1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 31 మార్చి 2022 (16:31 IST)

మీది కఫ తత్వం, దోషమా? ఐతే ఇలా వుంటారు

కఫ దోషం చాలా నిదానమైనది. వీరు నిదానంగా తినేవారుగా వుంటారు. మెత్తగా, మృదువుగా, నిదానంగా మాట్లాడేవారు కఫ దోషం కలవారై వుంటారు. ప్రశాంతత, ఆత్మతృప్తి కలిగి వుండే వీరికి కోపం అంత త్వరగా రాదు. తమ చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు.

 
రుచి, వాసనలకు వీరు స్పందిస్తారు. ఆహారానికి తగు ప్రాధాన్యతను ఇస్తారు. నిలకడగలిగిన శక్తిని కలిగి కష్టించి డబ్బు సంపాదించేవారుగా వుంటారు. ఇతరులకన్నా వీరిలో దమ్ము ఎక్కువగా వుంటుంది. అంత తేలికగా శారీరక అలసటకు గురికారు. రేయింబవళ్లయినా శ్రమించే తత్వం కలిగి వుంటారు.

 
డబ్బు, సంపద, మాటలు, శక్తిని కలిగినవారై వుంటారు. శరీరంలో వున్న తేమ ధాతువులను ఈ దోషం కాపాడుతుంది. వీరు ముక్కుదిబ్బడ, గుండెజలుబు, ఎలెర్జీలు, ఉబ్బసం, కీళ్లవాపు తదితర సమస్యలతో బాధపడుతుంటారు. శీతాకాలం చివర, వసంత రుతువులో ఈ బాధలు వీరిని ఎక్కువగా ఇబ్బందిపెడతాయి.

 
కఫతత్వం కలిగినవారు సహనం, ఓరిమి, క్షమ లక్షణాలను కలిగివుంటారు. తల్లిలా వ్యవహరించగలగడం వీరి వల్లే అవుతుంది. సంక్షోభ సమయంలో వీరు అంత తేలికగా తొణకరు. తమ చుట్టూ వున్నవారిని పట్టి వుంచడం వీరికి సాధ్యం. ఐతే కాస్తంత అలసత్వం కూడా వుంటుంది. ఒత్తిడిలో ఎంతటి కష్టమైన పనిని అయినా దిగ్విజయంగా సాధించగలుగుతారు.