గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (22:18 IST)

నరేంద్ర మోదీ: 'లాక్ డౌన్ చివరి ఆప్షన్ మాత్రమే, సెకండ్ వేవ్‌ను ధైర్యంగా ఎదుర్కొందాం'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాప్తిని ఎదుర్కోవడంపై దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం రాత్రి 8.45 నిమిషాలకు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "కరోనాతో దేశమంతా తీవ్రంగా పోరాడుతోంది. ఈ పోరాటం కొనసాగుతుండగానే సెకండ్ వేవ్ తుపానులా విరుచుకుపడింది. సమస్య ఇప్పుడు మరింత తీవ్రమైంది. కానీ, మనమంతా కలిసికట్టుగా, బలమైన సంకల్పంతో ఈ మహమ్మారిని పారదోలాలి. మీ కుటుంబంలోని ఒక సభ్యుడిగా మీ బాధను నేను అర్థం చేసుకోగలను" అని ప్రధాని అన్నారు.

 
ప్రజలందరూ తమ కాలనీలలో సొసైటీలు, అపార్ట్‌మెంట్లలో కమిటీలుగా ఏర్పడి జాగ్రత్తలు తీసుకునేలా ప్రచారం నిర్వహించాలని, పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి కమిటీలలో పిల్లలకు, యువతకు భాగస్వామ్యం కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరం లేనిదే ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని సూచించారు. రెండో దశ కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది మరణించారని, వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నానని మోదీ చెప్పారు.

 
కరోనా మహమ్మారి మొదటిసారి దాడి చేసినప్పుడు, ఆ యుద్ధంలో వైద్యులు, వైద్య సేవల సిబ్బంది అందరూ కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా కరోనా బాధితులను ఆదుకున్నారని గుర్తు చేశారు. "కఠిన కాలం వచ్చినప్పుడు కూడా మనం ధైర్యం కోల్పోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన దిశలో ప్రయాణించాలి. అప్పుడే మనం విజయం సాధించగలం" అని ప్రధాని అన్నారు.

 
గత ఏడాది మహమ్మారి మొదటిసారి దాడి చేసినప్పుడు మన వద్ద సరైన మందులు లేవు, పీపీఈ కిట్లు లేవని గుర్తు చేసిన మోదీ, "ఇప్పుడు మన డాక్టర్లకు కోవిడ్ ఎలా ఎదుర్కోవాలో తెలుసు. మనకు తగినన్ని మందులు, పీపీఈ కిట్లు ఉన్నాయి. చాలా మంది చికిత్సతో కోలుకుంటున్నారు. అదృష్టవశాత్తు, కోవిడ్ వ్యాక్సీన్ అత్యధికంగా ఉత్పత్తి చేసే సంస్థలు భారతదేశంలోనే ఉన్నాయి. కాబట్టి, అందరూ ధైర్యం కోల్పోకుండా ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి కలసికట్టుగా పోరాడాలి" అని అన్నారు.

 
దేశంలోని అనేక ప్రాంతాలలో ఆక్సీజన్ డిమాండ్ ఎక్కువగా ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగాలు ఆక్సీజన్ కొరత రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధాని తెలిపారు. దేశంలో రోగులకు సరిపడా బెడ్లు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని, కొన్ని ప్రాంతాలలో ప్రత్యేక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

 
మన దేశంలో అత్యంత నైపుణ్యం ఉన్న ఫార్మా సెక్టార్ ఉందని, ప్రపంచానికి పెద్ద మొత్తంలో వ్యాక్సీన్‌లు అందిస్తున్నది మనమేనని చెప్పిన ప్రధాని, మే 1 నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.

 
ప్రజలంతా మైక్రో కంటైన్‌మెంట్ జోన్లపై ద‌ృష్టి పెట్టాలని కోరిన ప్రధాని మోదీ, ఈ సమస్యకు లాక్‌డౌన్ పరిష్కారం కాదని అన్నారు. కాలనీలు, అపార్ట్‌మెంట్లలోని సొసైటీలు పరిశుభ్రత పాటిస్తూ కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రాలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చిట్టచివరి అస్త్రంగా లాక్‌డౌన్ ప్రయోగించాలని మోదీ సూచించారు.