బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (19:51 IST)

ఉన్నావ్ రేప్ కేసు... న్యాయం జరుగుతుందనే ఆశ కలిగేసరికే, జీవించాలనే కోరిక చచ్చిపోయింది

దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి ఐసీయూలో ఉన్నావ్ బాధితురాలు వైర్లు, మానిటర్లు మధ్య వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటోంది. బాలికపై అత్యాచారం చేశారనే ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సెంగర్ జైలులో ఉన్నారు.


ఎమ్మెల్యే తమను బెదిరించారని, బాలిక తీవ్రంగా గాయపడేలా ప్రమాదానికి కుట్ర చేశారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. సెంగర్ ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు. సుప్రీంకోర్టు జోక్యంతో 2017 నాటి ఈ కేసులో చివరికి వాదనలు మొదలయ్యాయి. రోజూ విచారణ చేపట్టడంతోపాటు దీనిని 45 రోజుల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. 

 
ఇప్పటివరకూ ఆ బాలిక కథ ఇది..
2017లో ఒక మామూలు మధ్యాహ్నం. తిన్న తర్వాత కాస్త కునుకు తీసే సమయం. కానీ ఆరోజు జరిగిన ఘటన, ఎవరికీ చాలా రాత్రులు సరిగ్గా నిద్రకూడా లేకుండా చేసింది. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌లోని ఒక మైనర్ బాలిక దిల్లీలోని తన పిన్నికి తనపై జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. ఆ మధ్యాహ్నం తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పడానికి ఆ బాలికకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే ఆమె ఒక మైనర్. ఆమె ఒక బలమైన ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్‌‌పై ఆ ఆరోపణలు చేస్తోంది.

 
బాలిక సోదరి బీబీసీతో "ఈ ఘటన ఉన్నావ్‌లోని మాఖీ గ్రామంలో జరిగింది. కానీ అక్కడ చంపేస్తామని బెదిరించి నోరుమూయించారు. తను వాళ్లమ్మకు కూడా ఏం చెప్పలేకపోయింది" అని చెప్పారు.

 
గ్రామంలో ఆలయం నిర్మించిన ఎమ్మెల్యే సెంగర్
ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ ఉన్నావ్ మాఖీలో 15 ఏళ్ల నుంచి ఆ బాలిక పొరుగింట్లోనే ఉన్నారు. లఖ్‌నవూ నుంచి సుమారు రెండు గంటలు ప్రయాణించి మాఖీ గ్రామం చేరుకున్న నేను సెంగర్ ఇంటి అడ్రస్ అడిగినపుడు ఒక పెద్ద కాంప్లెక్స్ వైపు చూపించారు. అక్కడొక బంగళా, ఆలయం, ఒక స్కూలు ఉన్నాయి. అవన్నీ 'ఎమ్మెల్యే గారివే' అని గ్రామస్థులు చెప్పారు. ఆ బంగళా తలుపులకు తాళం వేసుంది. వెనక గోడపై రెండు సీసీటీవీ కెమెరాలున్నాయి. ఆ రెండూ పక్కనే ఉన్న బాలిక ఇంటి వైపు ఉన్నాయి. ఎమ్మెల్యేను అరెస్టు చేసిన తర్వాత బాధితురాలి కుటుంబంపై కన్నేసి ఉంచడానికి, కెమెరాలు ఏర్పాటు చేశారని గ్రామస్థులు చెప్పారు.

 
గ్రామంలో ఈ కేసు గురించి రకరకాలుగా చెప్పుకోవడం వినిపించింది. కుట్ర, ప్రేమాయణం, శత్రుత్వం, ఇలా ఆధారాలు లేని ఎన్నో విషయాలు చెప్పారు. పేరు బయటపెట్టద్దనే షరతుపై ప్రతి ఒక్కరూ ఒక కొత్త కథ వినిపించడానికి సిద్ధమయ్యారు. వీళ్లంతా అంగీకరిస్తున్న ఒక విషయం ఉంది. అది ఎమ్మెల్యే సెంగర్‌కు ఉన్న జనాదరణ.

 
కుల్దీప్ సెంగర్ మూడుసార్లు పార్టీ మారారు. 2002లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత సమాజ్‌వాది పార్టీలోకి వెళ్లారు. రెండుసార్లు గెలిచారు. 2017లో భారతీయ జనతా పార్టీ టికెట్‌పై విజయం సాధించారు. ఆయన తాత చాలాఏళ్లు మాఖీ గ్రామం సర్పంచిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తమ్ముడి భార్య ఆ ఊరికి సర్పంచ్. సెంగర్ భార్య ‘జిల్లా పంచాయతీ ప్రముఖ్’గా పనిచేస్తున్నారు.

 
ఇక బాలిక ఇంట్లో చదువుసంధ్యలున్న వారు పెద్దగా లేరు. తల్లి కూడా చదువుకోలేదు. ఆమె నాతో "నా నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడిని చదివించడానికి సరిపడా డబ్బు మాకు ఎప్పుడూ లేదు" అని చెప్పారు. గ్రామంలో బాలిక తండ్రి, అతడి ఇద్దరు సోదరులు చాలా బలంగా ఉండేవారని చెప్పారు. నాతో మాట్లాడిన కొందరు వాళ్లను గూండాలని కూడా అన్నారు. వాళ్లు తరచూ తాగి గొడవలకు దిగుతుండేవారని చెప్పారు.

 
"బాలిక తండ్రిపై 29, ఆమె చిన్నాన్నపై 14 కేసులు ఉన్నాయని మాఖీ పోలీస్ స్టేషన్ హెడ్ చెప్పారు. హింస, రాజకీయాలతో ఉన్న ఈ వాతావరణానికి దూరంగా దిల్లీ చేరుకున్న బాలిక తన పిన్నికి ఆ రోజు జరిగిన ఘటన గురించి చెప్పింది. బాలిక పిన్ని చదువుకున్నారు. ఆమె తండ్రికి దిల్లీలో మంచి వ్యాపారం ఉంది. పెళ్లైన తర్వాత బాలిక చిన్నాన్న దిల్లీకి వచ్చేశారు.

 
సుమారు 12 వేల మంది జనాభా ఉన్న మాఖీ ఒక పెద్ద గ్రామం. అయితే, రాజధాని దిల్లీ దానికంటే చాలా పెద్దది. ఇక్కడ చట్టంపై నమ్మకం ఉండడం సహజం. లేదంటే చదువుకోవడం వల్ల ఒక ధైర్యం వచ్చింది. బాలిక పిన్ని చాలా ధైర్యవంతురాలు. ఆమె బాలికతో "పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పోరాటం చేయకుంటే, రేపు మరింత అణగదొక్కుతారు. ఈరోజు నువ్వు మౌనంగా ఉంటే, రేపు మమ్మల్ని వేధిస్తారు" అన్నారు. "ఆరోజు పిన్ని ధైర్యం చేయకుంటే, ఇప్పుడు ఏదీ జరిగేది కాదు" అని బాలిక సోదరి చెప్పింది.

 
పిన్ని ఇచ్చిన ధైర్యంతో
పిన్ని సూచనతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ నెలలు అవుతున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. చివరికి ఆమె న్యాయం కోసం కోర్టు వైపు చూశారు. భారత్‌లో సీఆర్పీసీ సెక్షన్ 156(3) ప్రకారం పోలీసులు ఏదైనా ఫిర్యాదును నమోదు చేయకపోతే, బాధితురాలు కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్‌కు దరఖాస్తు చేయచ్చనే నిబంధన ఉంది. బాలిక అర్జీ ఇచ్చిన తర్వాత కోర్టు దీనిపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఎలాంటి అరెస్టులూ జరగలేదు. తమను మాటిమాటికీ బెదిరించేవారని బాలిక తల్లి చెప్పారు. కుల్దీప్ సెంగర్ ఆ సమయంలో మీడియాతో "ఇదంతా రాజకీయ ప్రేరేపితమైన అవాస్తవ ఆరోపణలు" అంటూ ఖండించారు.

 
పోలీసులు తర్వాత 2018 ఏప్రిల్‌లో ఒక సాయంత్రం మాఖీ గ్రామంలో ఎమ్మెల్యే సెంగర్ చిన్న తమ్ముడు అతుల్ సెంగర్, ఆయన అనుచరులు బాలిక ఇంట్లోకి చొరబడి ఆమె తండ్రిని చాలా దారుణంగా కొట్టారు. "వారు అతడిపై నీరు పోసి పోసి కొట్టారు. అసలు బతుకుతాడో, లేదో అనిపించింది. కానీ అది వాళ్ల మధ్య గొడవ కావడంతో, మేం ఎవరూ జోక్యం చేసుకోలేదు" అని బాలిక పక్కింటివారు అన్నారు. కొట్టిన తర్వాత తండ్రిని మాఖీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆర్మ్స్ యాక్ట్ కింద అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడ కూడా కొట్టారనే ఆరోపణలున్నాయి.

 
బాలిక సోదరి "చాలా కష్టంగా సీనియర్ పోలీస్ అధికారులకు ఫోన్ చేసి చెప్పి, నాన్నను ఆసుపత్రిలో చేర్పించాం" అని చెప్పింది. కానీ బాధితురాలి ఓపిక నశించిపోయింది. ఆమె తల్లితో "నేను ఆత్మహత్య చేసుకుంటా, అప్పుడే ఇవన్నీ ఉండవు" అని చెప్పింది. తల్లి ఆమెను అడ్డుకోలేదు, "నువ్వు ఒక్కటే అలా చేసుకుంటే, తర్వాత మేం ఎలా జీవించాలి" అన్నారు. దాంతో అక్కచెల్లెళ్లందరూ తల్లితో కలిసి వెళ్లారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇంటి ముందు బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది.

 
తన పిల్లలతో లక్నో ఆస్పత్రిలో బాధితురాలి తల్లి
ఆమెను కాపాడారు. కానీ తర్వాత రోజు తండ్రి ఆస్పత్రిలో చనిపోయాడనే వార్త వాళ్లను ఇంకా కుంగదీసింది. ఈ కేసులో నిర్లక్ష్యం చూపిన మాఖీ స్టేషన్ హెడ్‌ సహా ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. తర్వాత బాలిక తండ్రి హత్య ఆరోపణలతో ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సెంగర్ సహా కొంతమంది పోలీసులను అరెస్టు చేశారు. అతుల్ సెంగర్‌పై పోలీసులు అంతకుముందే మూడు కేసులు నమోదు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ పాలనపైనే ప్రశ్నలు వచ్చాయి. దాంతో అత్యాచారం కేసు దర్యాప్తును ఉత్తరప్రదేశ్ పోలీసుల నుంచి సీబీఐకి అప్పగించారు. కుల్దీప్ సెంగర్‌ను అప్పటికీ అరెస్టు చేయలేదు.

 
ఇదంతా జరిగాక, ఎఫ్ఐఆర్ నమోదవడంతో ఇక సెంగర్ అరెస్టు తథ్యమంటూ మీడియా కథనాలు ప్రసారం చేసింది. కానీ, ఇంటి నుంచి బయటికి వచ్చిన కుల్దీప్ సెంగర్ "నేను నిర్దోషిని, నేను ఎక్కడికీ పారిపోలేదు. ఏ దర్యాప్తుకైనా సిద్ధం" అని ప్రకటించారు. మూడు రోజుల గందరగోళం తర్వాత చివరికి సీబీఐ సెంగర్‌ను ప్రశ్నించింది. కొన్ని గంటల తర్వాత అతడిని అరెస్ట్ కూడా చేసింది. అప్పటికి ఆయనపై అత్యాచార ఆరోపణలు వచ్చి ఏడాది దాటింది.

 
కులదీప్ సింగ్ సెంగర్ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు
రెండు నెలల తర్వాత చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ, అందులో ఎమ్మెల్యే సెంగర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చింది. కానీ విచారణ ప్రారంభించలేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బాలికకు పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసింది. కొంతమంది పోలీసులు మాఖీ గ్రామంలో బాలిక ఇంటి దగ్గర ఉంటే, కొందరు దిల్లీలో ఆమె పిన్ని ఇంటి దగ్గర ఉండేవారు. ఒకప్పుడు బాలిక పెదనాన్న ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ బాడీగార్డుగా పనిశారు.

 
మాఖీ గ్రామంలో చాలా మంది "ఈ రెండు కుటుంబాలూ చాలా బాగుండేవని చెప్పారు. సెంగర్ తాత సర్పంచిగా ఉన్నప్పటి నుంచి ఈ రెండు ఠాకూర్ కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ఒకే కులం, ఒకే ప్రాంతం వారిని బాగా కలిసిపోయేలా చేసింది" అన్నారు. ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు శత్రువులుగా మారాయి. ఎమ్మెల్యే సెంగర్ తరఫు వారు బాలిక కుటుంబంపై కూడా కేసులు పెట్టారు. వీటిలో ఒక మోసం కేసు కూడా ఉంది. అందులో అత్యాచారం చేసినపుడు బాలిక మైనర్ కాదని, కోర్టులో ఆధారంగా వాళ్లు తప్పుడు మార్కుల జాబితాను ఇచ్చారని చెప్పారు. మిగతా కేసులతోపాటు అది కూడా ఇప్పుడు సీబీఐ దగ్గరుంది.

 
తర్వాత ఒక పాత కేసు కూడా తిరగదోడారు. 2000లో ఎన్నికల ప్రచారం సమయంలో దేశీ తుపాకీ చూపించి బెదిరించారనే ఆరోపణలతో బాలిక చిన్నాన్నను అరెస్టు చేశారు. బెయిలుపై విడుదలైన అతడు మళ్లీ కోర్టుకు హాజరు కాలేదు. ఆ కేసులో అతడు పరారీలో ఉన్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత సెంగర్ అరెస్టైన కొన్ని నెలల తర్వాత బాలిక చిన్నాన్న ఇప్పుడు దిల్లీలో ఉన్నారని కోర్టుకు చెప్పారు.

 
"ఉత్తరప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారని, కోర్టులో హాజరు పరిచారని" బాలిక సోదరి చెప్పారు. అతడికి హత్యాయత్నం కేసులో దోషిగా పదేళ్ల శిక్ష విధించారు. బాలిక పెదనాన్న చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు. తండ్రి పోలీసుల కస్టడీలో మృతిచెందారు. చిన్నాన్న కూడా జైలుకు వెళ్లడంతో ఆ ఇంట్లో మహిళలే మిగిలారు.

 
"దిల్లీ నుంచి మాఖీ వెళ్లడం, సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం, ఇల్లు, వ్యాపారం చూసుకోవడం అంతా పిన్నే చూసుకునేవారు" అని బాలిక సోదరి చెప్పారు. "అప్పటికీ బెదిరింపులు ఆగలేదు, ఇంకా ఎక్కువయ్యాయి" అని బాలిక తల్లి చెప్పారు. వకీలు సూచనతో ఆమె ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తికి కూడా తమకు సాయం చేయాలని లేఖలు రాశారు. కానీ వాటిలో ఒక్క లేఖ కూడా సమయానికి చేరుకోలేదు. 2019 జులైలో ఒక మధ్యాహ్నం ఒక ట్రక్ ఢీకొనడంతో కార్లో వెళ్తున్న బాలిక, ఆమె వకీల్ తీవ్రంగా గాయపడ్డారు. పిన్ని, ఆమె చెల్లెలు మృతిచెందారు.

 
"లేఖ సమయానికి చేరి, వాటిని చదివుంటే వీళ్లు సజీవంగా ఉండేవారు" అంటారు బాలిక సోదరి. సీబీఐ ఇప్పుడు ఈ కేసును ఇది ప్రమాదమా, లేక కుట్రా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. సుప్రీంకోర్టుకు రాసిన లేఖల గురించి మీడియాలో వచ్చినపుడు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా జోక్యం చేసుకుని వెంటనే విచారణ చేపట్టారు. అత్యాచార ఆరోపణలు నమోదై ఏడాది అవుతున్నా, విచారణలు ప్రారంభించని కేసులను వెంటనే, 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

 
బాలికపై అత్యాచారం కేసు, కుటుంబానికి సంబంధించిన మరో నాలుగు కేసులను దిల్లీకి బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాలిక కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

 
లఖ్‌నవూ కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీలో నేను బాలిక సోదరిని కలిసినప్పుడు, మిగతా కుటుంబం అంటే బాలిక తల్లి, ముగ్గురు సోదరిలు, చిన్న తమ్ముడు ఆమెతోపాటు నేలపై ఒక గుడ్డ పరుచుకుని కూర్చుని కనిపించారు. బాలిక తల్లికి సుప్రీంకోర్టు ఆదేశాల గురించి చెప్పినపుడు ఆమె "పోనీలే ఏదో ఒక మంచి వార్త వచ్చింది. ఇక నేను నా మరిదిని కూడా విడుదల చేయిస్తే, మాకు తోడైనా ఉంటుంది. లేదంటే ఈ పోరాటం ఎవరు చేస్తారు" అన్నారు.

 
వాళ్లలో ఎవరూ చదువుకోలేదు. ఎవరూ ఇప్పటివరకూ కోర్టు ముఖం కూడా చూళ్లేదు. వాళ్ల చేతుల్లో ఎవరి దగ్గరా నాకు స్మార్ట్‌ఫోన్ కూడా కనిపించలేదు. దీనిపై పోరాటం చేస్తున్న పిన్ని లేకుండాపోయారు. ఆమెకు వెన్నంటి నిలిచిన సోదరి కూడా ఇప్పుడు లేరు. సుప్రీంకోర్టు జోక్యంతో బాలిక, ఆమె వకీల్‌ను చికిత్స కోసం దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది.

 
వకీల్ కోమాలో ఉన్నట్టు చెబుతున్నారు. బాలిక వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటోంది. "ఇప్పుడు న్యాయం జరుగుతుందనే ఆశ కలిగేసరికే, జీవించాలనే కోరిక చచ్చిపోయింది" అని బాలిక సోదరి అంటోంది.