శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 7 మార్చి 2023 (09:01 IST)

హెచ్3ఎన్2 వైరస్ ఏమిటి? డాక్టర్లు ఏమంటున్నారు?

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దగ్గుతూ ఉన్నవారు ఎక్కువ కనిపిస్తుండడం చూసే ఉంటారు. కొందరికైతే రెండుమూడు వారాలైనా దగ్గు తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా ఫ్లూ రోగులు ఎక్కువవడమే దీనికి కారణం. ఈ ఫ్లూ బాధితులలో కొందరు హెచ్3ఎన్2 వైరస్ సోకినవారు ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఒక కరపత్రం విడుదల చేసింది. వైరల్ ఫ్లూ సోకితే యాంటీబయాటిక్స్ తీసుకోవద్దని అందులో సూచించింది.
 
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ శివకుమార్ దీనిపై బీబీసీతో మాట్లాడారు. ఈ హెచ్‌3ఎన్‌2 వైరస్ లక్షణాలు ఏమిటి? ఇది సోకినవారు యాంటీబయాటిక్స్ ఎందుకు వాడకూడదన్నది ఆయన వివరించారు. ఈ వైరస్ నుంచి చిన్నారులను ఎలా రక్షించుకోవాలో చెప్పారు.
 
1) యాంటీబయాటిక్స్ వేసుకోకూడదా?
డాక్టర్ శివకుమార్: హెచ్3ఎన్2 వైరస్ మ్యుటేట్ అయింది. దీనివల్ల వచ్చే దగ్గు కనీసం మూడు వారాలు ఉంటుంది. యాంటీబయాటిక్స్ వేసుకున్నా తగ్గకపోవడంతో రోగులు గందరగోళానికి గురవుతారు. ఇలాంటి వైరస్‌లకు యాంటీబయాటిక్స్ తీసుకోరాదు.. లక్షణాల మేరకు వైద్యులు చికిత్స చేస్తారు.
 
2) హెచ్‌3ఎన్‌2 వైరస్ లక్షణాలు ఏమిటి?
డాక్టర్ శివకుమార్: జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, బలహీనంగా ఉండడం, విరేచనాలు వంటి ఈ వైరస్ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను కలిసి వారి సూచన మేరకు మందులు వేసుకోవాలి. ఒకవేళ కేవలం జలుబు, దగ్గు ఉంటే మొదటి రెండు మూడు రోజులు వేచి చూడొచ్చు. కానీ, జ్వరం, విరేచనాలు కూడా మొదలైతే వెంటనే డాక్టరును కలవాలి. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది.. ఇంట్లో ఒకరికి వస్తే మిగతావారికీ వచ్చే ప్రమాదం ఉంది.
 
3) ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
తగినంత నీరు తాగడం: వైరస్ లక్షణాలు కనిపించిన తరువాత వెంటనే డాక్టరు దగ్గరకు వెళ్లనప్పటికీ ఇంట్లోనే ఉంటూ రోజూ తగినంత నీరు తాగుతుండాలి. రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగాలి.
 
రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దు: కోవిడ్ కాలంలో మనం నేర్చుకున్నట్లుగానే ఈ వైరస్ సోకితే రద్దీ ప్రాంతాలలోకి వెళ్లరాదు. రెండు మూడు రోజులు ఆఫీసుకు కూడా వెళ్లకపోవడమే మంచిది. ఇలా చేయడం వల్ల ఇతరులకు వైరస్ సోకకుండా ఉంటుంది.
 
మాస్క్ పెట్టుకోవడం:ఇది కూడా కోవిడ్ నేర్పిన ఆరోగ్య జాగ్రత్తే. అయితే, చాలామంది తమ దుస్తులకు తగిన క్లాత్ మాస్కులు వాడుతున్నారని.. అలా కాకుండా సర్జికల్ మాస్క్ వాడడం మంచిదని డాక్టర్ శివకుమార్ చెప్పారు.
 
డైట్: వైద్యులు సూచించినట్లు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగితే వైరస్‌లను ఎదుర్కొనే వీలుంటుంది. వైరస్‌లు సోకినా తొందరగా కోలుకోవడం సాధ్యమవుతుంది.
 
4) చిన్నారులు, వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డాక్టర్ శివకుమార్: ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులకు బయటకు ఆడుకోవడానికి పంపించవద్దు. ఒకవేళ వారు డయేరియాతో కూడా బాధపడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నీరు ఎక్కువగా తాగించాలి. వాళ్ల చేతికే వాటర్ బాటిల్ ఇచ్చి రోజులో ఎంత నీరు తాగుతున్నారో చూస్తుండాలి. ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. వృద్ధులకు ఈ వైరస్ సోకితే వెంటనే వైద్యుడికి చూపించాలి. అప్పటికే వారికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వైరస్ ప్రభావం తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది.