ఒకపక్క కోతల సమయం, మరో పక్క కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్.. ఈ పరిస్థితులు వ్యవసాయదారులను క్రమంగా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. రబీ పంట కళ్ల ముందు కనిపిస్తున్నా, దాన్ని ఎలా అమ్మి సొమ్ము చేసుకోవాలో రైతులకు అర్థం కావడం లేదు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అందరికీ సాయంగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో అది జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్, రబీ సాగు పెరిగింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి విస్తారంగా వరి పండించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 2017-18లో రబీలో 7.41లక్షల హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. 2018-19లో అది 6.44 లక్షల హెక్టార్లకు స్వల్పంగా తగ్గింది. కానీ ఈసారి అది గత ఏడాదితో పోలిస్తే 10 శాతం పెరిగింది. ప్రస్తుతం 7.64 లక్షల హెక్టార్లలో వరిని పండించారు. సాగు విస్తీర్ణం పెరగడంతో దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది.
గతంతో పోలిస్తే ఈసారి వర్షపాతం అనుకూలంగా ఉండడంతో, సాగునీటి సమస్యలు చాలా వరకూ తగ్గాయి. అదే సమయంలో పైరుపై ఇతర తెగుళ్లు కూడా నియంత్రణలో ఉండటంతో పరిస్థితి సానుకూలంగా ఉంటుందని రైతులు ఆశించారు. కానీ, రబీ పంట చేతికొచ్చే సమయానికి కరోనా రూపంలో రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. లాక్‌డౌన్ కారణంగా వివిధ రంగాల్లో కార్యకలాపాలు స్తంభించడంతో ఆ ప్రభావం కోతలు, అమ్మకాలపై పడింది.
కూలీలు, కోత యంత్రాల కొరత.. కళ్లాల్లోనే ధాన్యం
మార్చి నెల మొదటి నుంచే మాసూళ్లు మొదలయ్యాయి. ఏప్రిల్ నెల చివరి నాటికి అవి పూర్తి కావాల్సి ఉంది. కానీ, వరి కోతలకు ఈసారి కూలీల కొరత తీవ్ర అడ్డంకిగా మారిందని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన రైతు గుబ్బల రామలింగేశ్వర రావు బీబీసీకి తెలిపారు.
‘‘ఏటా ఒడిశా, ఉత్తరాంధ్ర నుంచి కూలీలు వచ్చేవారు. కొన్నేళ్లుగా వరి కోత యంత్రాలను ఉపయోగించి ధాన్యం సేకరిస్తున్నాం. కానీ ఆ ధాన్యాన్ని కళ్లాల నుంచి కొనుగోలు కేంద్రాలకు, రైస్ మిల్లుకు చేర్చాలంటే కూలీలు అవసరం. ఇప్పుడు ఆ పనికి కూడా కూలీలు అందుబాటులో లేరు.
వెసులుబాటు ఉన్నవారు కూడా ఆంక్షలు, వైరస్ భయంతో పనులకు రావట్లేదు. దాంతో వరికోతలు సక్రమంగా సాగడం లేదు. కోత కోసిన ధాన్యం కూడా బస్తాలు పట్టి, మిల్లుకి తరలించడం కష్టంగా మారుతోంది’’ అని తెలిపారు. రబీలో వరి సాగు విస్తీర్ణం పెరగడం, దాదాపుగా అన్ని చోట్లా ఒకేసారి కోతలు రావడం, కూలీలతో చేయించాల్సిన పని కూడా యంత్రాలతో చేయించాల్సిన పరిస్థితి ఎదురవడంతో అందుబాటులో ఉన్న వరికోత యంత్రాలు సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు.
కోత యంత్రాల కోసం డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో తగినన్ని సరఫరా చేయలేకపోతున్నట్లు మెషీన్లను సరఫరా చేసే వ్యాపారి పి.నరసింహం తెలిపారు. ‘‘మా దగ్గర ఐదు మెషీన్లు ఉన్నాయి. సీజన్‌లో ఏడాదికి రెండు నెలలు మాత్రమే పని ఉంటుంది. కానీ, ఇప్పుడు రబీలో డిమాండ్ బాగా పెరిగింది. మా దగ్గర ఉన్న యంత్రాలు సరిపోవడం లేదు. గతంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో కోతలు జరిగేవి. ఈసారి అలా లేదు.
ఇక కూలీలు లేకపోవడంతో అందరూ యంత్రాల కోసమే చూస్తున్నారు. ప్రభుత్వం అదనంగా యంత్రాలను రప్పించింది. కానీ, వాటితో కూడా రైతుల డిమాండ్ తీరడం లేదు. మరో నెల రోజుల పాటు పరిస్థితి ఇలానే కొనసాగొచ్చు. ఇంకోపక్క మాక్కూడా మెషీన్ ఆపరేటర్ల సమస్య ఉంది. తగినంత మంది ఆపరేటర్లు లేరు. ఉన్నవాళ్లలో కూడా చాలామంది పనికి రావట్లేదు. గతంలో తమిళనాడు, పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లు కూడా ఇప్పుడు అందుబాటులో లేరు. దాంతో కొన్ని చోట్ల మెషీన్లు ఉన్నా పని చేయలేని పరిస్థితి ఉంది’’ అంటూ వివరించారు.
పాత బకాయిల కోసం ఇంకా ఎదురుచూపులు
ఆంధ్రప్రదేశ్‌లో 2000-01 సంవత్సరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా ప్రభుత్వమే ధాన్యం సేకరించే విధానం అమలులోకి వచ్చింది. పౌరసరఫరాల శాఖ ద్వారా వాటిని కొనుగోలు చేసి, రైసు మిల్లులకు తరలించి, ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐ గొడౌన్లకు చేర్చి నిల్వ చేస్తారు. అందులో కేంద్రం కొంత వాటాగా తీసుకోగా, మిగిలిన మొత్తాన్ని ఏపీలోనే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరవేసేందుకు ప్రయత్నిస్తారు.
అయితే ఇలా 2019-20 సంవత్సరంలో ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు నేటికీ ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వం వైపు నుంచి డబ్బులు పూర్తిగా చెల్లించలేదు. ఇప్పటికీ కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కోసం ఎదురుచూస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఈ విషయంపై ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘కేంద్రం నుంచి ఇంకా రూ.4వేల కోట్లు బకాయిలు రావాలి. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరాం. కేంద్రం నుంచి రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా వరకూ రైతులకు చెల్లించాం. కొద్దిమేరకు ఎక్కడైన బాకీ పడి ఉంటే వారికి కూడా వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకున్నాం’’ అని నాని పేర్కొన్నారు.
ఖరీఫ్‌లో జాప్యంతో రైతుల్లో భయం
ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించడంలో జరిగిన జాప్యంతో కొనుగోలు కేంద్రాల పట్ల అన్నదాతలకు విశ్వాసం సన్నగిల్లిందని ఏపీ రైతు సంఘం కార్యదర్శి కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
‘‘విజయనగరం జిల్లాలో నేటికీ బకాయిల సమస్య ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సమర్థంగా పనిచేస్తే రైసుమిల్లర్ల నుంచి ఇబ్బందులు ఎదురవ్వవు. కానీ, అది జరగట్లేదు. అందుకే రకరకాల నిబంధనలు, ధాన్యంలో తేమ శాతం.. లాంటి కారణాలు చూపుతూ మద్దతు ధర తగ్గించేస్తున్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కూడా బకాయిలు చెల్లించడంలో నెలల తరబడి ఆలస్యం చేస్తే పెరిగిపోయే వడ్డీల భారం రైతుకు తడిసిమోపెడవుతోంది. దాంతో ప్రభుత్వం గిట్టుబాటు ధరలను నిర్ణయించినప్పటికీ అందులో కనీసం 25 శాతం తక్కువకే దళారులు, మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
గోదావరి డెల్టాలో ఇప్పటికే 30శాతం కోతలు పూర్తయ్యాయి. పశ్చిమ గోదావరిలో 320 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకూ 10 కొనుగోలు కేంద్రాలు కూడా తెరవలేదు. తెరిచిన చోట కూడా ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యంపై కొర్రీలు వేస్తున్నారు. దాంతో రైతులు మళ్లీ దళారుల పాలుకావాల్సిన దుస్థితి ఏర్పడుతోంది’’ అని వివరించారు.
కొత్త యంత్రాల అద్దెలూ పెరిగాయి
లాక్‌డౌన్ నేపథ్యంలో వరికోత యంత్రాల అద్దె కూడా అమాంతంగా పెంచేశారని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం గ్రామానికి చెందిన సలాది శివ సుబ్బారావు తెలిపారు. మామూలు రోజుల్లో మెషీన్‌కు గంటకి రూ.1800 అద్దె ఉండేదని, ఇప్పుడు యంత్రాలు దొరకడమే కష్టమైందని, ఒకవేళ దొరికినా అద్దె గంటకు రూ.2400గా ఉందని చెప్పారు.
‘‘దీనివల్ల 5 ఎకరాలున్న రైతుకి అదనంగా రూ. 3వేలు పెట్టుబడి అవుతుంది. ధాన్యం సేకరించి ఆరబెట్టుకుందామంటే బరకాలు దొరకడం లేదు. ఏదో రకంగా సంపాదించినా వాతావరణం సహకరించడం లేదు. అలా అని ఆరబెట్టకుండా మచ్చు తీసుకెళ్తే తేమ 17 శాతం మించిపోయిందని కొనుగోలు కేంద్రంలో చెబుతున్నారు. దాంతో ప్రభుత్వం ప్రకటించిన రేటు ప్రకారం రూ.1365 కాదు కదా.. కనీసం రూ.1100 వచ్చినా చాలనుకునే పరిస్థితి వచ్చింది. అలా అయినా సరే మేమే మిల్లుకి ధాన్యం తోలుకెళ్లాలంటున్నారు. ట్రాక్టర్లు దొరకడం లేదు. కూలీలు రావడం లేదు’’ అని ఆయన వివరించారు.
లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాది దిగుబడులు బాగా పెరుగుతాయని ఇప్పటికే అంచనాలు వేసింది. ఏపీలో వరి ఉత్పత్తి రెండు పంటలు కలిపితే 2017-18లో 74.12లక్షల టన్నులు ఉంది. 2018-19 నాటికి సాగు విస్తీర్ణం తగ్గినా దిగుబడులు పెరిగాయి. 78.7 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇక ఈ ఏడాది సాగు పెరగడం, దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో 82 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనాలు వేస్తున్నారు.
లాక్ డౌన్ కారణంగా కొన్ని చోట్ల కోతలు ఆలస్యం కావడంతో ధాన్యం నేలరాలే ప్రమాదం కూడా ఉందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. కానీ సీఎం జగన్ మాత్రం రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఒడిశా నుంచి ధాన్యం ఏపీలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.