కరోనావైరస్: ప్రపంచం తలకిందులవుతున్న వేళ ఈ ఐదుగురు రూ. 22 వేల కోట్లు వెనకేసుకున్నారు

Amazon
బిబిసి| Last Modified సోమవారం, 28 డిశెంబరు 2020 (13:41 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
2020 ఏడాదిలో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా సంక్షోభం ఎదుర్కొంది. ఈ దేశం, ఆ దేశం అన్న తేడా లేకుండా జనమంతా ఇబ్బందులు పడ్డారు. లక్షల మంది ప్రాణాలు పోయాయి. అంతకన్నా ఎక్కువ మందికి ఉద్యోగాలు పోయి, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. మరోవైపు ఇదే సమయంలో కొందరు ధనవంతులు మాత్రం ఇంకా ధనవంతులు అయ్యారు. వాళ్ల సంపదను విపరీతంగా పెంచుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లలో 60 శాతానికి పైగా మంది ఇంకా ధనవంతులయ్యారు. వీళ్లలో ఒక ఐదుగురి సంపాదనే ఈ ఏడాదిలో ఏకంగా 310.5 బిలియన్ డాలర్లకు (22 వేల కోట్ల రూపాయలకు)పైగా పెరిగింది. ఆ ఐదుగురు ఎవరంటే...


1) ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ ఈ ఏడాది 140 బిలియన్ డాలర్ల మేర సంపదను పెంచుకున్నారు. బ్లూమ్‌బర్గ్ పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఆయన మొత్తం ఇటీవల 167 బిలియన్ డాలర్లకు పెరిగింది. మైక్రో సాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను దాటేసి, ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడి స్థానంలోకి మస్క్ చేరారు. మొదటి స్థానంలో అమెజాన్ సంస్థ సీఈఓ జెఫ్ బెజోస్ ఉన్నారు.

తాము ధనవంతుల సంపద వివరాలను పరిశీలించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక ఏడాదిలో మరెవరూ మస్క్ అంత సంపద పోగేసుకోలేదని ఫోర్బ్స్ మ్యాగజీన్ పేర్కొంది. టెస్లా కంపెనీ కార్ల అమ్మకాలు ఈసారి రికార్డు స్థాయిలో జరగడంతో ఆ కంపెనీ షేరు ధర బాగా పెరిగింది. స్పేస్ ఎక్స్ సంస్థ కూడా ఈ ఏడాది మంచి ఫలితాలు రాబట్టుకుంది.


2) జెఫ్ బెజోస్, అమెజాన్ సీఈఓ
గత ఏడాది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న జెఫ్ బెజోస్, ఈ ఏడాది కూడా అదే స్థానంలో కొనసాగారు. ఈ ఏడాది ఆయన సంపద మరో 72 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. కోవిడ్ సంక్షోభ సమయంలో అమెజాన్‌లో అమ్మకాలు పెరిగి, ఆ సంస్థ ఆదాయం బాగా పెరిగింది. కొన్ని నెలల క్రితం 200 బిలియన్ డాలర్లకుపైగా ఉన్న ఆయన సంపద... తాజాగా 187 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

దాతృత్వ కార్యకలాపాలు పెద్దగా చేపట్టని బెజోస్... ఈ ఏడాది మాత్రం పర్యావరణ మార్పులను అరికట్టేందుకు చేసే కార్యక్రమాలకు 10 బిలియన్ డాలర్లు సాయం అందించేందుకు ముందుకువచ్చారు. నవంబర్‌లో కొన్ని పర్యావరణ పరిరక్షణ సంస్థలకు 800 మిలియన్ డాలర్లు దానం చేశారు. మరోవైపు బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ స్వచ్ఛంద సంస్థలకు ఈ ఏడాది 5.8 బిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారు.


3) జాంగ్ షన్షాన్, నాంగ్ఫు స్ప్రింగ్ వ్యవస్థాపకుడు
జాంగ్ షన్షాన్ సంపద 62.6 బిలియన్ డాలర్ల మేర పెరిగిందని బ్లూమ్ బర్గ్ పత్రిక తెలిపింది. నాంగ్ఫు స్ప్రింగ్ పేరుతో వాటర్ బాటిళ్లు అమ్మే సంస్థను ఆయన నడిపిస్తున్నారు. ఆ సంస్థ ఐపీఓకి వచ్చి షేర్ విలువ బాగా పెరగడంతో సెప్టెంబర్‌లో జాంగ్ చైనాలోనే అత్యంత ధనవంతుడిగా మారారు.

నాంగ్ఫు స్ప్రింగ్ సంస్థను జాంగ్ 1996లో స్థాపించారు. ఇందులో 84 శాతం మేర వాటా ఆయనదే. ఆయన వాటా విలువ దాదాపు 60 బిలియన్ డాలర్లు. అలీబాబా వ్యవస్థపాకుడు జాక్ మా, టెన్సెంట్ సంస్థ వ్యవస్థాపకుడు పోని మా లాంటి వాళ్లను దాటుకుని చైనాలో అత్యంత ధనవంతుడిగా ఆయన మారారు. వ్యాక్సీన్ తయారీ సంస్థ బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్‌లోనూ జాంగ్‌కు వాటా ఉంది. ఈ సంస్థ కూడా ఏప్రిల్‌లో ఐపీఓకు వచ్చింది. కోవిడ్-19కు ముక్కులో స్ప్రే చేసుకునే వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది.

4. బెర్నార్డ్ అర్నాల్ట్, ఎల్‌వీఎంహెచ్ గ్రూపు యజమాని
ఫ్రాన్స్‌లోకెల్లా అత్యంత ధనవంతుడు బెర్నార్డ్ అర్నాల్ట్. ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడు బెర్నార్డేనని ఫోర్బ్స్ అంచనా వేసింది. బ్లూమ్ బర్గ్ మాత్రం ఆయనది నాలుగో స్థానమని అంటోంది. అనేక రకాల విలాస వస్తువులను ఉత్పత్తి చేస్తున్న బ్రాండ్లను నిర్వహిస్తున్న ఎల్‌వీఎంహెచ్ గ్రూప్‌కు బెర్నార్డ్ యజమాని. ఆయన మొత్తం సంపద విలువ దాదాపు 146.3 బిలియన్ డాలర్లు.

2020లో బెర్నార్డ్ సంపద 30 శాతం దాకా పెరిగింది. కరోనావైరస్ వ్యాప్తి మొదలయ్యాక టిఫానీ అండ్ కో సంస్థ కొనుగోలు ప్రణాళికలను ఎల్‌వీఎంహెచ్ వాయిదా వేసుకుంది. అయితే, గత అక్టోబర్‌లో ముందు అనుకున్నా దాని కన్నా 400 మిలియన్ డాలర్ల తక్కువకు, అంటే 15.8 బిలియన్ డాలర్లకు టిఫానీ అండ్ కోను కొనుగోలు చేసింది.


5. డాన్ గిల్బర్ట్, రాక్ వెంచర్స్
బాస్కెట్‌బాల్ లీగ్‌ ఎన్‌బీఏలో క్లీవ్‌లాండ్ కేవలియర్స్ జట్టుకు గిల్బర్ట్ యజమాని. క్వికెన్ లోన్స్ అనే ఆన్‌లైన్ రుణ సంస్థకు సహవ్యవస్థాపకుడు. ఈ ఏడాది గిల్బర్ట్ సంపద 35.3 బిలియన్ డాలర్ల మేర పెరిగిందని బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. గత ఆగస్టులో క్వికెన్ లోన్స్ మాతృ సంస్థ రాక్ వెంచర్స్ ఐపీఓకు వచ్చింది.

గిల్బర్ట్ సంపద విలువ ఆరు రెట్లు పెరిగింది. రాక్ వెంచర్స్‌లో దాదాపు 80 శాతం వాటా గిల్బర్ట్‌దే. ఈ వాటా విలువ దాదాపు 31 బిలియన్ డాలర్లు.

దీనిపై మరింత చదవండి :