గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 5 జనవరి 2022 (13:24 IST)

కరోనావైరస్: వ్యాక్సీన్ వేయించుకున్న వారికి కూడా కోవిడ్ ఎందుకు సోకుతోంది?

బీసీసీఐ ఛైర్మన్, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఇటీవల కాస్త నలతగా ఉండటం, జ్వరం అనిపించడంతో కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఎందుకైనా మంచిదని కోవిడ్ టెస్టు చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్ అని తేలింది. గత ఏడాది దేశంలో విధ్వంసం సృష్టించిన డెల్టా వేరియంట్ ఆయనకు సోకినట్లు టెస్టులో బైటపడింది.

 
గంగూలీ గత ఏడాది జనవరిలో గుండెపోటుకు గురయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గంగూలీ ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సీన్ తీసుకున్నారని, అయినా ఆయనకు మరోసారి కోవిడ్ సోకిందని పలు పత్రికలు రాశాయి. 

 
రెండు డోసుల టీకా తీసుకున్నా కోవిడ్ ఎందుకు సోకుతోంది? అంటే వ్యాక్సీన్ పని చేయడం లేదా?
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సీనేషన్ ప్రక్రియ విస్తృతంగా సాగుతోంది. భారతదేశం 2021 డిసెంబర్ చివరినాటికి 100 కోట్ల మందికి టీకాలు ఇవ్వడం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, వయోజనుల్లో 64 కోట్లమందికి రెండు డోసులు ఇవ్వగలిగింది. సుమారు 90 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు. ఒకవైపు ఈ ప్రయత్నాలు కొనసాగుతుండానే ఒమిక్రాన్ రూపంలో మరో కోవిడ్ వేరియంట్ భారత్‌తోపాటు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. డెల్టాతోపాటు, ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి.

 
అమెరికా, ఫ్రాన్స్, యూకే, బ్రెజిల్...ఇంకా అనేక దేశాలలో డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్‌ల వ్యాప్తి రికార్డులను బద్ధలు కొడుతోంది. అయినా, శాస్త్రవేత్తలు, వైద్యులు, ప్రభుత్వాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పరీక్షించి, ఆమోదించిన టీకాలను నమ్ముకోవాలంటున్నారు. మరి మహమ్మారిని అవి నిజంగానే అరికడుతున్నాయా?

 
కొనసాగుతున్న విమర్శలు
యూఎస్., ఫ్రాన్స్, యూకే వంటి దేశాలలో కోవిడ్ -19 కొత్త కేసులు రోజువారీ రికార్డులను బద్ధలుకొడుతుండటంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. టీకాల ప్రయోజనాలపై సరైన అవగాహన కల్పించకపోవడంతో చాలామంది వాటిని తీసుకోవడం లేదని కొందరు యూజర్లు విమర్శిస్తే, మరికొందరు మాత్రం వాటివల్ల ఏర్పడుతున్న సైడ్ ఎఫెక్ట్‌లు జనాన్ని భయపెడుతున్నాయని వాదించారు.

 
అయితే, టీకాల వల్ల దుష్ప్రభావాలు చాలా స్వల్పంగానే ఉన్నాయని, ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా, ఒకట్రెండు రోజుల్లో సర్దుకుంటాయి. ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో నొప్పి, ఎర్రగా కందిపోవడంతోపాటు, కొందరికి జ్వరం రావడం, తలనొప్పి, అలసట, చలి, కడుపులో వికారం లాంటివి ఏర్పడుతుంటాయి. అనాఫిలాక్సిస్, థ్రాంబోసిస్, పెర్కిర్డిటిస్, మయోకార్డిటిస్ (గుండె వాపు) వంటి మరింత తీవ్రమైన సంఘటనలు చాలా అరుదుదుగా మాత్రమే సంభవించాయని నిపుణులు చెబుతున్నారు. డోస్‌ వల్ల కలిగే ప్రయోజనాలతో పోలిస్తే, ప్రమాదాలు చాలా చాలా తక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 
వ్యాక్సీన్ తీసుకున్న వారికి కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదముందని, వారు ఇతరులకు ఈ వైరస్‌‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉందన్న అంశాలపై బ్రెజిల్‌కు చెందిన ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ రెనాటో కెఫౌరీ బీబీసీకి వివరణ ఇచ్చారు. ''కరోనా వైరస్ తొలివేవ్ సమయంలో తయారు చేసిన కరోనావాక్ సహా, ఫైజర్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర సంస్థల వ్యాక్సీన్‌లు శరీరంలో వైరస్ తీవ్రమైన దాడి చేయకుండా కాపాడటానికి ఉద్దేశించినవి'' అని వెల్లడించారు. "సాధారణ తీవ్రత కన్నా, శరీరంలో కోవిడ్ మరింత తీవ్రంగా ఉన్నప్పుడు ఈ వ్యాక్సీన్‌లు సమర్ధవంతంగా పని చేస్తాయి'' కెఫౌరీ అన్నారు.

 
‘‘దీనినిబట్టి చూస్తే ఇమ్యునైజేషన్ ప్రధాన లక్ష్యం ఇన్‌ఫెక్షన్‌ను ఆపడం కాదు, దానివల్ల శరీరానికి కలిగే హానిని తగ్గించడమే’’ అని ఆయన అన్నారు. దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న ఫ్లూ వ్యాక్సీన్‌కు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని వెల్లడించారు. ఫ్లూ వ్యాక్సీన్‌కు సంబంధించి ప్రతియేటా ఇచ్చే డోస్ ఉద్దేశం అది ఫ్లూ వైరస్‌ను నిరోధించడం కాదు. దాని ద్వారా శరీరానికి ఏర్పడే ఇబ్బంది, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు కలిగే ప్రమాదం నుంచి రక్షించడమే.

 
ఈ వ్యాక్సీన్‌లు ప్రధానంగా అత్యవసర కేసుల కారణంగా ఆసుపత్రులపై పడే ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. రోగులకు తగిన చికిత్స చేయడానికి ఆరోగ్య సిబ్బందికి ఎక్కువ సమయం ఇచ్చేందుకు కారణమవుతాయి. ఇక ఈ టీకాల పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో కామన్‌వెల్త్ ఫండ్ విడుదల చేసిన డేటాను బట్టి అర్ధం చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్‌ల కారణంగా ఒక్క అమెరికాలోనే నవంబర్ 2021 నాటికి దాదాపు 11 లక్షల మరణాలను నిరోధించడంతోపాటు, దాదాపు కోటిమంది ఆసుపత్రికి రావాల్సిన అవసరాన్ని తగ్గించాయని ఈ నివేదిక పేర్కొంది. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ అంచనా ప్రకారం, అమెరికా ఖండంలోని 33 దేశాలలో 60యేళ్లకు పైబడిన దాదాపు 470,000 మంది ప్రాణాలు వ్యాక్సీన్‌ల కారణంగా నిలిచాయి.

 
ప్రస్తుత పరిస్థితికి కారణమేంటి?
పూర్తి స్థాయి వ్యాక్సీన్ డోసులు తీసుకున్నవారికి కూడా వైరస్ సోకడానికి కారణమేంటి ? వ్యాక్సినేషన్ పెరుగుతున్నా ఇన్ఫెక్షన్లు కూడా ఎందుకు పెరుగుతున్నాయి?

 
దీనిని మూడు కారణాలు కనిపిస్తున్నాయి:
మొదటిది....జనం గుంపులుగా జరపుకునే క్రిస్మస్, న్యూఇయర్ లాంటి వేడుకలు ఇటీవలే ముగిశాయి. ఈ వేడుకల కారణంగా వైరస్ వ్యాప్తి సులభంగా ఒకరి నుంచి ఇంకొకరికి పాకే అవకాశం ఉంది. రెండోది... ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో టీకాలు అందుబాటులోకి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. సంవత్సరం తర్వాత టీకాల వల్ల ఏర్పడిన రోగ నిరోధక శక్తి తగ్గిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 
"కాలక్రమేణా, వ్యాక్సీన్ల రక్షణ స్థాయి పడిపోతుందని మేం గమనించాం. అయితే, అది ఎంతకాలం పని చేస్తుందన్నది వ్యాక్సీన్ రకం, వ్యక్తి వయసు ఆధారంగా ఎక్కువ తక్కువలో ఉంటాయి" అని కెఫౌరీ వివరించారు. "తాజా పరిస్థితి మూడో డోసు అవసరాన్ని గుర్తు చేసింది. ముందు వృద్ధులకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, తరువాత మొత్తం వయోజన జనాభాకు మూడో డోసు ఇవ్వాల్సి ఉంది" అని డాక్టర్ కెఫౌరీ అన్నారు.

 
ఇక మూడోది...ఒమిక్రాన్ వేరియంట్ రాక. ఇది వేగంగా వ్యాప్తి చెందగల కోవిడ్ రకం. ఇది గత కోవిడ్ వేరియంట్ నుంచి సంపాదించుకున్న రోగ నిరోధక శక్తిని తగ్గించే అవకాశం ఉన్న వేరియంట్ అని నిపుణులు చెబుతున్నారు. "వీటన్నింటిని బట్టి చూస్తే, టీకాలు వేయించుకున్న వారిలో కూడా వైరస్ కనిపించడం చాలా సర్వసాధారణ విషయం. అదృష్టవశాత్తూ, ఈ ఇటీవలి కోవిడ్ కేసుల పెరుగుదల ఫలితంగా ఆసుపత్రిలో చేరిన వారు, మరణాల రేటు తక్కువగా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే టీకాలు వేసుకున్న వారిలో మరీ తక్కువగా ఉంది'' అని కెఫౌరీ అన్నారు.

 
ఇటీవలి కాలంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం రెండు సర్వేలు నిర్వహించింది. మొదటి సర్వేలో మూడు డోసులు తీసుకున్న ఒక వ్యక్తికి ఓమిక్రాన్ సోకినట్లయితే అతను ఆసుపత్రిలో చేరాల్సిన అవకాశం 81% తక్కువగా ఉంటుందని తేల్చింది. మరో సర్వేలో మూడు డోసుల వ్యాక్సీన్ ప్రభావం 88% ఉన్నట్లు తేల్చింది. అయితే ఈ రక్షణ ఎంతకాలం కొనసాగుతుంది, వీటికి ఇంకా బూస్టర్ డోసులు అవసరమా అన్నది మాత్రం తెలియరాలేదు.

 
"ప్రతి ఒక్కరికీ వైరస్ సోకుతున్నప్పుడు డోస్‌లను తీసుకోవడంలో అర్ధం లేదు అనుకోవడం తప్పు. వ్యాధి తీవ్రతను తగ్గించడంలో వ్యాక్సీన్‌లు సక్సెస్ అయ్యాయి. ఒకవేళ మళ్లీ వైరస్ సోకినా ఆసుపత్రికి వెళ్లేంత సీరియస్ సమస్యగా మారదు'' అని కెఫౌరీ అన్నారు. ''పిల్లలు,పెద్దలు సహా ఎక్కువ మందికి వ్యాక్సీన్ అందేలా చూడటం, గుంపులు గుంపులుగా చేరకుండా జాగ్రత్త పడటం, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం, మాస్కులు వాడటం వంటి చర్యల ద్వారా మనం ఈ మహమ్మారిని కచ్చితంగా పారదోలవచ్చు'' అని కెఫౌరీ అభిప్రాయపడ్డారు.