శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 5 నవంబరు 2019 (17:23 IST)

తహసీల్దార్ విజయ రెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులేంటి: బీబీసీ గ్రౌండ్‌రిపోర్ట్

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో సీహెచ్ విజయ రెడ్డి అనే తహసీల్దార్‌ను ఆమె కార్యాలయంలోనే సజీవ దహనం చేశారు. భూవివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ నడిబొడ్డుకు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్‌లోని మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం(04.11.2019) మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ హత్య జరిగింది. రంగారెడ్డి జిల్లా గౌరెల్లికి చెందిన కె.సురేశ్ ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

 
''ఓ కేసుకు సంబంధించి తహసీల్దార్ విజయ రెడ్డి కోర్టుకు హాజరై మధ్యాహ్నం ఆఫీసుకు వచ్చారు. సోమవారం ఫిర్యాదుల రోజు కావడంతో ప్రజలు ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చారు. అదేసమయంలో సురేశ్ కార్యాలయ భవనం రెండో అంతస్తులో ఉన్న తహసీల్ కార్యాలయం లోనికి వెళ్లి ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు. అక్కడికి కొద్ది నిమిషాల్లోనే లోపలి నుండి పొగలు, మంటలు కనిపించాయి. సురేశ్ బయటకు పరుగులు తీస్తూ కనిపించాడు. ఆయన ఒంటిపైనా మంటలు కనిపించాయి. విజయ రెడ్డి తన కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద నేలపై మంటల్లో కాలుతూ కనిపించారు'' అని ఘటన సమయంలో అక్కడున్నకార్యాలయ సిబ్బంది చెప్పారు.

 
ఘటనాస్థలంలో ఉన్నవారు చిత్రీకరించిన ఒక వీడియోలో విజయ రెడ్డి సహాయం కోసం కేకలు వేయడం కనిపించింది. మంటలను ఆర్పడానికి అక్కడ సిబ్బంది పరుగులు తీస్తున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది, ఇతరులు మంటల్లో కాలుతున్నది ఎమ్మార్వో అని తొలుత గుర్తించక మేడమ్ ఎక్కడ? ఏం జరిగింది? అంటూ ఆమె కోసం వెతకడం కనిపించింది.

 
'ఆమె మా మేడమా?' అంటూ చివరికి ఆమె తహసీల్దార్ విజయారెడ్డి అని గుర్తించిన సిబ్బంది షాక్‌లో ఏడుస్తూ కనిపించారు. మంటలు ఆర్పేందుకు ఆమెపై దుప్పటి కప్పడం కనిపించింది. ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతూ ముఖమంతా కాలిపోయి ఏడుస్తున్న విజయారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం వీడియోలో కనిపించింది.

 
కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్
తహసీల్దార్‌ను రక్షించడానికి ప్రయత్నించిన అటెండర్ చంద్రియా, డ్రైవర్ గురునాథానికీ తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురునాథం మృతిచెందారు. ప్రత్యక్ష సాక్షి అయిన గురునాథం ఏం జరిగిందో తన మరణానికి ముందు వివరించారు.

 
''తహసీల్దార్ ఉన్న గదిలోకి వెళ్లిన సురేశ్ విజయా రెడ్డిపై పెట్రోల్ పోశాడు. లోపలి నుంచి అరుపులు వినగానే నేను, అటెండర్ వెళ్లాం. అప్పటికి మేడమ్ తలుపు తెరిచి బయటకు వచ్చారు. మేం సురేశ్‌ను పక్కకు లాగడానికి ప్రయత్నించాం. గొడవలో మేడమ్ నేలపై పడ్డారు. మాపైనా పెట్రోల్ పడింది. మేం అడ్డుకునేలోగానే సురేశ్ నిప్పంటించాడు'' అని గురునాథం చెప్పారు.

 
దాడి చేసిన తరువాత సురేశ్ కూడా 60 శాతం కాలిన గాయాలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రాచకొండ డివిజన్ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ "ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. ఎవరైనా ప్రేరేపిస్తే సురేశ్ ఈ హత్య చేశారా లేదంటే తనకు తానే చేశారా అన్నది విచారిస్తున్నాం'' చెప్పారు.

 
ఉపాధ్యాయ వృత్తి నుంచి రెవెన్యూ శాఖకు..
ఉపాధ్యాయినిగా పనిచేసిన విజయ రెడ్డి 2009లో రెవెన్యూ శాఖలో చేరారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో బాధ్యతలు చేపట్టడానికి ముందు సంగారెడ్డి, మల్కాజ్‌గిరి డివిజన్లలో పనిచేశారు. మూడేళ్లుగా ఆమె తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆమె తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు.

 
భర్త సుభాష్ రెడ్డి నగరంలోని డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. వీరికి పన్నెండు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. పనిచేసిన వారంతా విజయ రెడ్డి మంచి వ్యక్తని, ఎవరికీ హాని తలపెట్టే రకం కాదని చెప్పారు.

 
సురేశ్ ఎవరు?
సురేశ్‌ది రంగారెడ్డి జిల్లాలోని గౌరెల్లి గ్రామం. సురేశ్ కుటుంబాన్ని ప్రశ్నించడానికి పోలీసులు గ్రామానికి వెళ్లారు. సురేశ్ తండ్రి కృష్ణ తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ ''నా కొడుకు మానసిక స్థితి స్థిరంగా లేదు. గత ఆరు నెలలుగా తాగుడుకి అలవాటుపడ్డాడు. మాకు, మరో 30 కుటుంబాలకు కలిపి సుమారు 110 ఎకరాల భూమి ఉంది. ఈ భూ వివాదంలో కోర్టులో ఉంది. నేను, నా సోదరుడు ఆ వ్యవహారం చూస్తున్నాం. సురేశ్ తహసీల్దార్ కార్యాలయానికి ఎందుకు వెళ్లాడో మాకు తెలియదు'' అన్నారు.

 
గ్రామస్థుల్లో కొందరు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినందుకు సురేశ్‌ను శిక్షించాలన్నారు. ఒక మహిళపై ఇలాంటి ఘోరమైన నేరానికి పాల్పడిన సురేశ్‌ను ఎవరూ క్షమించరని మహేశ్ అనే గ్రామస్తుడు అన్నారు. గ్రామ సర్పంచి మల్లేశ్ 'బీబీసీ'తో మాట్లాడుతూ ''తమ భూమి పాస్ పుస్తకాలు పొందడానికి సురేశ్ కుటుంబం చాలా కష్టపడుతోందని తనకు తెలుసు. వారి ఆధీనంలో భూమి ఉందని నేను అర్థం చేసుకున్నాను. అయితే ఆదేశాలు వారికి అనుకూలంగా రాలేదు. దీంతో సురేశ్ కలత చెందాడు. కోర్టులో ఏం జరిగిందో నాకు తెలియదు" అన్నారు.

 
హైదరాబాద్‌లో విజయరెడ్డి అంత్యక్రియలు
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302, 307 (హత్య, మరణానికి కారణమయ్యే చర్యకు పాల్పడడం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సురేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విజయ రెడ్డి అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్‌లో జరిగాయి.

 
గత రెండేళ్లలో 15 ఘటనలు
విజయ రెడ్డి హత్య నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ మూడు రోజుల పాటు విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌(టీఆర్‌ఈఎస్‌ఎ) అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ ''ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అవసరమైతే సెక్షన్ 144 విధించే అధికారం ఉన్న మెజిస్టీరియల్ పవర్స్ ఉన్న అధికారిని ఇలా సజీవ దహనం చేయడం ఘోరం. అయితే రెవెన్యూ అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ఇది మొదటిసారి కాదు. గత రెండేళ్లలో కనీసం 15 సంఘటనల్లో రెవెన్యూ అధికారులపై దాడులు జరిగాయి'' అన్నారు.

రెవెన్యూ అధికారులను లక్ష్యంగా దాడులు చేస్తున్నారా?
సంఘటన స్థలంలో గుమిగూడిన రెవెన్యూ ఉద్యోగులు బీబీసీ తెలుగుతో మాట్లాడారు. అధికారుల ప్రవర్తనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పదేపదే చేసిన ప్రకటనల వల్ల రెవెన్యూ అధికారులపై ప్రతికూల వాతావరణం ఏర్పడిందని వారు అంటున్నారు. "అవినీతి కంపు కొడుతున్న రెవెన్యూ వ్యవస్థను శుభ్రపరిచేందుకు తాను కంకణం చుట్టుకున్నాను'' అని కేసీఆర్ పదేపదే ప్రకటనలు చేశారని వారు చెప్పారు.

 
''అవినీతి సంఘటనలు లేవని అనడం లేదు. రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధిపతే పిలుపునివ్వడం ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. కష్టపడి పనిచేసే అధికారులు ఉన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు ఇలాంటి అనాలోచిత ప్రకటనలు చేయడం ఇవాళ ఇంతటి ఈ సంఘటనకు దారితీశాయి'' అని మరో అధికారి అన్నారు.

 
''ముఖ్యమంత్రి మాత్రమే కాదు, మంత్రులు, శాసనసభ్యులు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు, ఇవి సోషల్ మీడియాలో అందరికీ చేరుతున్నాయి'' అని టీఆర్‌ఈఎస్‌ఎ అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి అన్నారు. ''2017లో కేసీఆర్ భూమి రికార్డులను సరిదిద్దడం, నవీకరణ- భూప్రక్షాళన ప్రకటించిన తరువాత ఇదంతా ప్రారంభమైంది. మేం పగలు రాత్రి పనిచేశాం. సీఎం మాకు ఇచ్చిన నిర్ణీత వ్యవధిలో మేం పని పూర్తిచేశాం. వివాదంలో ఉన్న భూములను 'బి' కేటగిరీగా వర్గీకరించారు. కుటుంబాల మధ్య వివాదాలు, ప్రభుత్వంతో వివాదాలు, సరిహద్దు వివాదాలు మొదలైనవి ఉన్న భూములు ఈ వర్గంలో ఉన్నాయి. వీటిలోనూ 95 శాతం కేసులను పరిష్కరించాం. మిగతావి ఏళ్ల తరబడి కోర్టులో పెండింగులో ఉన్న కేసులు. 

 
ఆ వివాదాల పరిష్కారానికి కూడా మా పరిధిలో మేం కృషి చేస్తున్నాం. రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఓ అధికారి పని ఒత్తిడిని తట్టుకోలేక తన జీవితాన్ని కూడా ముగించాడు. నిజామాబాద్‌లోని ఓ ఎమ్మార్వో అక్టోబరులో ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం మాపై అవినీతిపరులుగా ముద్రవేయడంతో ప్రజలూ అలాగే ఆలోచించడం ప్రారంభించారు. కానీ వాస్తవానికి మేం తక్కువ సిబ్బందితో పని చేస్తున్నాం. కనీసం 2000 మంది రెవెన్యూ సిబ్బంది అవసరం ఉందని, గ్రామ స్థాయి సిబ్బంది కనీసం 4000 మంది అవసరం ఉంది'' అన్నారు రవీందర్ రెడ్డి.

 
తెలంగాణలో బుధవారం సాయంత్రం వరకు విధులు బహిష్కరణకు రెవెన్యూ ఉద్యోగులు పిలుపునిచ్చారు. రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి కేసీఆరే చూస్తున్నారు. ఘటనపై పోలీసు అధికారులతో మాట్లాడి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సోమవారం సీఎం కార్యాలయం వెల్లడించింది.