాళ్లనో, ఆమెతో సన్నిహితంగా ఉండే మరెవరినయినా ఈ విషయమై ఆరా తీసి దానికనుగుణంగా బహుమతిని ఎంచుకుంటే మంచిది.
 
వెండి ఆభరణాల హవా...
ప్రియురాలి ముందు ప్రేమను కుమ్మరించడానికి ఖరీదయిన మార్గం.. ఆభరణాలను బహూకరించడమే. అయితే, బంగారానికి బదులుగా శుద్ధమయిన వెండి ఆభరణాలను ఇవ్వడానికి ప్రేమికులు మొగ్గుచూపుతున్నరని దుకాణదారులంటున్నారు. బంగారంతో పోలిస్తే, వెండితో చక్కని ఆభరణాలు చేయడం సులువని, ఏ తరహా జాతి రాయినయినా, వెండిలో పొదగవచ్చని వారు చెబుతున్నారు. 
ఓ ప్రముఖ ఆభరణాల విక్రయదారు మాటల ప్రకారం, ఆకర్షణీయమయిన వర్ణాల్లో పూసలను పొదిగిన బ్రేస్‌లెట్లు ఇప్పుడు వేలంటైన్స్ డే హాట్ ఐటెమ్‌లుగా మారాయి. ఇతర బహుమతులతో పోలిస్తే, ఈ ఆభరణాలు ఎక్కువ కాలం మన్నుతాయి, విలువ తరగదు కాబట్టి జాగ్రత్తగా దాచిపెట్టుకోవడానికి ఇష్టపడతారని అంటున్నారు.