సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 16 ఆగస్టు 2022 (20:52 IST)

బిల్కిస్ బానోను గ్యాంగ్ రేప్ చేసి, కుటుంబ సభ్యులను చంపిన 11మందిని గుజరాత్ ప్రభుత్వం ఎందుకు విడుదల చేసింది?

woman
బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది, సత్పవర్తన కింద సోమవారం విడుదలయ్యారు. గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోను, 2002 గోద్రా అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారం చేశారు. నాడు ఆమెకు 19 ఏళ్లు. తన రెండేళ్ల కూతురితో పాటు మరో 14 మంది బంధువులను కూడా చంపేశారు. బిల్కిస్ బానో కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఒకరైన రాధేశ్యాం షాహా, 15 ఏళ్లు కారాగారంలో ఉన్నందున శిక్షను తగ్గించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వానికి కోర్టు సూచించింది.

 
జైలు నుంచి విడుదలైన వారు:
జస్వంత్ నాయీ
గోవింద్ నాయీ
శైలేశ్ భట్
రాధేశ్యామ్ సాహా
విపిన్ చంద్ర జోషి
కేశర్ భాయీ వొహానియా
ప్రదీప్ మోడియా
బాకా భాయీ వొహానియా
రాజూ భాయీ సోనీ
మితేశ్ భట్
రమేశ్ చందన

 
'11 మంది దోషులు 14 ఏళ్ల శిక్షను పూర్తి చేసుకున్నారు. చట్టప్రకారం కనీసం 14 ఏళ్లు జీవితకాల శిక్ష అనుభవించిన వారు శిక్షను తగ్గించమని విజ్ఞప్తి చేయొచ్చు. ఖైదీల అర్హతల ఆధారంగా ప్రిజన్ అడ్వైజరీ కమిటీ సలహా మేరకు ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది' అని గుజరాత్ హోంశాఖ అదనపు కార్యదర్శి రాజ్‌కుమార్ తెలిపినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రిపోర్ట్ చేసింది. సుప్రీం కోర్టు సూచన మేరకు పంచమహాల్ కలెక్టర్ సుజల్ మాయాత్ర నేతృత్వంలో గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. బిల్కిస్ బానో కేసు జైలు శిక్ష అనుభవిస్తున్న 11 మందిని సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని ఆ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. కమిటీ సలహా మేరకు వారిని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద విమర్శలు వస్తున్నాయి.

 
'బిల్కిస్ బానో కేసు కంటే తక్కువ తీవ్రత కలిగిన నేరాలు చేసిన వారు జైలు గోడల మధ్య మగ్గిపోతున్నారు. బిల్కిస్ బానో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం ద్వారా వ్యవస్థ మీద బాధితులకు నమ్మకం పోతుంది' అని మానవహక్కుల లాయర్ షంషద్ పఠాన్ పీటీఐతో అన్నారు. మహిళా హక్కుల కార్యకర్త కవితా కృష్ణన్ కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారు. అయితే, సత్ప్రవర్తన కింద విడుదల కేసుల్లో దోషులు ఇంతకు ముందు చేసిన నేరాల తీవ్రతను పరిగణనలోకి తీసుకోరని, ఇందులో అనేక అంశాలు ముడి పడి ఉంటాయని, గతంలో దోషుల తరఫున కోర్టుల్లో వాదనలు వినిపించిన న్యాయవాది గోపాల్ సింగ్ సోలంకి అన్నారు. శిక్ష అనుభవిస్తున్న దోషులు విడుదలైన సందర్భంగా బిల్కిస్ బానో భర్త యాకూబ్ రసూల్‌తో బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ చారా మాట్లాడారు.

 
రాక్సీ గాగ్డేకర్: బిల్కిస్ బానో కేసులో 11మంది నిందితులను రాష్ట ప్రభుత్వం విడుదల చేసింది కదా. మీ స్పందన ఏంటి?
యాకూబ్: వాళ్లు జైల్లో ఉన్నంత కాలం మాకు భయం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు భయం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వారిని విడుదల చేస్తున్నట్లు మాకు తెలియదు. ఎవరూ చెప్పలేదు. మీడియాలో వచ్చిన తర్వాతే తెలిసింది.

 
రాక్సీ గాగ్డేకర్: మీరెందుకు భయపడుతున్నారు?
యాకూబ్: మేం ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాం. నిందితులు ఇప్పుడు బయటకు వచ్చారు. వాళ్లు గతంలో పెరోల్‌ మీద బయటకు వచ్చినప్పుడు కూడా మేం భయపడ్డాం. అప్పుడు కొద్దిగా భయపడ్డాం. ఇప్పుడు మళ్లీ వాళ్లు విడుదలయ్యారు. మాలో భయం పెరిగింది. మేం దీనిగురించి ఎక్కువ మాట్లాడలేం. ఎందుకంటే వాళ్లు ఎలా బయటకు వచ్చారో మాకు పూర్తిగా తెలియదు. రెండో విషయం మేం మా కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి. నాడు మా ఇంట్లో చిన్న పిల్లలను కూడా చంపేశారు. వాళ్లు మాకు నిత్యం గుర్తుకొస్తుంటారు. అందుకే మాకు భయం కలుగుతుంటుంది.

 
రాక్సీ గాగ్డేకర్: ఈ నిర్ణయం గురించి తెలిసిన తర్వాత బిల్కిస్ బానో ఎలా స్పందించారు?
యాకూబ్: ఇదంతా ఎలా జరిగిందని ఆమె ఆందోళన చెందింది. కాస్త అప్‌సెట్ అయ్యింది. కానీ తర్వాత...ఏం జరుగుతుందో చూద్దామని అన్నది. ఇది న్యాయపరమైన విషయం కాబట్టి మాకు ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. దాని గురించి ఎక్కువ మాట్లాడలేం.

 
రాక్సీ గాగ్డేకర్: మీరు చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నారు. ఈ నిర్ణయం తర్వాత మీరు ఎలా పోరాడాలని అనుకుంటున్నారు. ఎక్కడి దాకా వెళతారు?
యాకూబ్: మేం చాలా కాలం నుంచి అంటే దాదాపు 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఆ కాలంలో మేం ఎన్నో కష్టాలను అనుభవించాం.

 
రాక్సీ గాగ్డేకర్: మీకు నష్టపరిహారం ఇస్తారని, ఇల్లు ఇస్తారని, ఉద్యోగం ఇస్తారని సర్కారు హామీ ఇచ్చింది. అవి నెరవేరాయా ?
యాకూబ్: పరిహారం ఇచ్చారు. కానీ ఇల్లు ఇవ్వలేదు. జాబ్ రాలేదు.

 
రాక్సీ గాగ్డేకర్: జాబ్ రాకపోవడంలో సమస్య ఏంటి?
యాకూబ్: బిల్కిస్‌కు జాబ్ ఇస్తామన్నారు. కానీ ఆమె జాబ్ చేయడం కుదరదు. పిల్లల్ని చూసుకోవాలి. కష్టం. అందుకే ఆమెకు బదులు నాకు ఇవ్వమని లేదంటే, మా కుటుంబ సభ్యులకు ఇవ్వమని అడిగాం. ఇంతవరకు దాని మీద స్పష్టత ఇవ్వలేదు.

 
రాక్సీ గాగ్డేకర్: న్యాయపోరాటం సరే, మీ కుటుంబం కోసం మీరు ఏం చేయబోతున్నారు?.
యాకూబ్: ఏం చేయాలన్నది మా కుటుంబ సభ్యులమంతా ఆలోచిస్తాం.

 
రాక్సీ గాగ్డేకర్: మీరు ఇల్లు మారాలనుకుంటున్నారా?
యాకూబ్: అవును. ఎక్కువకాలం ఒకే ప్రాంతంలో ఉంటే మాకు ప్రమాదం. అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేం ఇల్లు మారాలనుకుంటున్నాం.

 
బిల్కిస్ బానో కేసులో ఏం జరిగింది?
2002 ఫిబ్రవరిలో గుజరాత్ నుంచి వందల మంది కరసేవకులు విశ్వహిందూ పరిషత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయోధ్యకు వెళ్లారు.
ఫిబ్రవరి 25న కరసేవకులు అహ్మదాబాద్‌కు వచ్చే సబర్మతీ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు.
ఫిబ్రవరి 27న గోద్రాలో రైలు ఆగినప్పుడు ముస్లిం మూకలు రైలు మీద దాడి చేశాయి. రాళ్లు విసరడంతోపాటు కొన్ని బోగీలకు నిప్పు పెట్టాయి.
ఈ ఘటనలో 59 మంది చనిపోయారు.
కరసేవకుల మీద దాడి గురించి తెలియగానే హిందూ మూకలు ముస్లింల మీద దాడులకు దిగాయి. ముస్లింలను చంపడంతోపాటు వారి ఆస్తులను ధ్వంసం చేశారు.
ఈ దాడుల్లో వెయ్యి మందికి పైగా చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

 
ఎవరు బిల్కిస్ బానో?
బిల్కిస్ బానోది గుజరాత్‌లోని దహోద్ జిల్లాలో గల రంధిక్‌పుర్ గ్రామం.
2002 మార్చిలో బక్రీదు రోజు దహోద్‌తోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. హిందూ మూకలు ముస్లింల ఇళ్ల మీద దాడులకు దిగాయి. ఆ దాడుల నుంచి తప్పించుకునేందుకు మూడేళ్ల కూతుర్ని తీసుకుని ఇల్లు విడిచి బానో పారిపోయారు. ఆమెతోపాటు 15 మంది కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.

 
మార్చి 3వ తారీఖున బానో కుటుంబం ఛప్పర్‌వాడ్ గ్రామంలోని పొలాల్లో తలదాచుకున్నారు. చార్జ్ షీట్‌లో పేర్కొన్న ప్రకారం, 20-30 మంది కర్రలు, గొలుసులతో బానో కుటుంబం మీద దాడి చేశారు. బిల్కిస్‌తో పాటు మరొక నలుగురు మహిళల మీద ముందు దాడి చేశారు. ఆ తరువాత వారిని రేప్ చేశారు. వారిలో బిల్కిస్ తల్లి కూడా ఉన్నారు. వారిలో బిల్కిస్ ఒక్కరే బతికి బయటపడ్డారు. ఆ దాడిలో బిల్కిస్ మూడేళ్ల కూతురు చనిపోయింది. ఆమె ఇతర కుటుంబ సభ్యులను చంపేశారు.

 
స్పృహ తప్పిన బిల్కిస్ బానో చనిపోయిందనుకుని వదిలేయడంతో ఆమె బతికారు. స్పృహలోకి వచ్చిన తరువాత దగ్గర్లోని ఆదివాసీ మహిళను అడిగి బట్టలు తీసుకున్నారు. ఆ తరువాత ఒక హోం గార్డ్ సాయంతో లింఖేడా పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కాన్‌స్టేబుల్ సోం భాయి గోరీ ఆమె ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారంటూ ఆ తరువాత గోరీకి శిక్ష పడింది. బిల్కిస్ బానోను గోద్రా పునరావాస శిబిరానికి తీసుకెళ్లారు. ఆ తరువాత వైద్య పరీక్షలు నిర్వహించారు.

 
తొలుత కేసు నమోదు చేసిన పోలీసులు, సరైన ఆధారాలు లేవంటూ కేసును మూసేశారు. దాంతో జాతీయ మానవహక్కుల కమిషన్‌ను బానో ఆశ్రయించారు. విచారణ కోసం సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. దాంతో సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించింది. విచారణ తరువాత 18 మందిని నిందితులుగా సీబీఐ చార్జ్ షీట్ వేసింది. వీరిలో ఇద్దరు డాక్టర్లు, అయిదుగురు పోలీసులు కూడా ఉన్నారు. నిందితులను కాపాడేందుకు చనిపోయిన వారికి పోస్ట్ మార్టం సరిగ్గా నిర్వహించలేదని సీబీఐ తెలిపింది. దాంతో సమాధుల నుంచి మృతదేహాలను తీసి మళ్లీ పోస్ట్ మార్టం నిర్వహించగా దేహాల నుంచి తలలను వేరు చేసిన విషయం తెలిసింది. చివరకు 2008లో సీబీఐ స్పెషల్ కోర్టు 11 మందిని దోషులుగా తేల్చి జీవితకాల కారాగార శిక్ష విధించింది.