శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : శనివారం, 29 జూన్ 2019 (13:06 IST)

అత్యాచారన్ని వ్యతిరేకించినందుకు తల్లీకూతుళ్లకు గుండుకొట్టి ఊరేగించారు.. ఎక్కడ?

బిహార్ రాజధాని పట్నా నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైశాలి జిల్లాలో భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేధింపులను వ్యతిరేకించిన తల్లీకూతుళ్లకు గుండు కొట్టించిన కొందరు పెద్దలు, వారిని ఊరంతా ఊరేగించారని వార్తలు వస్తున్నాయి. గ్రామంలో గత బుధవారం సాయంత్రం తల్లీకూతుళ్లతో కొంతమంది అసభ్యంగా ప్రవర్తించారు.
 
వేధింపులను ఇద్దరూ వ్యతిరేకించారు. దాంతో గ్రామంలో దృఢంగా ఉన్న కొందరు ఒక మంగలిని పిలిచి తల్లీకూతుళ్లకు గుండు గొరిగించారు. తర్వాత వారిని గ్రామం అంతా తిప్పారు. వీరిలో పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ సర్పంచ్ కూడా ఉన్నారు. తల్లికూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ 154/19 ప్రకారం ఏడుగురు ఆరోపిత నిందితులుగా ఉన్నారు. వీరిలో వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ ఖుర్షీద్, సర్పంచ్ మొహమ్మద్ అన్సారీ, మొహమ్మద్ షకీల్, మొహమ్మద్ ఇష్తెఖార్, మొహమ్మద్ షాంషూల్ హక్, మొహమ్మద్ కలీమ్, మంగలి దశరథ్ ఠాకూర్ ఉన్నారు.
 
"కేసు నమోదైన ఐదు గంటల్లోనే నిందితులు షకీల్, దశరథ్ ఠాకూర్‌‌లను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నాం. వీలైనంత త్వరగా వారిని పట్టుకుంటాం" అని వైశాలీ ఎస్పీ మానవ్‌జిత్ సింగ్ దిల్లో బీబీసీతో చెప్పారు. ఎస్పీ కూడా అదే చెప్పారు. "సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం నమోదు చేయడానికి బాధిత తల్లీ కూతుళ్లను కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి వారిని వైద్య పరీక్షలకు ప్రధాన ఆస్పత్రికి తరలించాం" అన్నారు.
 
ఈ కేసు బయటపడిన తర్వాత పోలీసులు, అధికారుల్లో కలకలం రేగింది. కొందరు జిల్లా అధికారులు ఘటనా స్థలంలోనే క్యాంప్ వేశారు. మిగతా నిందితులను పట్టుకోడానికి ఏఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
 
మహిళా కమిషన్ పర్యటన
రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ కేసును స్వయంగా విచారిస్తోంది. కమిషన్ అధ్యక్షులు దిల్‌మణి మిశ్రా మిగతా సభ్యులతో కలిసి గురువారం భగవాన్‌పూర్‌లో పర్యటించారు. "ఈ ఘటన చాలా దారుణం. నేను బాధితులతో మాట్లాడాను. వారికి వీలైనంత త్వరగా న్యాయం అందేలా చూస్తాం. గ్రామంలో కొందరు పెద్దలే ఈ పని చేశారు. మేం ఎస్పీతో మాట్లాడినపుడు ఆయన దోషులందరినీ త్వరగా పట్టుకుంటామని మాకు చెప్పారు. మేం ఈ కేసును కేంద్ర మహిళా కమిషన్ దగ్గరకు కూడ పంపిస్తున్నాం" అని దిల్‌మణి బీబీసీకి చెప్పారు.
 
భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సంజయ్ కుమార్ "ఈ ఘటన జరిగిన ప్రాంతంలో తెల్లవారుజామున ముస్లింలే ఉంటారు. నిందితుల్లో మంగలి తప్ప మిగతావారందరూ ముస్లింలే. బాధిత తల్లీకూతుళ్లు కూడా వారి పక్కింటివారే, ముస్లింలే. కానీ ఇద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉంటారు. వారి ఇంట్లోని పురుషులు వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు" అని చెప్పారు.
 
"ఈ కేసులో వెలుగుచూసింది ఒక నీచమైన నేరం కిందికి వస్తుంది. దీనిపై అంతకు మించి చెప్పలేం. కానీ జిల్లా అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. తల్లీకూతుళ్ల వాంగ్మూలం ప్రకారం కేసు నమోదైంది. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో అన్నీ వలుగులోకి వస్తాయి. మేం వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం అందిస్తాం" అని వైశాలి డీఎం రాజీవ్ రోషన్ అన్నారు.
 
మహిళలపై ఇలాంటి వేధింపులు బిహార్‌లో కొత్త కాదు. కొన్ని నెలల క్రితమే భోజ్‌పూర్ బిహియాలోని ఒక ఊళ్లో జనం అనుమానంతో మధ్య వయసు మహిళను దారుణంగా కొట్టారు. వివస్త్రను చేసి మొత్తం మార్కెట్ అంతా తిప్పారు. అయితే ఈ కేసులో స్పీడీ ట్రయల్ వల్ల దోషులను త్వరగా అరెస్టు చేయడంతోపాటు వారికి కోర్టు శిక్ష కూడా విధించింది. 20 మంది నిందితులను దోషులుగా ఖరారు చేసింది.