శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (12:58 IST)

భాగ్యనగరిలో కరోనా స్ట్రెయిన్ టెర్రర్ : యూకే నుంచి వచ్చిన ఆ 154 మంది ఎక్కడ?

నిన్నామొన్నటివరకు కరోనా వైరస్ ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఇపుడు కరోనా సరికొత్త రూపం కరోనా స్ట్రెయిన్ వణికిస్తోంది. ఈ వైరస్ సోకితే ఇక కోలుకునే అవకాశమే లేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ - భారత్‌ల మధ్య విమాన సర్వీసులను కూడా నిలిపివేశారు. అయినప్పటికీ.. ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చిన అనేక మంది ప్రయాణికుల ఆచూకీని కనుగొనే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అలా బ్రిటన్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన 154 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వీరంతా ప్రయాణ సమయంలో వారిచ్చిన ఫోన్‌ నంబర్లు, వివరాలు అసమగ్రంగా ఉండటమే దీనికి కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
మరోవైపు యూకే నుంచి తిరిగొచ్చినవారిలో శనివారం మరో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వీరిద్దరూ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందినవారేనని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20కు చేరింది. 
 
మరోవైపు యూకే కొత్త స్ట్రెయిన్‌ కేసుల నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరో గ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది, బ్రిటన్‌ నుంచి వచ్చినవారి వివరాలు ేసకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు.
 
కాగా, ఈ నెల 9 నుంచి 1,216 మంది రాష్ట్రానికి రాగా, ఇందులో 92 మంది ఇతర రాష్ట్రాల వారు. రాష్ట్రంలో 970 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. పాజిటివ్‌గా తేలినవారిలో హైదరాబాద్‌ వాసులు నలుగురు, మేడ్చల్‌ మల్కాజిగిరి వారు 8 మంది, జగిత్యాల జిల్లాకు చెందినవారు ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలవారు ఒక్కొక్కరు ఉన్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. 
 
ఈ 20 మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్‌ ప్రయాణ చరిత్ర ఉన్నవారు వివరాలను 040-24651119 నంబరుకు ఫోన్‌ చేసి లేదా 9154170960 నంబరు వాట్సాప్‌ చేయాలని మళ్లీ విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వారి ఇంటికి వెళ్లి పరీక్షలు చేస్తారని తెలిపారు.