ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 13 ఆగస్టు 2022 (20:21 IST)

విశాఖపట్నం బీటెక్ వాలా పానీపూరీ: “ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు.. పానీపూరీ వ్యాపారంతో సక్సెస్ అయ్యా”

BTech Wala Panipuri
“బీటెక్ పూర్తయ్యింది. ఏం చేయాలో తెలియడం లేదు. క్యాంపస్ సెలెక్షన్స్‌లో ఐటీ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను. కానీ ఆ కంపెనీ నుంచి కాల్ లెటర్ రాలేదు. ఇతర ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదు. ఏదో చేస్తే తప్ప ఇంటి ఆర్థిక అవసరాలు తీరేటట్లు లేదు. ఫ్రెండ్స్‌తో కలిసి పుణె వెళ్లినప్పుడు అక్కడ తిన్న పానీపూరి గుర్తుకొచ్చింది. అదే నా లైఫ్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది”అని చెప్పారు ఆర్. శ్రీరామకృష్ణ. బీటెక్ వాలా పానీపూరీ పేరుతో విశాఖపట్నంలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి విజయం సాధించిన శ్రీరామకృష్ణ, తన సక్సెస్ స్టోరీని బీబీసీతో పంచుకున్నారు. ఉద్యోగం వేటలో విజయవంతం కాలేకపోయినా, ఉపాధి కల్పించే స్థాయికి తాను ఎలా చేరుకొన్నదీ ఆయన వివరించారు. సారాంశం ఆయన మాటల్లోనే...

 
‘క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్టయ్యాను...కానీ ఉద్యోగం రాలేదు’
2016లో దువ్వాడలో ఉన్న విజ్ఞాన్ కళాశాలలో బీటెక్ జాయిన్ అయ్యాను. 2020కి పూర్తి కావలసిన నా బీటెక్ కోర్సు కోవిడ్-19 కారణంగా 2021కి పూర్తయ్యింది. 2020లో మాకు క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. అందులో కంప్యూటర్ సైన్స్ స్టూడెంటైన నాకు ఒక ఐటీ కంపెనీలో నెలకు రూ.18 వేలు జీతంతో ఉద్యోగం వచ్చింది. కానీ ఏడాది ఎదురు చూశాను. కాల్ లెటర్ రాలేదు. నాతో పాటు కొందరు మా క్లాస్ మేట్స్ కూడా సెలెక్ట్ అయ్యాం. ఎవరికి ఆఫర్ లెటర్ రాలేదు. కోవిడ్ పరిస్థితులే దీనికి కారణమని మా కాలేజ్ యాజమాన్యం చెప్పింది.

 
ఏదైనా చేయాలని నిరంతరం ఆలోచిస్తూనే ఉండేవాడిని. ఒకవైపు ఆర్థిక అవసరాల కోసం మా అమ్మగారిపైనే ఆధారపడేవాడిని. ఆవిడే చిన్నచిన్న పనులు చేస్తూ నన్ను పోషించేది. నాన్నగారు చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేను బీటెక్ సెకండియర్‌లో ఉండగా అంటే 2018లో చనిపోయారు. బీటెక్ పూర్తైన వెంటనే కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన పరిస్థితి. తమ్ముడు చదువుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్‌తో ఏదైనా ఫుడ్ బినిజెస్ చేద్దామనే ఆలోచన వచ్చింది.

 
‘నా డిగ్రీ పేరే మా వ్యాపారానికి పెట్టుకున్నాం’
బీటెక్ చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి మహారాష్ట్రలోని పూణె వెళ్లాను. అక్కడ పానీపూరీ బండిని చూశాను. అది వెరైటీగా ఉంది. ఆ బండిపై జాడీలలో పానీపూరీ వాటర్ ఉండటం, అది కూడా రకరకాలైన పానీపూరీ వాటర్ ఉంది. నేను విశాఖలో అలాంటిది చూడలేదు. అక్కడ టేస్ట్ చేశాం. ప్లేటులో ఐదు పానీపూరీలు ఇచ్చారు. ఒక్కొ పానీపూరీలో ఒక్కొ రకం వాటర్ వేశారు. ఒక్కొ పానీపూరీ ఒక్కొ టేస్టులో అనిపించింది. అది గుర్తుకు వచ్చింది. అదే బాగుంటుందని మా కజిన్ మనోజ్ అన్నారు. అయితే నాకెందుకో ముందు ధైర్యం సరిపోలేదు. ఇప్పటికే అనేక పానీపూరీ స్టాల్స్ ఉన్నాయి. మన స్టాల్ పెడితే క్లిక్ అవుతుందా అని మా అమ్మ, తమ్ముడు, కజిన్‌తో చాలా రోజులు చర్చించాను.

 
ఫైనల్‌గా ముందుకే అడుగేయాలని నిర్ణయానికి వచ్చాం. నాకు తోడు మా కజిన్ ఉంటామన్నారు. మాకు తెలిసిన వాళ్లు కొందరితో ఈ ఐడియా షేర్ చేసుకుంటే...బీటెక్ చేసి పానీపూరీ అమ్ముతారా అంటూ మాట్లాడారు. ఆ మాటల వలన మేం ప్రారంభిద్దామని అనుకున్న పానీపూరీ వ్యాపారం కాస్త లేటయ్యింది. చివరకు బీటెక్ చదువుకున్నారు అని అందరూ అంటున్నారు కదా అందుకే మా వ్యాపారానికి కూడా బీటెక్ వాలా పానీపూరీ అని పేరు పెట్టాం. అలా మొదలైంది మా బీటెక్ వాలా పానీపూరీ సెంటర్.

 
‘రూ. 650 పెట్టుబడితో మొదలైంది’
మా సొంతూరు అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని గుడివాడ గ్రామం. అక్కడే మా అమ్మ చిన్నచిన్న పనులు చేస్తూ విశాఖపట్నంలో ఉండే నాకు డబ్బులు పంపించేది. పానీపూరీ వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నాక మా అమ్మ మాకు తోడుగా ఉండేందుకు ఊరి నుంచి వచ్చేశారు. మాతో పాటు ఉంటూ మాకు సహాయం చేస్తున్నారు. ఈ ఏడాది (2022) ఫిబ్రవరిలో మొదలైన మా వ్యాపారానికి తొలి పెట్టుబడి ఎంతో తెలుసా? కేవలం రూ. 650. అప్పటికే ఖర్చుల కోసం ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్నాం. ఆ డబ్బులే పెట్టుబడిగా తొలి రోజు పానీపూరీ తయారు చేసి న్యూకోలనిలో ఓ లాడ్జ్ ముందు పెట్టి సేల్ చేశాం. ఆ రోజు మొత్తం సరుకు అమ్ముడైపోయి, రూ.800 చేతికి వచ్చింది. అంటే రూ.150 లాభం. పుణెలో చూసినట్లే ప్లేటుకి ఆరు పానీపూరిలు పెట్టి...ఒక్కొక్క పూరిలో జాడీల్లో సిద్ధంగా ఉంచిన ఒక్కొ రకం పానీపూరీ వాటర్ వేశాం. అది జనాలకు నచ్చింది. వ్యాపారం పెరుగుతూ వచ్చింది.

 
‘ విశాఖలో ఐదు స్టాల్స్...ప్రాంచైజీలు కూడా..’
చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాక, ఎంపికైన ఉద్యోగానికి కంపెనీలు పిలవక, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించని సమయంలో మొదలైన మా బీటెక్ వాలా పానీపూరీ విజయం సాధించింది. మేం మొదట ప్రారంభించిన న్యూ కోలనితో పాటు విశాఖలోని ఎన్ఏడీ జంక్షన్, శ్రీరామ టాకీస్ సెంటర్, మద్దిలపాలెం, ఎంవీపీ కోలనీలలో స్టాల్స్ పెట్టాం. అన్నీ కూడా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్నాయి. పానీపూరీ వ్యాపారమా, మీ చదువుకు తగ్గది కాదంటూ మొదట్లో వద్దని అన్నవారే, ఇప్పుడు బీటెక్ వాలా పానీపూరీ ఫ్రాంచైజీలు కావాలని అడుగుతున్నారు. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇదంతా ఐదు నెలల కాలంలోనే జరిగిపోయింది. ప్రస్తుతం మేం పెట్టిన స్టాల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి రోజూ సుమారు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు బిజినెస్ చేస్తాయి. వచ్చే ఐదు నెలల కాలంలో విశాఖలో మరిన్ని స్టాల్స్‌తో పాటు కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరులలో మా బ్రాంచ్‌లు ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తున్నాం.

 
‘కొత్త వంటల కోసం రోజూ రెండు గంటలు’
పానీపూరీ సక్సెస్ కావడంతో పావ్‌ భాజీ, హాట్‌చాట్‌లలో డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేశాం. అవి కూడా జనాలకి బాగా నచ్చాయి. మేం డిఫరెంట్ పానీపూరీలతో పాటు చాట్స్‌లో 50 రకాలు తయారు చేస్తాం. మేకింగ్, పానీపూరీ వాటర్, అందులో వాడే దినుసులు అన్నీ కూడా మేమే తయారు చేస్తాం. వాటిని నేను, నా కజిన్ మనోజ్ ఇద్దరం స్వయంగా పట్టుకుని వెళ్లి నగరంలో ఉన్న మా స్టాల్స్‌కి సప్లయ్ చేస్తాం. మేం నూనె వాడం, నెయ్యినే వాడతాం. పానీపూరీ అందరూ చేస్తారు, కానీ మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అదే మా సక్సెస్ సీక్రట్ కూడా. ప్రతి రోజు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కోసం నెట్‌లో సెర్చ్ చేస్తుంటాం. దేశంలో కొత్తగా వస్తున్న ఆహారం తయారీ పద్ధతులు, కొత్త రుచులు అన్నీ తెలుసుకుంటాం. వాటిని ఇక్కడి జనాలకు నచ్చే విధంగా, మన టేస్ట్‌కు సూటయ్యే విధంగా మార్చేందుకు ఆలోచిస్తుంటాం. అందుకోసం ప్రయత్నిస్తూ రోజూ రెండు గంటలు కేటాయిస్తాం.

 
‘నాకు ఆఫర్ చేసిన జీతం రూ. 18 వేలు, నేను ఇస్తున్నది రూ. 30 వేలు’
మా కళాశాలలో క్యాంపస్ సెలెక్షన్స్‌లో ఒక ఐటీ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చిందని ఇంతకుముందు చెప్పాను కదా. అప్పుడు వాళ్లు నెలకు రూ. 18 వేలు జీతం ఇస్తామన్నారు. అయితే కోవిడ్ కారణంగా ఆ జాబ్ రాలేదనుకోండి. అది రాకపోవడం వలనే నేను ఏదో చేద్దామని ఆలోచిస్తూ బీటెక్ వాలా పానీపూరీ మొదలు పెట్టాను. ఇప్పడు అది మరి కొందిరికి ఉపాధిని ఇచ్చే స్థాయికి చేరింది. ఇప్పుడు నా వద్ద 10 మంది పని చేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి కనీసం రూ. 20 వేలు నుంచి రూ. 30 వేల వరకు ఇస్తున్నాను. ఇది నా విజయంగానే భావిస్తాను. సంపాదిస్తున్న ప్రతి పైసా ఆడంబారాలకు పోకుండా దాస్తున్నాం. ఫుడ్ బిజినెస్‌లో నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా అమలు చేయడానికి కాస్త డబ్బు కావాలి. నా ఫుడ్ బిజినెస్ ఆలోచనలు నేను అనుకున్నట్లు సెట్ అయిపోతే, చదువుపై కూడా దృష్టి పెడదామనుకుంటున్నాను.