శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 26 జులై 2023 (15:50 IST)

ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర మంత్రి షెకావత్ ఎందుకు తప్పుబట్టారు? కుళాయి నీళ్ల పథకం అమలులో ఏపీ ఎక్కడుంది?

కర్టెసీ: జల్ జీవన్ మిషన్
ఇంటింటికీ కుళాయి నీళ్లు అందించే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ సరిగా అమలు చేయడం లేదంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తప్పుబట్టారు. ‘జల్ జీవన్ మిషన్’ కింద 2021 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఒక్క పైసా కూడా ఆంధ్రప్రదేశ్ వాడుకోలేదని ఆయన పార్లమెంటులో విచారం వ్యక్తంచేశారు. గ్రామీణ భారత దేశంలోని అన్ని ఇళ్లకు 2024 నాటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చి, సురక్షితమైన తాగునీటిని అందించే ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిధుల వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్ తీరు గురించి షెకావత్ పార్లమెంటులో ఇంకా ఏమన్నారు? జల్ జీవన్ మిషన్‌ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
 
రాజ్యసభలో జీవీఎల్ ఏం అడిగారు?
జులై 24 సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఏపీలో జల్‌జీవన్ మిషన్ ప్రగతి గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఇంటింటికీ నీటి కుళాయిలు ఇచ్చే స్కీమ్ కవరేజ్ ఎందుకు తక్కువగా ఉందని జీవీఎల్ అడిగారు. ‘‘దేశంలో జల్‌జీవన్ మిషన్ కింద ఇంటింటికీ కుళాయి నీరు పథకాన్ని అత్యంత సమర్ధవంతంగా అమలు చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, జలశక్తి శాఖ మంత్రికి నా అభినందనలు. దేశ చరిత్రలోనే ఇది ఒక విజయవంతమైన పథకం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మంచినీటి సరఫరా కవరేజ్ గతంతో పోలిస్తే రెట్టింపయ్యింది. కానీ, కొన్ని జిల్లాల్లో కవరేజ్ పెరిగినా, చాలా తక్కువగా పెరిగింది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నేను మంత్రిని కోరుతున్నాను. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ స్కీమ్ కవరేజ్‌ను పెంచడానికి ఏదైనా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారా అని నేను కేంద్ర మంత్రిని అడుగుతున్నాను’’ అని జీవీఎల్ అన్నారు.
 
చాలా బాధతో ఈ విషయం చెబుతున్నా: షెకావత్
జీవీఎల్ ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి షెకావత్, ఈ పథకం అమలులో ఏపీ వెనకబడి ఉందన్నారు. ‘‘నేను ఇంతకు ముందే చెప్పాను. ఈ స్కీమ్ అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉంది. నేను చాలా బాధతో ఒక విషయం చెబుతున్నాను. 2021 సంవత్సరానికి ఈ స్కీమ్ కోసం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఒక్క పైసా కూడా ఆ రాష్ట్రం విత్ డ్రా చేసుకోలేదు. పైగా 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వాల్సిన నిధుల వాటాను కూడా ఇవ్వలేదు. ఇది చాలా విచారకరం. ఈ విషయంలో మేం పదే పదే ప్రభుత్వాన్ని సంప్రదించాం’’ అని ఆయన చెప్పారు.
 
పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది?
ప్రతి ఇంటికీ కుళాయి నీళ్లు అందించే ఈ స్కీమ్‌లో ఏయే రాష్ట్రాలు ఎంత వరకు ప్రగతి సాధించాయో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్ మిషన్‌ వెబ్‌సైట్‌లో గణాంకాలను పొందుపరుస్తుంటుంది. ఇంటింటికీ నల్లా విషయంలో ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి 57.96 శాతం గృహాలకు కొత్తగా కుళాయి నీటి సౌకర్యం కల్పించినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ డేటా ప్రకారం- నూరు శాతం ఇళ్లకు కుళాయి నీరు అందించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో తెలంగాణ కూడా ఉంది. గోవా, హరియాణా, పుదుచ్చేరి, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూడామన్ కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 70.07 శాతం ఇళ్లకు ట్యాప్ వాటర్ సప్లయి సాధించి, ఈ జాబితాలో 20వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 95,54,840 ఇళ్లు ఉండగా, వాటిలో 66, 95,483 గృహాలకు మాత్రమే కుళాయి నీటి సౌకర్యం ఉన్నట్లు ఆ వెబ్‌సైట్ చెప్పింది.
 
తెలంగాణలో అలా, ఏపీలో ఇలా: టీడీపీ
షెకావత్ వ్యాఖ్యలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు గ్రామీణ ప్రాంతాలకు రక్షిత మంచినీటిని అందించే విషయంలో ప్రభుత్వం రాజీపడుతోందని విమర్శించగా, పాలక వైసీపీ వీటిని ఖండించింది. ఏపీలో అధికార పార్టీకి ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడంలో చిత్తశుద్ధి లేదని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ‘‘తెలుగుదేశం ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పేరుతో ఇంటింటికి నీటిని అందించే స్కీం చేపట్టింది. దాని కోసం వాటర్ సోర్స్ ఉన్న దగ్గర అంటే విశాఖలో శారదా నది, రైవాడ రిజర్వాయర్ వంటి ప్రాంతాల నుంచి పైపు లైన్లు కూడా వేశాం. కానీ వాటి నుంచి నీరు కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిద్రపోతోంది. వాటర్ సోర్స్ లేని చోట మాత్రం కమిషన్ల కోసం కోట్ల రూపాయల విలువైన పైపులను కొని పడేసింది. నీరు లేని చోట ఈ పైపులను ఏం చేస్తారు? ఈ విషయాలు తెలిసే కేంద్ర జలశక్తిశాఖ మంత్రి ఏపీ ప్రభుత్వ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు’’ అని టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ విమర్శించారు.
 
ఈ పథకం కోసం కేటాయించిన నిధులు వినియోగించాలంటే పనులు చేసి చూపించాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ ఎలాంటి పనులూ జరగడం లేదని సత్యనారాయణ ఆరోపించారు. ‘‘ఒకవైపు మిషన్ భగీరథ పేరుతో పక్కరాష్ట్రం తెలంగాణ చేసి చూపెడుతుంటే, మన రాష్ట్రంలో మాత్రం కమిషన్ల కోసమే కక్కుర్తి పడుతున్నారు’’ అని ఆయన విమర్శించారు. ఆరోపణలను అధికార వైసీపీ ఖండించింది.
 
నిధులను పూర్తిస్థాయిలో వాడుతున్నాం: ఏపీ మంత్రి అప్పలరాజు
కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై బీబీసీ స్పందన కోరినప్పుడు- ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఈ అంశంపై మాట్లాడారు. జల్‌జీవన్ మిషన్ నిధులను పూర్తిస్థాయిలో వాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ‘‘ రాష్ట్రంలో ఇంటింటికి కుళాయి కనిపిస్తోంది. దానికి జల్‌జీవన్ నిధులు వాడటమే కారణం. ఏ గ్రామానికి వెళ్లినా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. నిధులు వాడటం లేదని కేంద్ర మంత్రి ఎందుకు అన్నారో నాకు తెలియదు. ఆయన ఏ సందర్భంలో ఆ మాటలన్నారో పూర్తిగా తెలుసుకుంటాను’’ అని అప్పలరాజు చెప్పారు.
 
2019లో ప్రధాని మోదీ ఏమన్నారు?
జల్ జీవన్ మిషన్‌ ప్రారంభంపై 2019 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ‘‘ఈ రోజు నేను ఎర్రకోట మీద నుంచి ప్రకటిస్తున్నాను. జల్‌జీవన్ మిషన్‌ను ప్రారంభిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ స్కీమ్‌ను నిర్వహిస్తాయి. రాబోయే రోజుల్లో ఈ పథకం కోసం మేం రూ. 3.5 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నాం’’ అని నాడు ఆయన చెప్పారు. జల సంరక్షణ కోసం గ్రే వాటర్ మేనేజ్‌మెంట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ కన్జర్వేషన్ లాంటి స్కీములను కూడా ఈ పథకంలో భాగంగా అమలు చేస్తున్నారు.
 
అదనపు సమాచారం: లక్కోజు శ్రీనివాస్, విశాఖపట్నం