శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 19 ఏప్రియల్ 2021 (13:05 IST)

వాతావరణ మార్పులు: చేతులు కలిపిన చైనా, అమెరికా, కాలుష్య నివారణకు కలసి పనిచేస్తామని వెల్లడి

వాతావరణ మార్పుల వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి కలసి పనిచేస్తామని చైనా, అమెరికా తెలిపాయి. అవసరమైతే ఇతర దేశాలతో కలిసి పని చేయడానికీ సిద్ధమని స్పష్టం చేశాయి. గత వారం, చైనా వాతావరణ మార్పుల రాయబారి జీ జెన్హువా, అమెరికా రాయబారి జాన్ కెర్రీల మధ్య షాంఘైలో జరిగిన సమావేశాల అనంతరం రెండు దేశాలు ఈ అంశాన్ని స్పష్టం చేశాయి.

 
ఉద్గారాలను తగ్గించేందుకు మరిన్ని నిర్దిష్టమైన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలుపుతూ ఆదివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. వాతావరణ మార్పుల గురించి చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వారంలో ఒక వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో పలు దేశాల నాయకులు పాల్గొంటారని సమాచారం. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నామని చైనా తెలిపింది.

 
అయితే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ సమావేశంలో పాల్గొంటారో లేదో చైనా స్పష్టం చేయలేదు. "వాతావరణ మార్పుల వల్ల కలిగే సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా, చైనాలు పరస్పరం సహకరించుకుంటూ, ఇతర దేశాలతో కూడా కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నాయి. ఈ సంక్షోభాన్ని తీవ్రమైనదిగా, అత్యవసరమైనదిగా పరిగణించాల్సి ఉంటుంది.

 
పారిస్ ఒప్పందం ప్రకారం భూతాపాన్ని నిర్ణీత పరిమితుల్లో ఉంచే లక్ష్యంతో ఉద్గారాలను తగ్గించడానికి ఈ దశాబ్దంలో నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడంపై ఇరు దేశాలూ చర్చలు కొనసాగిస్తాయి" అని ఆ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ కర్బన ఉద్గార ఇంధన వనరులను ప్రోత్సహించే దిశలో ఆర్థిక సహాయం అందించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.

 
పర్యావరణంపై పని చేసే 'గ్రీన్‌పీస్' సంస్థ సీనియర్ సలహాదారులు లీ షువో ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ "ఇది సానుకూలమైన అంశం" అన్నారు. "ఇది ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. షాంఘైలో సమావేశాలకు ముందు, ఫలితాలు ఇంత సానుకూలంగా వస్తాయని ఊహించలేదు" అని లీ రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడైన తరువాత, ఆయన ప్రభుత్వంలోని ఉన్నతాధికారి చైనా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.

 
అయితే, కిందటి నెల చైనా, అమెరికా ప్రభుత్వ అధికారులు అలాస్కాలో సమావేశమై ఇదే అంశాన్ని చర్చించారు. "వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చైనా సహకారం కీలకం" అని షాంఘై పర్యటనకు ముందు కెర్రీ వ్యాఖ్యానించారు. "చైనాతో మాకు పలు అంశాల్లో అభిప్రాయబేధాలు ఉన్నాయిగానీ వాతావరణ మార్పుల విషయంలో పరస్పర సహకారం అవసరం" అని ఆయన అన్నారు.

 
నిపుణులుఏమంటున్నారు?
భూమి గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ అమెరికా, చైనా సంయుక్త ప్రకటన ఉపశమనాన్ని కలిగిస్తుందని బీబీసీ పర్యావరణ విశ్లేషకుడు రోజర్ హరాబిన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని అతి పెద్ద కాలుష్య కారకాలపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప పర్యావరణ పరిరక్షణ సాధ్యం కాదని ఆయన అన్నారు. ఉదాహరణకు, చైనా తన వాగ్దానాలను నెరవేర్చాలంటే 588 బొగ్గు ఆధారిత పవర్ ప్లాంటులను మూసివేయాలని ఒక తాజా నివేదిక పేర్కొంది.

 
"మరి, చైనా ఆ దిశగా అడుగులు వేస్తోందా? లేదు. పైగా, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు మరిన్ని బొగ్గు ఆధారిత ప్లాంటులను నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా, అమెరికా రాయబారుల సమావేశ ఫలితాలు ఆశావహంగా ఉన్నాయి. తక్కువ కర్బన ఉద్గార ప్రోజెక్టులకు పెట్టుబడులను మళ్లించాలని నిర్ణయించారు. రెండు దేశాల్లో ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నించాలనే ఒప్పందానికి వచ్చారు. రానున్న శిఖరాగ్ర సమావేశంలో లేదా అంతకుముందే జో బైడెన్ తమ ప్రతిపాదనలను ప్రవేశపెడతారు.

 
ఈ సమావేశానికి షీ జిన్‌పింగ్ హాజరు అవుతారో లేదో తెలీదు. కానీ, పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ వారంలో ఆయన మరిన్ని కఠినమైన లక్ష్యాలను ప్రకటించే అవకాశం ఉంది. చైనా, అమెరికాలే కాదు, మిగతా దేశాలు కూడా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు అందరూ ప్రయత్నించాలి" అని హరాబిన్ అన్నారు. 
పారిస్ ఒప్పందం ప్రకారం, ఉద్గారాలను తగ్గించేదుకు ప్రతీ దేశం కృషి చేయాలి.

 
2030 నాటికల్లా ఉద్గారాలను అత్యధిక స్థాయిలో తగ్గించేందుకు చైనా అంగీకరించింది. అయితే, చైనా ప్రస్తుతం 1,058 బొగ్గు కర్మాగారాలను నడుపుతోంది. ఇది ప్రపంచ సామర్థ్యంలో సగం కన్నా ఎక్కువ. పారిస్ ఒప్పందాన్ని అనుసరించి క్లైమేట్ యాక్షన్ ట్రాకర్‌పై అమెరికాకు కూడా అంత మంచి రేటింగులు లేవు. డోనాల్డ్ ట్రంప్ పదవీకాలంలో పర్యావరణ చర్చలకు అమెరికా గైర్హాజరైంది. ఈ దశాబ్దంలో ఉద్గారాలను 2005 నాటి స్థాయి కన్నా 57 శాతం నుంచి 63 శాతం తగ్గించాలని అమెరికాను కోరారు.