1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2021
Written By జె
Last Modified: సోమవారం, 3 జనవరి 2022 (18:59 IST)

కరోనా మహమ్మారి కాలంలో కలియుగ వైకుంఠ నాధుడి దర్శన భాగ్యం, సేవలు ఎలా జరిగాయి?

గత రెండు సంవత్సరాలుగా తిరుమలపై కరోనా ప్రభావం పడింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌ల మధ్యే శ్రీవారి సేవా కార్యక్రమాలు సాగాయి. మరి ఈ యేడాది ఎలా ఉండబోతోంది. 2022 సంవత్సరంలో టిటిడి చేపట్టనున్న కొత్త కార్యక్రమాలేంటి?

 
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే తిరుమలలో వైకుంఠ ద్వార దర్సనాలు మొదలు కాబోతున్నాయి. పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్సనాలను కల్పించే కార్యక్రమాన్ని గత యేడాది నుంచే ప్రారంభించింది టిటిడి. ఈ యేడాది జనవరి నెల నుంచి ఈ కార్యక్రమం జరుగనుంది. 2021 ఫిబ్రవరిలో శ్రీవారి రథసప్తమి వేడుకలు భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఫస్ట్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో భక్తుల సమక్షంలో సప్తవాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్సనమిచ్చారు స్వామివారు.

 
2021 సంవత్సరంలో టిటిడి కళ్యాణమస్తు కార్యక్రమాన్ని చేపట్టాలని భావించింది. అందుకు ముహూర్తంగా కూడా ఫిక్స్ చేసింది. కానీ సెకండ్ వేవ్ ప్రభావంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరిగాయి. ఏఫ్రిల్ 14న ఉగాది నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని టిటిడి నిర్ణయించినా సెకండ్ వేవ్ ప్రభావం పెరగడంతో టిటిడి వాయిదా వేసుకుంది. అంతేకాదు దర్సనానికి అనుమతించే భక్తుల సంఖ్యను కూడా తగ్గించింది.

 
ఏప్రిల్ 20న హనుమాన్ జన్మస్థలంగా ప్రకటించింది టిటిడి. పురాణాలు, శాస్త్రాలు, చారిత్రక భౌగోళిక ఆధారాలతో కమిటీ అందించిన నివేదికను అప్పటి తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ సమక్షంలో ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించారు. మే నెలలో సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దాని ప్రభావం తిరుమలపై పడింది. పరిమిత సంఖ్యలో భక్తులను దర్సనానికి అనుమతించేలా టిక్కెట్లను జారీ చేసింది. రోజుకు 2 వేల నుంచి 4వేల మందికి మాత్రమే దర్సనం కల్పించింది.

 
మే 30వ తేదీన శ్రీవారి ప్రసాదాల తయారీకి సంబంధించి చారిత్రక నిర్ణయం తీసుకుంది టిటిడి. గోవు ఆధారిత పదార్థాలతో శ్రీవారికి నైవేద్యం సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ 12న భక్తులకు వసతి గదుల కేటాయింపు ప్రక్రియ సులభతరమయ్యేలా ఆరు ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో వసతి గదుల కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత వారికి కేటాయించిన గదులకు సంబంధించిన సమాచారం వచ్చే విధానాన్ని ప్రారంభించింది టిటిడి. జూన్ 22 నుంచి 3 రోజుల పాటు జ్యేష్టాభిషేకం ఉత్సవాలను నిర్వహించింది టిటిడి.

 
జూలైలో జిలేబీ ప్రసాదాల ధరను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 31వ తేదీన ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణం కేసులో ఆరుగురు ఉద్యోగస్తులను సర్వీసు నుంచి తొలగించారు. పాలకమండలి గడువు ముగియడంతో టిటిడి ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డితో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని తాత్కాలికంగా నియమించింది ప్రభుత్వం.

 
ఆగష్టు 8వ తేదీన టిటిడి ఛైర్మన్‌గా వై.వి.సుబ్బారెడ్డి రెండవసారి బాధ్యతలు స్వీకరించారు. ఆగష్టు 30న గోకులాష్టమి సంధర్బంగా నవనీత సేవను ప్రారంభించింది టిటిడి. గోవు పాల నుంచి వెన్నను తయారుచేసి స్వామివారి సుప్రభాతసేవ సమయంలో నైవేధ్యంగా సమర్పిస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీన శ్రీవారి భక్తులు సమర్పించిన చిల్లర నాణేలను ధనప్రసాదంగా భక్తులకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించగా 13వ తేదీన టిటిడి అనుబంధ ఆలయాలతో దేవుడికి తయారుచేసిన పుష్పాలతో అగరబత్తులను విక్రయించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 

 
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించారు. నవంబరులో కురిసిన భారీ వర్షాలు తిరుమలను అతలాకుతలం చేశాయి. నవంబర్ 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నడకమార్గాలు మూసి వేసింది టిటిడి. 18వ తేదీన కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం దెబ్బ తింది. రెండవ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడడంతో తాత్కాలికంగా ఆ మార్గాలను మూసివేశారు. నవంబర్ 29వ తేదీన డాలర్ శేషాద్రి మరణించారు. డిసెంబర్ 1న రెండవ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడడంతో మూడురోజుల పాటు మొదటి ఘాట్ రోడ్డులలోనే రాకపోకలు జరిగాయి.

 
ప్రస్తుతం రెండవ ఘాట్ రోడ్డులలో మరమ్మత్తు  పనులు జరుగుతుండడంతో లింక్ రోడ్డు మీదుగా వాహనాలను అనుమతిస్తున్నారు. మూడవ ఘాట్ రోడ్డు నిర్మించాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది. కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండడంతో జనవరి నుంచి శ్రీవారి ఆలయంలో దర్సనాల పెంపుతో పాటు సంక్రాంతి నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని టిటిడి భావించింది.