శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 25 జనవరి 2021 (13:02 IST)

కోవిడ్‌-19: సింగిల్‌ డోస్‌ వ్యాక్సీన్‌ ఎంత వరకు పని చేస్తుంది ? రెండో డోస్‌ తీసుకోకపోతే ఏమవుతుంది ?

కోవిడ్‌ వ్యాక్సీన్‌ ఒక డోస్‌ తీసుకున్న తర్వాత కూడా తీసుకోక ముందు ఉన్నట్లే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వ్యాక్సీన్‌లు తీసుకున్నా వైరస్‌ ప్రభావం పూర్తిగా పోవడం లేదు. మూత్రపిండాల వ్యాధి అనుమానంతో బ్రిటన్‌కు చెందిన 85 ఏళ్ల కోలిన్ హార్స్‌మన్‌ను డిసెంబర్ చివరలో డాన్‌కాస్టర్ రాయల్‌ మెడికల్‌ హాస్పిటల్‌ చేరారు. కొద్దిరోజులకే ఆయనకు కోవిడ్-19 సోకింది. అప్పటికే ఆ ఆసుపత్రిలో ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి కోవిడ్‌ సోకింది. ఆ తర్వాత ఆయనకు సమస్యలు మరింత పెరిగాయి. వెంటిలేటర్ మీద ఉంచినా ఆయన ప్రాణాలు దక్కలేదు.

 
చూడటానికి ఇది దురదృష్ట ఘటనగా కనిపించవచ్చు. కానీ అంతకంటే విషాదం బయట కొనసాగుతోంది. ఈ కథనం రాసే నాటికి ఒక్క బ్రిటన్‌లోనే కోవిడ్‌-19 వైరస్‌ కారణంగా 84,767మంది మరణించారు. స్థానిక మీడియా కథనం ప్రకారం హార్స్‌మన్‌ మరణానికి మూడు వారాల ముందే ఆయనకు ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ తయారీ వ్యాక్సీన్‌ తొలి డోస్‌ ఇచ్చినట్లు ఆయన కుమారుడు వెల్లడించారు. మరణించిన తేదీకి రెండు రోజుల ముందు ఆయన రెండో డోసు వ్యాక్సీన్‌ ఇవ్వాల్సి ఉంది.

 
వ్యాక్సీన్‌లకు బూస్టర్‌లు ఇవ్వాల్సిందేనా ?
చాలా వ్యాక్సీన్‌లు పని చేయాలంటే బూస్టర్‌ డోస్‌లు అవసరం. గతంలో చిన్న పిల్లలకు వచ్చిన తట్టు, గవదబిళ్లలు, పొంగు(ఎంఎంఆర్‌)లాంటి వ్యాధులకు బూస్టర్‌ వ్యాక్సీన్‌లు ఇచ్చేవారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి సోకిన పిల్లలలో రెండో డోస్‌ వ్యాక్సీన్‌ తీసుకోని 40%మందికి రక్షణ లభించలేదని, అలాగే రెండో డోసు తీసుకున్నవారిలో మళ్లీ ఆ వ్యాధులబారిన పడినవారి సంఖ్య 4శాతమేనని తేలింది. రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే ఒక డోసు తీసుకున్న వారు తిరిగి ఆ వ్యాధులకు గురయ్యే ప్రమాదం నాలుగింతలు ఎక్కువని తేలింది.

 
పూర్తి స్థాయిలో వ్యాక్సీనేషన్‌ తీసుకోనివారు ఉన్న ప్రాంతాలలో ఈ వ్యాధులు తిరిగి విజృంభించిన సందర్భాలు కూడా ఉన్నాయి. “ఇమ్యూన్‌ సిస్టమ్‌ (వ్యాధి నిరోధక శక్తి)ను సరైన రీతిలో పని చేసేలా చేస్తాయని నమ్మడం వల్లే ప్రజలు బూస్టర్‌ వ్యాక్సీన్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు’’ అని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌లో ఇమ్యూనాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డానీ ఆల్ట్‌మన్‌ అన్నారు.

 
బూస్టర్‌ వ్యాక్సీన్‌లు ఎలా పనిచేస్తాయి?
మొదటి డోసు టీకా రోగ నిరోధక వ్యవస్థను తాకినప్పుడు రెండురకాల తెల్ల రక్తకణాలను యాక్టివేట్ చేస్తుంది. ఇందులో మొదటివి ప్లాస్మా బి-కణాలు. ఇవి యాంటీబాడీలను తయారు చేయడంలో కీలకంగా పని చేస్తాయి. కానీ ఇవి ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. టీకా తీసుకున్న మొదటి కొద్దివారాలు శరీరంలో తెల్లరక్త కణాలు సజీవంగా ఉన్నా రెండో డోసు లేకపోతే అవి క్రమంగా బలహీనపడతాయి.

 
ఇక రెండో రకం కణాలను టి-సెల్స్‌ అంటారు. ఇవి వ్యాధికారక వైరస్‌ను గుర్తించి చంపేస్తాయి. ఇందులో కొన్ని కణాలు మనిషి శరీరంలో జీవితకాలంపాటు ఉండి, తమ శత్రువుల మీద పోరాడుతుంటాయి. అంటే కొన్నిసార్లు వ్యాక్సీన్ లేదా వైరస్‌ల వల్ల పుట్టే రోగ నిరోధక శక్తి చాలాకాలం పాటు కొనసాగుంది. అయితే రెండో డోసు తీసుకునే వరకు ఇవి శరీరంలో మరిన్ని ఉండవు. బూస్టర్‌ వ్యాక్సీన్‌లు వ్యాధి నిరోధక శక్తిని పునరుత్తేజం కలిగించడానికి వాడే ఔషధాల్లాంటి. “బూస్టర్‌ వ్యాక్సీన్‌ తీసుకున్నామంటే శరీరంలో యాంటీబాడీలను సృష్టించే బి-కణాలను, అలాగే వైరస్‌లను గుర్తించి చంపే టి-కణాలను శరీరంలో ఎక్కువకాలం ఉండేలా చూసుకోవడమే’’ అన్నారు ప్రొఫెసర్‌ ఆల్ట్‌మన్‌.

 
రెండో దఫా వ్యాక్సీన్‌ తీసుకున్నప్పుడు బి-కణాలు వేగవంతంగా పని చేయగలుగుతాయి. మరిన్ని యాంటీబాడీలను సృష్టించగలుగుతాయి. రెండో దఫా టీకాలు బి-కణాలు పరిణితి చెందించడమే కాకుండా, పరిణితి లేని కణాలు కూడా వైరస్‌లపై యుద్ధం చేసేలా వాటి సామర్ధ్యాన్ని పెంచుతాయి. బి-కణాలు ఎముక మజ్జలో ఉన్నప్పుడే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఎముక మజ్జలో తెల్ల రక్తకణాలు తయారవుతాయి. తరువాత అవి ప్లీహానికి చేరుకుని అక్కడ వృద్ధి చెందుతాయి. అంటే బి-కణాలు పెద్ద ఎత్తున శరీరంలో ఉండటమే కాక, నిత్యం యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తూ వైరస్‌లపై పోరాడుతుంటాయి.

 
బూస్టర్‌ వ్యాక్సీన్‌ల వల్ల టి-కణాలు కూడా వేగంగా పెరుగుతాయి. ప్రస్తుత మహమ్మారి సమయంలో ఇవి కీలక పాత్ర పోషించాయని, కొంతమందిలో తీవ్రమైన కోవిడ్-19 సమస్యలు ఏర్పడకుండా అడ్డుకున్నాయని నిపుణులు భావిస్తున్నారు. తాజా కోవిడ్‌ 2019 డిసెంబర్ నుంచి వ్యాప్తి చెందుతున్నప్పటికీ, జలుబుకు కారణమయ్యే ఇతర కరోనా వైరస్‌లను ఈ టి-కణాలు ఇంతకు ముందే చూసి ఉంటాయని భావిస్తున్నారు. అందువల్లే అవి కోవిడ్‌-19ను సులభంగా గుర్తించగలిగాయని అంటున్నారు.

 
మరి సింగిల్‌ డోస్‌ కోవిడ్‌-19 వ్యాక్సీన్‌లు ఎంత వరకు సమర్థవంతమైనవి?
అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యాక్సీన్‌ రెండో డోసును వాడాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆమోదించిన వ్యాక్సీన్‌ల రెండో డోసును 3-4 వారాల నుంచి 12 వారాలకు ఆలస్యం బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రష్యా తన సింగిల్ డోస్‌ వ్యాక్సీన్‌ స్పుత్నిక్‌-వి తో సరిపెట్టినా అది కూడా సంక్లిష్టంగానే ఉంది. ఎందుకో తెలుసుకుందాం

 
ఫైజర్‌-బయోఎన్‌టెక్‌
ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ తమ వ్యాక్సీన్‌ తొలి డోసు తర్వాత 52% సమర్థవంతంగా పని చేసిందని గత డిసెంబర్‌లో ప్రకటించింది. మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా 36,523మందిపై ప్రయోగాలు జరిగాయి. కొందరికి 21 రోజుల వ్యవధిలో రెండుసార్లు వ్యాక్సీన్‌ ఇవ్వగా, వైరస్‌ లక్షణాలు లేని వారికి ప్లాసిబో (ఉత్తుత్తి వ్యాక్సీన్‌) ఇచ్చారు. అయితే ప్లాసిబో వ్యాక్సీన్‌ తీసుకున్న వారిలో 82మందికి వైరస్‌ సోకగా, నిజమైన వ్యాక్సీన్‌ తీసుకున్న వారిలో 39మందికి కోవిడ్‌ సోకినట్లు తేలింది.

 
అయితే ఈ ప్రారంభ దశలో లభించే రక్షణకు కొన్ని మినహాయింపులున్నాయి. మొదటి దశ వ్యాక్సీన్‌ తీసుకున్నవారికి 12 రోజుల వరకు వైరస్‌ నుంచి రక్షణ లభించదు. అంటే అంత వరకు ఈ రెండు గ్రూపుల (ప్లాసిబో ట్రీట్‌మెంట్‌, నిజమైన ట్రీట్‌మెంట్ తీసుకున్నవారు) మధ్య రక్షణలో పెద్ద తేడా ఉండదు. రెండు మోతాదులకన్నా ఒక మోతాదు నుంచి రక్షణ తక్కువగా ఉంటుంది. రెండో మోతాదుతో 95% రక్షణ లభిస్తుంది.

 
అయితే ఆన్‌లైన్‌లో మరో వార్త కూడా ప్రచారం అవుతోంది. కొందరు డాక్టర్లు రోగులకు ఇచ్చిన మొదటి మోతాదు 90% ప్రభావవంతంగా ఉంటుందని వారు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. టీకా సమర్ధతను భిన్నంగా అంచనా వేసే యూకేకు చెందిన వ్యాక్సిన్ కమిటీ జేసీవీఐ నుంచి మరోరకం అంచనాలు వచ్చాయి. ఈ కమిటీ ఇన్‌ఫెక్షన్లకు గురైనవారి సంఖ్యకు సంబంధించిన డేటా ఆధారంగా తీసుకోలేదు. మొదటి డోసు పని చేయడం ప్రారంభించని రోజులకు బదులుగా టీకా తీసుకున్న 15 నుంచి 21 రోజుల మధ్య దాని ప్రభావాన్ని అంచనా వేసింది. ఈ పద్ధతిని ఉపయోగించి పరిశీలించినప్పుడు టీకా సమర్థత 89% వరకు పెరిగినట్లు తేలింది. ఎందుకంటే ఇది ప్రభావం చూపడానికి ముందు ఇతర వైరస్‌లు ఈ టీకాను సమర్ధతను దెబ్బతీయవుర్.

 
మరో విధానంలో రెండో డోసు వేసిన తర్వాత వారం రోజుల్లో అంటే రెండో డోసు పని చేయడానికి ముందు మొదటి టీకా పని తీరును పరిశీలించగా దాని సమర్ధత 92%గా తేలింది.అయితే ఈ అంచనాలపై అభ్యంతరాలు, వివాదాలు ఉన్నాయి. “వ్యాక్సీన్‌ తీసుకున్న 14వ రోజు తర్వాత నుంచి మెరుగైన ఫలితాలు కనిపించాయన్న ఆ కంపెనీ ప్రకటన ప్రజలు ఆసక్తి చూపించారు” అన్నారు ప్రొఫెసర్‌ ఆల్ట్‌మన్‌.

 
“ప్లాసిబో గ్రూప్‌, వ్యాక్సీన్‌ గ్రూపులకు చెందిన గ్రాఫిక్స్‌ పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్లాసిబో గ్రూపులో కేసులు పెరిగాయి. కాకపోతే ఇది మనుషులలో వ్యాధి నిరోధకత డేటాను కాక, కేవలం ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారి సంఖ్యను మాత్రమే సూచిస్తుంది’’ అన్నారు ఆల్ట్‌మన్‌. మొదటి డోస్‌ తీసుకున్న 14వ రోజు తర్వాత వైరస్‌ పీడితులు తప్పకుండా రక్షణ పొందుతారన్నది దీని భావం కాదని ఆల్ట్‌మన్‌ అన్నారు.

 
ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా
ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ విషయంలో ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. జనవరిలో ఆ కంపెనీ ప్రచురించిన పేపర్‌ ప్రకారం, తొలి డోసు తర్వాత వారి వ్యాక్సీన్‌ ప్రభావం 64.1% వరకు ఉంటుంది. రెండు డోసులతో కలిపి ఈ వ్యాక్సీన్‌ ప్రభావం 70.4% నుంచి 90% వరకు ప్రభావం ఉంటుంది. అయితే ఆ కంపెనీ బైటకు చెప్పని డేటా ఆధారంగా తొలి వ్యాక్సీన్‌ తీసుకున్న 3వ వారం నుంచి 9-12 వారాల వరకు దాని ప్రభావం 70శాతం వరకు ఉంటుందని వ్యాక్సీన్‌ కమిటీ అంచనా వేసింది.

 
ఎందుకంటే మూడో దశ ట్రయల్స్‌కు ముందు, మొదటి, రెండో డోసులకు మధ్య రెండు అంతరాలు ఉన్నాయి. ఒకటి 6 వారాలపాటు ఉండగా, రెండోది 12 వారాల వరకు ఉంది. దీనినిబట్టి మొదటి డోసు, రెండో డోసు బూస్టర్‌ వ్యాక్సీన్‌ తీసుకోవడానికి ముందు కొన్ని నెలల పాటు రక్షణ ఇస్తుందని అర్ధం చేసుకోవచ్చు.

 
మోడెర్నా
ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అథారిటీకి మోడెర్నా కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ కంపెనీ వ్యాక్సీన్‌ మొదటి డోస్‌ తర్వాత 80.2%, రెండో డోసు తర్వాత 95.6% రక్షణ కల్పిస్తుంది. ( ఈ ఫలితం 18-65 సంవత్సరాల మధ్య వయస్కులకు సంబంధించినది. అదే 65 సంవత్సరాలు పైబడిన వారైతే దాని ప్రభావం 86.4% మాత్రమే). ఫైజర్‌ వ్యాక్సీన్‌లాగే మూడో దశ ట్రయల్స్‌లో రెండు విడతలుగా రియల్‌ వ్యాక్సీన్, ప్లాసిబోవ్యాక్సీన్‌లను ఒకే టైమ్‌లో అంటే 28 రోజుల వ్యవధిలో ఇచ్చారు. అందుకే ఈ దశ తర్వాత సింగిల్ వ్యాక్సీన్‌ ద్వారా వచ్చిన రోగ నిరోధక శక్తి కొనసాగుతుందా అన్నది చెప్పడం కష్టంగా మారింది.

 
సినోవాక్‌
చైనాకు చెందిన సినోవాక్‌ కంపెనీ ‘ది కరోనావ్యాక్‌’ అనే వ్యాక్సీన్‌ను తయారు చేసింది. దీనిని వివిధ దేశాలలో వివిధ పద్దతుల్లో పరిశీలించగా భిన్నమైన ఫలితాలు కనిపించాయి. టర్కీకి చెందిన కొందరు పరిశోధకుల అంచనా ప్రకారం ఈ వ్యాక్సీన్‌ 91.25% రక్షణ ఇస్తుంది. అయితే ఇండోనేషియాకు చెందిన సైంటిస్టులు మాత్రం దీని ప్రభావం 65.3% అని, బ్రెజిల్‌కు చెందని ఓ పరిశోధనా సంస్థ 50.4%గా అంచనా వేసింది. ఈ అంచనాలన్నీ 14 రోజుల వ్యవధిలో రెండు డోసుల ప్రకారం వేసినవే.

 
అయితే ఈ ఫలితాల మీద కొందరికి సందేహాలున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి పరిశోధనా పత్రాలను మెడికల్‌ జర్నల్స్‌కు పంపి కూలంకషంగా పరిశీలించిన తర్వాతే ప్రచురిస్తారు. కానీ సినోవాక్‌కు సంబంధించిన పరిశీలనలన్నీ మీడియా రిలీజ్‌ల ద్వారానే బైటకు వచ్చాయి.

 
సినోఫామ్‌
చైనా నుంచి కనీసం ఐదు రకాల వ్యాక్సీన్‌ల తయారీ వివిధ దశల్లో ఉంది. సినోఫామ్‌ కంపెనీ తయారు చేస్తున్న "BBIBP-CorV" ఇందులో ఒకటి. చైనా అధికారులు ప్రకటించిన దాని ప్రకారం రెండు డోసుల తర్వాత ఈ వ్యాక్సీన్‌ 79% ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇప్పటికే 10లక్షలమందికి పైగా ఈ వ్యాక్సీన్‌ను అందించారు.

 
అయితే చైనా అధికారులు చెప్పిన అంశాలను అంతర్జాతీయ నిపుణులు పరిశీలించి ధృవీకరించలేదు. ఆ కంపెనీ ట్రయల్స్‌ నిర్వహించిన తీరును బైట పెట్టకపోవడమే దీనికి కారణం. తొలి డోసు తర్వాత ఇది ఎంత మాత్రం ప్రభావవంతంగా ఉంటుందన్న విషయం ఇంకా తెలియరాలేదు. చైనాకు ఆవల బహ్రైన్‌, ఈజిప్ట్‌, జోర్డాన్‌, సెషెల్స్‌, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లాంటి దేశాలు ఈ వ్యాక్సీను ఆమోదించాయి. ఇది 86% సమర్ధవంతంగా పని చేస్తోందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది.

 
స్పుత్నిక్‌-వి
రష్యాకు చెందిన గమలేయా రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సీన్‌ను రూపొందించింది. మిగిలిన వ్యాక్సీన్‌లలాగే దీన్ని కూడా రెండు డోసులు ఇవ్వాల్సి ఉండగా, రెండు డోసుల తర్వాత దాని పని తీరు 91.4% ఉన్నట్లు తేలింది. అయితే ఒక డోసు తర్వాత దాని పని తీరు ఎలా ఉంటుందన్న విషయం ఇంకా తెలియరాలేదు.

 
అయితే ఈ వివరాలు కూడా మెడికల్ జర్నల్‌ ద్వారా రాలేదు కాబట్టి వీటిని కూడా పూర్తి స్థాయిలో నమ్మడం కష్టం. రష్యాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ఈ వ్యాక్సీన్‌పై రష్యన్‌లే సందేహాలు వ్యక్తం చేస్తున్నారని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక వెల్లడించింది. ఈ వ్యాక్సీన్‌ ఇవ్వడం మొదలు పెట్టిన డిసెంబర్‌ మొదటి వారం నుంచి వ్యాక్సీనేషన్‌ సెంటర్లు సగం ఖాళీగా కనిపించాయని తెలిపింది. తాజాగా స్పుత్నిక్‌ లైట్‌ పేరుతో తాము సరికొత్త వ్యాక్సీన్‌ వెర్షన్‌ను తీసుకొస్తున్నామని రష్యా ప్రకటించింది. ఈ వ్యాక్సీన్‌ను ఒక డోసులోనే ఇస్తారు. అయితే దీని పని తీరు ఎలా ఉంటుందన్నది ఇంకా తెలియదు.

 
సింగిల్‌ డోస్ వ్యాక్సీన్ తర్వాత..
“వ్యాక్సీన్‌ తీసుకున్నా, తీసుకోకముందు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను’’ అన్నారు ప్రొఫెసర్‌ ఆల్ట్‌మన్‌. “అంతకు ముందుకన్నా భిన్నంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రవర్తించను’’ అని స్పష్టం చేశారాయన. “దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది మనకు పూర్తిస్థాయి రక్షణ ఇంకాలభించలేదు. రెండోది ఈ వ్యాక్సీన్‌ వైరస్‌ను ఆపుతుందనిగానీ, ఇతరులకు వ్యాపించకుండా నిరోధిస్తుందనిగానీ గ్యారంటీ లేదు’’ అన్నారు యూనివర్సిటీ ఆఫ్‌ సర్రేలో ఇమ్యూనాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డెబోరా డన్‌-వాల్టర్స్‌.

 
“వ్యాక్సీన్‌లు శరీరంలో వైరస్‌ లక్షణాలను ఆపుతాయి తప్ప, వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా అడ్డుకోలేవు’’ అన్నారామె.“అది ఒక డోసు కావచ్చు, రెండు డోసులు కావచ్చు. ఒకరి నుంచి ఒకరికి వైరస్‌ సోకుండా అడ్డుకుంటుందని ఎక్కడా లేదు’’ అని తేల్చి చెప్పారు ప్రొఫెసర్‌ డన్‌వాల్టర్స్‌.

 
రెండో డోస్‌ వ్యాక్సీన్‌ను మానేయొచ్చా ?
“ఒక్క డోసుతోనే ఇమ్యూనిటీ పెరుగుతుందని ప్రి-క్లినికల్ ట్రయల్స్‌లో ఎక్కడా నిరూపణ కాలేదు. కాబట్టి రెండో డోసు తప్పదు’’ అన్నారు డన్‌-వాల్టర్స్‌. పైగా మూడో దశ ట్రయల్స్‌ సందర్భంగా రెండో డోసు తర్వాతే యాంటీబాడీలు, టి-కణాలు పెరిగినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారామె. “రెండో డోసు తీసుకోకుండా వదిలేయడం పెద్ద తప్పు. రెండోది మొదటి డోసుకు రెట్టింపు రక్షణను ఇస్తుంది’’ అని ఫైజర్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆల్బర్ట్‌ బౌర్లా గత డిసెంబర్‌లో వ్యాఖ్యానించారు.

 
21 రోజుల తర్వాత మొదటి డోసు పని తీరు ఎలా ఉంటుందన్న దానిపై తమ వద్ద సమాచారంలేదని ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ వెల్లడించింది. తొలి డోసు తీసుకున్నవారు 21 రోజుల తర్వాత హఠాత్తుగా సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంది. అయితే ఇది రోగ నిరోధక వ్యవస్థ పనితీరులో సర్వసాధారణంగా ఉండే వ్యవహారమేనని ఆ కంపెనీ వెల్లడించింది. ఎంత సాంకేతిక పరిజ్జానం అందుబాటులో ఉన్నా తొలి డోసు వ్యాక్సీన్‌ రక్షణ ఎంతకాలం కొనసాగుతుంది, ప్రభావం ఎన్నాళ్లు కొనసాగుతుంది అన్నదానిపై పూర్తి స్థాయి నిర్ధారణ అసాధ్యంగా మారింది.

 
ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్‌ వ్యాక్సీన్‌లలో మార్పు చేసిన ఎడినోవైరస్‌ వెర్షన్లు ఉన్నాయి. ఇవి శరీరంలోని వివిధ రకాల కణాలలోకి చొచ్చుకునిపోయి శ్వాస సమస్యల్లాంటి అనారోగ్యాన్ని సృష్టించగలవు. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సీన్‌లో చింపాజీలలోని అడినోవైరస్‌ను ఉపయోగించగా, రష్యన్‌ వ్యాక్సీన్‌ మనుషులలోని రెండు రకాల అడినోవైరస్‌లను ఉపయోగించింది.
ఈ వైరస్‌లలో మార్పులు చేసినందువల్ల అవి ఎలాంటి ప్రమాదాన్నికలిగించవు. కరోనా వైరస్‌ను ఎలా గుర్తించాలో శరీరానికి ఇవి తర్ఫీదునిస్తాయి.

 
ఎడినో వైరస్‌ను క్యాన్సర్‌ వ్యాక్సీన్‌లలో, జన్యు చికిత్సలో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. గతంలో దీన్ని ఒక్క ఎబోలా అంటువ్యాధి నివారణ వ్యాక్సీన్‌లో మాత్రమే ఉపయోగించారు. దీన్ని 2020 జులైలో యూరోపియన్‌ యూనియన్‌ ఆమోదించింది. మోడెర్నా, ఫైజర్‌బయోఎన్‌టెక్‌లు ఇంతా అత్యాధునిక పద్దతుల్లో టీకాను రూపొందించాయి. ఇవి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్లు. అంటే..ఇందులో కరోనావైరస్ జన్యు సంకేతంలో కొంత భాగాన్ని ఉపయోగిస్తారు. శరీరంలోకి పంపించటం ద్వారా శరీరంలో వైరల్ ప్రొటీన్లు తయారయ్యేలా చేస్తుందీ వ్యాక్సీన్. కానీ వైరస్ పూర్తిగా తయారు కాదు.

 
వైరస్ మీద దాడి చేయటంపై రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇచ్చేందుకు సరిపోయే స్థాయిలో వైరల్ ప్రొటీన్లు ఉత్పత్తి అవుతాయి. ఇప్పటి వరకు మనుషుల మీద ఉపయోగించడానికి అనుమతి పొందిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్‌లు ఇవే. ‘కరోనావాక్’, సినోఫామ్‌లు నిష్క్రియం చేసిన కరోనా వైరస్‌ కణాలను ఉపయోగించి తయారు చేశారు. వీటి నుంచి చనిపోయిన వైరస్‌ కణాలను శరీరంలోకి పంపించటం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తారు. దీని వలన వ్యాక్సీన్ ద్వారా వైరస్‌ సోకి, జబ్బుపడే ప్రమాదం ఉండదు.

 
అయితే ఈ ప్రయోగం చాలా తక్కువ సందర్భాలలోనే వినియోగించారు. మృత వైరస్‌ర్ కణాలను శరీరంలోకి పంపి వైరస్‌పై పోరాడేలా వ్యాధి నిరోధకతను ప్రేరేపించే విధానం 19శతాబ్ది చివరి నుంచి ప్రారంభమైంది. అయితే దీని ద్వారా సాధించిన ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుందనే దానిపై స్పష్టత రాలేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వైరస్‌ సంబంధించిన కణాలు గతంలో ఎక్కడా లేవు.

 
రోగ నిరోధకత పెరగడానికి వ్యవధి
వ్యాధి నిరోధకత అభివృద్ధి చెందడానికి ఎంత సమయం పడుతుందని ప్రొఫెసర్‌ డన్‌-వాల్టర్స్‌ అంటారు. అది సింగిల్‌ డోస్‌ కావచ్చు. డబుల్‌ డోస్‌ కావచ్చు వాటి నుంచి చివరికి రక్షణ అయితే లభిస్తుంది. అయితే తీసుకున్న మొదటి కొద్దిరోజులు మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని ఆమె స్పష్టం చేస్తున్నారు. “శరీరంలో సహజమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది. అది వైరస్‌ శరీరంలోకి ప్రవేశించగానే స్పందిస్తుంది. వైరస్‌కు భౌతికంగా ఇబ్బందులు సృష్టిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో అది వైరస్‌ను ఎదుర్కోలేదు. అందువల్ల దానికి సహకరించే వ్యవస్థ కావాలి. అయితే ఈ వ్యవస్థలు వైరస్‌ నుంచి రకరకాల సవాళ్లను ఎదుర్కొంటాయి” అంటారు డన్‌-వాల్టర్స్‌

 
"వ్యాక్సీన్‌లు ఏవైనా శరీరంలోని రోగ నిరోధక శక్తిని ప్రేరేపించడమే వాటిపని. అందులో కొన్ని యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. అయితే అందుకు కొంత సమయం పడుతుంది’’ అన్నారు వాల్టర్స్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సీనేషన్‌ కొనసాగుతుండటంతో వాతావరణం కొంత ఉత్సాహభరితంగా ఉన్నా, పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి మాత్రం కొంత సమయం పడుతుంది.