మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (21:09 IST)

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ గెలుచుకున్న గుకేశ్ దొమ్మరాజు

Gukesh Dommaraju
కర్టెసి-ట్విట్టర్
ఏ మ్యాచ్‌లోనైనా మొదటి ఎత్తుగడ వేసే ముందు ఒక్క క్షణం కళ్లు మూసుకోవడం గుకేశ్ దొమ్మరాజుకు అలవాటు. ఈసారి ఆయన ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలవాలనుకున్నారు, అది ఇప్పుడు నిజమైంది. చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. 2024 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 13 మధ్యలో సింగపూర్‌లో ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ జరిగింది. 
 
గత 138 సంవత్సరాలలో మొదటిసారిగా ఇద్దరు ఆసియా క్రీడాకారులు ఈ టైటిల్ కోసం పోటీ పడ్డారు. వీరిలో ఒకరు ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరెన్, భారత ప్లేయర్ గుకేశ్ దొమ్మరాజు. ఇద్దరు ఆటగాళ్లు మొత్తం 14 రౌండ్లలో 13 రౌండ్ల పాటు సమంగా ఉన్నారు, గట్టి పోటీని ప్రదర్శించారు. ప్రతి రౌండ్‌ చాలా సేపు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చదరంగం ఔత్సాహికులను వీరి ఆట ఆకర్షించింది.
 
తొలి ఛాంపియన్ షిప్
గుకేశ్‌కి ఇది తొలి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్. అతను భారత చెస్ రంగంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ఇంత భారీ టోర్నీలో పాల్గొనడంపై గుకేశ్ ఆనందం వ్యక్తంచేశాడు. గెలిస్తే ఏం చేస్తారని సింగపూర్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నకు.. 'నాకు తెలియదు, ముందుగా సంతోషిస్తాను' అని బదులిచ్చారు గుకేష్. 22 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్ మ్యాచ్ తొమ్మిదో రౌండ్ ముగింపు తర్వాత మాట్లాడుతూ.. గుకేష్ టోర్నీలో ఫేవరెట్ కాదని చెప్పారు.
 
కానీ, ఏడో రౌండ్‌లో గుకేశ్ ఆటతీరును గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రశంసించారు. "ఇది చాలా క్లిష్టమైన, కష్టమైన గేమ్" అని అన్నారు. "గుకేష్‌కు ఆత్మవిశ్వాసం ఎక్కువ, చాలా కష్టపడి పని చేస్తాడు" అని భారత చెస్ జట్టుకు అనేక సంవత్సరాలుగా కోచ్‌గా ఉన్న ఆర్‌బీ రమేష్ అన్నారు. కార్ల్‌సెన్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. "కార్ల్‌సెన్ అత్యుత్తమ ఆటగాడు. ఆయన వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. గుకేష్ వాటిని పట్టించుకోడు'' అని తెలిపారు.
 
బాల్యం ఎలా సాగింది?
చెన్నై నగరాన్ని భారత చెస్ రాజధానిగా పిలుస్తుంటారు. ఈ నగరం చాలామంది చెస్ చాంపియన్‌లను తయారుచేసింది. గుకేశ్ తండ్రి పేరు రజనీకాంత్, ఈఎన్‌టీ సర్జన్‌గా పనిచేసేవారు. కుమారుడికి చెస్‌పై ఉన్న ఆసక్తిని గమనించిన రజనీకాంత్ 2017లో వైద్య వృత్తిని విడిచిపెట్టారు. గుకేశ్ తల్లి డాక్టర్ పద్మకుమారి మద్రాసు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. గుకేశ్ కుటుంబంలో మార్గనిర్దేశం చేయడానికి లేదా ఇన్‌స్పైర్ చేయడానికి చెస్ ప్లేయర్స్ ఎవరూ లేరు, అయినా కూడా ఆటపై అతనికున్న ఫ్యాషన్ ఇంత దూరం తీసుకువచ్చింది.
 
మొదటగా ఇంట్లో వారితో చెస్ ఆడటం ప్రారంభించారు గుకేశ్. అక్కడే బేసిక్స్ నేర్చుకున్నారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను గెలుచుకున్నారు. పని ముగించుకొని తండ్రి స్కూలుకు వచ్చేంత వరకు ఖాళీగా ఉండకూడదని పాఠశాల తర్వాత చెస్ ప్రాక్టీస్ సెషన్‌ కోసం పేరు నమోదు చేసుకున్నారు గుకేశ్. గుకేశ్ ప్రతిభను గుర్తించిన కోచ్ అతనికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. అతనికి తల్లిదండ్రులు, పాఠశాల నుంచి మద్దతు లభించింది. స్థానిక టోర్నమెంట్లలో పాల్గొనడం ప్రారంభించారు. బహుమతులు గెలుచుకున్నారు.
 
రికార్డులు, విజయాలు
2015లో గోవాలో జరిగిన నేషనల్ స్కూల్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుపొందిన గుకేశ్, ఆ తర్వాత రెండేళ్లపాటు టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. 2019 జనవరిలో అతను గ్రాండ్‌మాస్టర్‌ గౌరవం పొందాడు. భారత్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడు గుకేశ్. చెస్ ర్యాంకింగ్స్‌లో ఇండియా నుంచి రెండో స్థానంలో ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉన్న గుకేశ్, ఈఎల్‌వో ర్యాంకింగ్స్‌లో 2,750 పాయింట్లను అధిగమించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
 
గుకేశ్ 2016లో కామన్వెల్త్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. స్పెయిన్‌లో 2018 అండర్-12 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. 2021లో గుకేశ్ యూరోపియన్ చెస్ క్లబ్ కప్‌లో స్వర్ణం సాధించాడు, అక్కడ అతను మాగ్నస్ కార్ల్‌సెన్‌తో పోటీ పడ్డాడు. ఫ్రాన్స్‌లో కేన్స్ ఓపెన్ 2020, నార్వేజియన్ మాస్టర్స్ 2021, స్పెయిన్‌లో మెనోర్కా ఓపెన్ 2022, ఎలైట్ నార్వే గేమ్స్‌ 2023తో సహా 10 ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్నాడు గుకేశ్.