సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 8 మార్చి 2023 (10:49 IST)

నంద్యాల అటవీ అధికారుల హెచ్చరిక: ‘పిల్లలకు దూరమైన తల్లి పులి ఆగ్రహంగా ఉంటుంది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’

Tiger
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో తల్లికి దూరమైన పులి కూనలను తిరిగి వాటి తల్లి దగ్గరికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో పెద్దపులి కూనలు దొరకడంపై శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తల్లికి దూరమైన నాలుగు పులి పిల్లలు అటవీ శాఖ అధికారుల సంరక్షణలో క్షేమంగా ఉన్నాయన్నారు.
 
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
పులి పిల్లలు ప్రస్తుతం ఆత్మకూరు ఫారెస్ట్ అధికారుల కార్యాలయంలో తిరుపతి నుంచి వచ్చిన వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాయి. తల్లి పులి వయస్సు ఎనిమిదేళ్లు ఉండొచ్చని, టైగర్ నంబర్ 108 గా దానిని గుర్తించామని అధికారులు చెప్పారు. పిల్లలకు దూరమైన తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేమని, అది తీవ్రమైన ఆగ్రహంతో ఉంటుందనీ, అందువల్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.
 
Tiger curbs
దేశ చరిత్రలోనే అరుదు
ఒకేసారి నాలుగు ఆడ పిల్లలకు పులి జన్మనివ్వడం దేశ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన అని అధికారులు చెప్పారు. తల్లి పులి కోసం ప్రత్యేక ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, సాధ్యమైనంత త్వరగా పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దూరమైన పిల్లలను తల్లి పులి చేరదీస్తుందో లేదో చూసి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి పులి జాడ లేకపోతే రెండేళ్లు సంరక్షించి అటవీ ప్రాంతంలో వదిలి పెడతామని చెప్పారు.