బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 7 ఏప్రియల్ 2022 (12:55 IST)

ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్‌లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?

Imran-Farakhan
ఫరాఖాన్, ఫరాగుర్జార్, ఫర్హత్ షాజాది. ఈ పేర్లన్నీ ఒకే మహిళవి. పాకిస్థాన్‌లో ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌లో ఇమ్రాన్‌ఖాన్ మీద కోపంతో ఉన్న నాయకుల ఆరోపణలతో ఆమె గురించి కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లోనూ ఆమె పై అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. 2018లో బుష్రా బీబీ, ఇమ్రాన్ ఖాన్‌ల వివాహం తర్వాత ఫరాఖాన్ పేరు మొదట వెలుగులోకి వచ్చింది. పీటీఐ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమె పేరు చర్చల్లో కొనసాగుతూనే ఉంది.

 
ఫరా ఎక్కువగా ఇమ్రాన్ భార్య బుష్రా బీబీతో కనిపించే వారు. ఆమెతో కలిసి ఉన్నప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంలో ‘ఎవరీ ఫరాఖాన్’ అనే ప్రశ్న తరచూ వినిపిస్తూ ఉండేది. గతంలో ఫరా ఖాన్ పేరు మీద గాసిప్‌ లు మాత్రమే వినిపించేవి. అయితే, ఇటీవల ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ సభ్యుడు, మాజీ మంత్రి అలీమ్ ఖాన్ బహిరంగంగా విమర్శలు చేశారు. ఆమె గురించి ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అంతా తెలుసునని అన్నారు.

 
ప్రభుత్వ బదిలీల్లో జోక్యం చేసుకుంటారన్న ఆరోపణలతో పాటు ఆమెపై అనేక తీవ్ర విమర్శలు చేశారు అలీమ్‌ఖాన్. ఆయనకన్నా ముందు పంజాబ్ మాజీ గవర్నర్ చౌదరి సర్వర్ కూడా ఫరా ఖాన్‌పై ఇలాంటి ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఫరాఖాన్ జోక్యం చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేత మరియమ్ నవాజ్ కూడా ఆరోపించారు. ఒకపక్క తనపై విమర్శలు వస్తున్నా ఫరఖాన్ ఎలాంటి ప్రత్యారోపణలు చేయలేదు. వాటిని ఖండించ లేదు కూడా. మరోవైపు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్దార్ మాత్రం ఆమెపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు.

 
''అలీమ్ ఖాన్, చౌదరి సర్వర్, ఇతర ప్రతిపక్ష నాయకులు ఫరాఖాన్ పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆధారాలు లేకుండా చేస్తున్న ఈ ఆరోపణలను ఖండిస్తున్నాను. పంజాబ్‌లో బదిలీలు మెరిట్ ప్రాతిపదికన జరుగుతాయి'' అని ఉస్మాన్ బజ్దార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ఫరాఖాన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. చివరకు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ ఆరోపణలపై స్పందించారు. ఏప్రిల్ 1న ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో '' ప్రతిపక్షం నాకు వ్యతిరేకంగా ఏమీ చేయలేక, నా భార్య, ఆమె స్నేహితుల గురించి మాట్లాడుతున్నారు. ఫరాఖాన్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు'' అని అన్నారు. ప్రతిపక్షాలు, పీటీఐ లోని కొందరు నాయకుల ఆరోపణలపై స్పందించాల్సిందిగా బీబీసీ ఫరాఖాన్‌ను కోరింది. కానీ ఆమె స్పందించ లేదు.

 
ఫరాఖాన్ ఎక్కడున్నారు?
ఫరాఖాన్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులు కొందరు బీబీసీ కి తెలిపారు. ఆమె భర్త ఎహసాన్ జమీల్ గుర్జార్ కొద్ది రోజుల కిందట అమెరికా వెళ్లారు. 2018 సంవత్సరంలో పంజాబ్‌లోని పాక్‌పట్టాన్‌ లో ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భార్య కుమార్తెతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో జిల్లా పోలీసు అధికారి ఒకరిని బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో ఎహసాన్ జమీల్ గుర్జార్ పేరు కూడా వినిపించింది. ఎహసాన్ జమీల్ గుర్జార్‌ కు కాలేయ మార్పిడి జరిగినందున ఆయన తరచూ అమెరికా వెళ్లేవారని ఫరాఖాన్ కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. చెకప్ కోసం ఆయన అమెరికా వెళ్తూ, వస్తూ ఉంటారు.

 
ఉద్యోగం మానేసి పెళ్లి
ఫరాఖాన్‌కు 1990లలో ఎహసాన్ జమీల్ గుర్జార్‌తో వివాహం జరిగింది. ఎహసాన్ జమీల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ తరఫున పోటీ చేసిన పార్లమెంటు సభ్యుడు చౌదరి ఇక్బాల్ గుర్జార్ కుమారుడు. లాహోర్‌లోని డీహెచ్ఏలో ఫరాఖాన్‌కు ఎహసాన్ జమీల్ ఒక ఇల్లు కొని ఇచ్చారు. ఆ ఇంట్లోనే ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీల వివాహం జరిగింది. పల్లెటూరుకు చెందిన ఫరాఖాన్ లాహోర్‌లోని వివిధ ప్రాంతాలలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే ఆమె గుర్జార్‌ను కలుసుకున్నారు. తర్వాత ఉద్యోగం మానేశారు. "ఫరా ఖాన్ ఎహసాన్ జమీల్ గుర్జార్‌ ని వివాహం చేసుకున్నారని మాకు అప్పుడు తెలిసింది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని వారి బంధువు ఒకరు వెల్లడించారు.

 
ఫరాఖాన్ ప్రభావం
ఫరా ఖాన్ తరచుగా బుష్రా బీబీతో కనిపిస్తారు. కానీ, ఆమె పవర్ ఉన్న ప్రతిచోటకు వెళ్లగలరని చాలామంది భావిస్తారు. ఫరాఖాన్ సోషల్ మీడియా ఖాతాలు చూస్తే ఇది అర్థమవుతుంది. ఆమె తరచుగా ఇస్లామాబాద్‌లోని హై ప్రొఫైల్ ప్రాంతం అయిన బనీ గాలా ఫొటోలను అప్‌లోడ్ చేస్తుంటారు. ''ఈరోజు వెళ్లినా మీరు ఆమె ఇంటి బయట పోలీసు కారు ఉండటం చూడొచ్చు'' అని ఆమెను దగ్గరగా చూసిన ఒక వ్యక్తి చెప్పారు. ఫరాఖాన్ జమీందార్ కుటుంబానికి చెందిన వారని ఆ వ్యక్తి, బీబీసీతో చెప్పారు. కాబట్టి ఆమె ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అని, కొద్దికాలంలోనే ఆమె ధనవంతురాలు అయిందని చెప్పడం తప్పుని ఆయన అన్నారు.

 
సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ తరహా వాదనలే వినిపిస్తున్నాయి. తమ గ్రామంలో పరిశుభ్రమైన రోడ్లు, కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు అయ్యాయని ఆ వ్యక్తి చెప్పారు. ఆసుపత్రులతో పాటు ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఫరాఖాన్ కృషి వల్ల కేవలం ఒక సంవత్సర కాలంలోనే గ్రామాభివృద్ధి జరిగిందని అక్కడి ప్రజలు ఆమెను ప్రశంసిస్తారు. ‘చుట్టు పక్కల గ్రామాల రోడ్లు అధ్వానంగా ఉండటం మేం చూశాం’ అని ఆ వ్యక్తి అన్నారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పంజాబ్ అధికారి బీబీసీతో మాట్లాడుతూ... ''పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫరాఖాన్‌ ను ఎప్పుడూ చూడలేదు. కానీ, బుష్రా బీబీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నప్పుడల్లా, ఆ పర్యటనకు సంబంధించిన సూచనలు ఫరాఖాన్ నుంచే వస్తాయి'' అని అన్నారు.

 
ఫరాఖాన్ విషయంలో జర్నలిస్టుతో మంత్రి గొడవ
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఫవాద్ చౌధరి హాజరైన విలేఖరుల సమావేశంలో ఫరా ఖాన్ అంశంపై వాగ్వాదం జరిగింది. ఫరా ఖాన్ గురించి ఒక జర్నలిస్టు ప్రశ్నించగా, మంత్రి ఆయనను 'కిరాయి గుర్రం' అని విమర్శించారు. దీంతో జర్నలిస్టులు 'షేమ్ షేమ్' అంటూ నినాదాలు చేశారు. ''ఒక జర్నలిస్టు గురించి ఇలా మాట్లాడినందుకు ఫవాద్ చౌధరీ గారు మీకు సిగ్గు పడాలి'' అని కొందరు జర్నలిస్టులు వ్యాఖ్యానించారు.