భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందిన సైఖోమ్ రాకెట్ తన జేబులో నుంచి ఒక తూటా తీసి చూపిస్తూ.. ఇదే మా అబ్బాయిని చంపేసింది అని చెప్పారు. జులై 10న ఇంఫాల్‌కు సమీపంలోని కాదంగ్‌బంద్‌లో చోటుచేసుకున్న కాల్పుల్లో తన 28 ఏళ్ల కుమారుడు శుబోల్ సైఖోమ్ గాయపడినట్లు ఆయనకు తెలిసింది. తన కాలిపై తూటా తగిలినట్లు నాకు చెప్పారు. దీంతో పెద్ద భయపడాల్సిందేమీ లేదని అనుకున్నాను. చికిత్స అనంతరం నయం అయిపోతుందిలే అని భావించాను. కానీ, నేను అక్కడికి వెళ్లేసరికి తను శవమై కనిపించాడు అని ఆయన వివరించారు.
మెయితెయి తెగ విలేజ్ డిఫెన్స్ కమిటీలో వాలంటీరుగా కొంత కాలం నుంచి శుబోల్ పనిచేస్తున్నారు. మెయితెయి, కుకీల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశముండే కల్లోలిత ప్రాంతాల్లో ఈ కమిటీలు క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. అలా జులై 10 ఉదయం ఇంఫాల్ లోయకు సమీపంలో రెండు సాయుధ వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో ఆయన మరణించారు. తన కొడుకుని బలి తీసుకున్న ఆ తూటాను ఎవరు పేల్చారో విచారణ జరపాలని సైఖోమ్ రాకెట్ డిమాండ్ చేశారు. అసలు రెండు నెలల నుంచి చెలరేగుతున్న హింస ఎందుకు శాంతించడంలేదో అర్థం కావడంలేదని ఆయన అన్నారు.
ఈ ఘర్షణలతో రాజకీయాలు చేసేవారికి ఒకటే నేను చెబుతున్నాను. ఇలాంటి చెత్త పనులు ఆపేయాలి, మనుషులేమీ బొమ్మలు కాదనే విషయాన్ని గుర్తించాలి. ప్రస్తుతం కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వమే ఉంది. అయినప్పటికీ ఎందుకు ఏమీ చేయడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం శుబోల్ మృతిపై సంతాపం తెలిపేందుకు చాలా మంది సైఖోమ్ రాకెట్ ఇంటికి వస్తున్నారు. శుభోల్ ఫుట్‌బాల్ కిట్, అతడి దుస్తులను పట్టుకుని ఆయన తల్లి ఇంట్లో ఏడుస్తూ కనిపించారు.
వీధుల్లో ఆగ్రహావేశాలు
శుబోల్ మరణ వార్త రెండు గంటల్లోనే దావానలంలా వ్యాపించింది. దీనిపై నిరసన తెలిపేందుకు ఇంఫాల్ వీధుల్లోకి ఆగ్రహావేశాలతో ప్రజలు వచ్చారు. శుబోల్ ఇంటికి 1.5 కి.మీ. దూరంలోని ఇమా మార్కెట్ దగ్గర రోడ్లను కొందరు మహిళలు స్తంభింపజేశారు. అయితే, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్సింగ్ ఇంటికి ఈ మహిళలు వెళ్లకుండా పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఈ నిరసనల్లో పాలుపంచుకున్న నిరుపమ లైష్రమ్ మాట్లాడుతూ.. మా కోసం ఒక యువకుడు మరణించారు. ఇంకా ఎంతమంది ఇలా చనిపోవాలో అర్థంకావడం లేదు. మాకు రక్షణ కల్పించండి. ఇదే మా డిమాండ్. మేం ఇలా చనిపోవాలని కోరుకోవడం లేదు. దయచేసి మమ్మల్ని కాపాడండి అని ఆమె అన్నారు.
ఈ ఘర్షణలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడ్డుకట్ట వేయకపోవడంతో ఆయనపైనా కోపంగా ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. నిరసనలకు నేతృత్వం వహించిన రనిత లైష్రమ్ మాట్లాడుతూ.. నేను మోదీకి ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను. మేం అసలు భారతీయులమా.. కాదా? అసలు మా గురించి మీరేమైనా పట్టించుకుంటారా లేదా? మమ్మల్ని భారతీయులుగా చూస్తే, అసలు ఇక్కడ ఏం జరుగుతోందో చూడటానికి ఆయన రావాలి. ఇక్కడ వ్యాపారాలు, జనజీవనం స్తంభించిపోయాయి. పాఠశాలలను మూసివేశారు. అన్నీ ధ్వంసం చేస్తున్నారు అని ఆమె అన్నారు.
మౌనంగా కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. ఇక్కడి సమస్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కారం చూపగలవు. ఈ విషయం గురించి ఆలోచించండి. త్వరగా పరిష్కారం చూపండి. ఇప్పటికే రెండు నెలలకుపైనే గడిచిపోయింది అని ఆమె అన్నారు. మే 3వ తేదీన ఇక్కడ ఘర్షణలు మొదలయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 142 మంది మరణించారు. 60,000 మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,000పైగా దోపిడీ, ఆస్తుల విధ్వంసం ఘటనలు జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. హింసకు సంబంధించి 5,995 కేసులు నమోదు చేశామని, 6,745 మందిని అందుపులోకి తీసుకున్నామని సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక నివేదికలో మణిపుర్ ప్రభుత్వం తెలిపింది. పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడుతున్నాయని కూడా ప్రభుత్వం వెల్లడించింది.
చురాచాంద్‌పుర్‌లో పరిస్థితి ఇదీ
ఇక్కడ హింస మొదటగా చెలరేగిన చురాచాంద్‌పుర్‌కు మేం వెళ్లాం. ఇంఫాల్‌కు 70 కి.మీ. దూరంలో ఆ ప్రాంతం ఉంటుంది. అక్కడికి చేరుకోవడం అంత తేలిక కాదు. ఇంఫాల్, చురాచాంద్‌పుర్‌ల మధ్య బిష్ణుపుర్ జిల్లా ఉంటుంది. చురాచాంద్‌పుర్ వరకూ వెళ్లాలంటే మధ్యలో చాలా సైనిక, సాయుధ బలగాల చెక్‌పోస్టులను దాటుకుంటూ వెళ్లాలి. హింసలో చనిపోయిన వారిని గుర్తుచేసుకునేందుకు ఇక్కడ ఒక స్మారకాన్ని కూడా ఏర్పాటుచేశారు. దీన్ని వాల్ ఆఫ్ రెసిస్టెన్స్‌గా పిలుస్తున్నారు.
ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు ఇక్కడకు వచ్చి నిరసన తెలియజేస్తున్నాయి. ఇక్కడ డజన్ల మంది మహిళలు నల్ల బట్టలు కట్టుకొని నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడి నిరసనల్లో పాలుపంచుకున్న క్రిస్టీ సువాంతక్ మాట్లాడుతూ.. మాకు ప్రభుత్వం లేదు. మా కోసం నిలబడి మాట్లాడేవారే లేరు. కాబట్టి ఇక్కడకు వచ్చి సంతాపం తెలియజేయడం తప్పా మరేమీ చేయలేం. మాకు న్యాయం కావాలి. మమ్మల్ని కాపాడండి. ఇదే మేం కోరుకుంటున్నాం అని అన్నారు. కుకీ మెజారిటీ గల ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలనా యంత్రాంగం ఏర్పాటు చేయాలనే డిమాండ్ నానాటికీ ఊపందుకుంటోంది. ఇండిజెనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ కన్వీనర్ మేరీ జోన్స్ మాట్లాడుతూ.. మాకు పూర్తి భిన్నమైన పరిపాలనా యంత్రాంగం కావాలి. కొత్త రాష్ట్రమైనా ఫర్వాలేదు. లేదా కేంద్ర పాలిత ప్రాంతంగానైనా ఏర్పాటుచేయొచ్చు. ఇక్కడి సమస్యకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందని మేం భావిస్తున్నాం అని అన్నారు.
ఈ హింసకు బాధ్యులు ఎవరు?
హింసకు మణిపుర్ ప్రభుత్వం, మెయితెయి తెగలే కారణమని ఇక్కడి ప్రజల్లో కొందరు భావిస్తున్నారు. ఈ విషయంపై మేరీ జోన్స్ మాట్లాడుతూ.. ప్రస్తుత మణిపుర్ ప్రభుత్వం మా కోసం పనిచేస్తుందని మేం అనుకోవడం లేదు. మమ్మల్ని చాలా దారుణంగా చూస్తున్నారు.. అసలు మా కోసం ఆ ప్రభుత్వం ఉందని మేం ఎలా అనుకోగలం. కావాలనే వారు మమ్నల్ని అణచివేస్తున్నారు అని ఆమె అన్నారు. మెయితెయి కమ్యూనిటీలో విలేజ్ డిఫెన్స్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నట్లే చురాచాంద్‌పుర్‌లోనూ కొందరు యువత చేతిలో ఆయుధాలు పట్టుకొని తిరగడం కనిపించింది.
రెండు నెలల కిందటితో పోలిస్తే, ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడినట్లు కనిపిస్తోంది. కానీ, ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇంఫాల్ లోయతో చురాచాంద్‌పుర్‌కు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇక్కడికి వస్తువులన్నీ మిజోరాం గుండా వస్తున్నాయి. ఇక్కడి ప్రజలు ఎంత కోపంతో ఉన్నారంటే చురాచాంద్‌పుర్ పేరును చాలా బోర్డులపై కొట్టేశారు. అక్కడ లంక అని రాసినట్లు కనిపిస్తోంది. తమపై మెయితెయి రాజు చురాచాంద్‌పుర్ అనే పేరును రుద్దేశారని వారు అంటున్నారు. మెయితెయిలకు సంబంధించిన ఎలాంటి పేర్లూ తమకు వద్దని చెబుతున్నారు.
ఎన్‌ఆర్‌సీ చేపట్టాలి
పర్వత ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేక పరిపాలనా యంత్రాంగాన్ని కోరుతుంటే.. మైదానాల్లో ప్రజలు మాత్రం ఎన్‌ఆర్‌సీని డిమాండ్ చేస్తున్నారు. పొరుగున్న మియన్మార్ నుంచి ఇక్కడకు వస్తున్న వారే ప్రస్తుత హింసకు ఆజ్యం పోస్తున్నారని మైదానాల్లో ప్రజలు చెబుతున్నారు. మణిపుర్‌లో అక్రమంగా స్థిరపడిన వారిని వెనక్కి పంపించేయాలని వారు కోరుతున్నారు. అయితే, అక్రమ వలసల ఆరోపణలను కుకీలు ఖండిస్తున్నారు. చురాచాంద్‌పుర్‌లో నిరసన తెలియజేస్తున్న హాత్నేయీనెంగ్ మాట్లాడుతూ.. వారు మమ్మల్ని భారతీయులుగా చూడటం లేదు. మమ్మల్ని వారు బయటి వ్యక్తులుగా భావిస్తున్నారు. అసలు వారు ఇలా ఎలా చేయగలరు? మేమేమీ మియన్మార్ నుంచి ఇక్కడికి రాలేదు. మేమూ ఇక్కడి ప్రజలమే. ఇక్కడే జీవిస్తున్నాం. మా పూర్వీకులు బ్రిటిష్‌వారిపై పోరాడారు. మేం ఇక్కడి ఆదివాసీలం. మమ్మల్ని అక్రమ వలసదారులని ఎలా అంటారు? అని ఆమె ప్రశ్నించారు.
మరోవైపు ఇక్కడి సమస్యకు అక్రమ వలసదారులే కారణమని సినిమాల కోసం పనిచేస్తున్న కల్చరాలిజిస్టు నాంగ్‌థోవుజా లాంచా అన్నారు. అక్రమ వలసదారులను మొదట గుర్తించాలి. ఈ సమస్యను పరిష్కారం చూపకపోతే.. మళ్లీ మళ్లీ ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉంటాయి అని లాంచా అన్నారు. హింస మళ్లీ మళ్లీ ఇక్కడ చెలరేగుతూ ఉండటంతో దీనికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందనే ప్రశ్న ఎదురవుతోంది. మొదట ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు అవసరం. రెండు వర్గాల్లోనూ ఒకరిపై ఒకరిని నమ్మకం లేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శ్రద్ధ చూపడం లేదు అని లాంచా అన్నారు.
కాలిపోయిన ఇళ్లు.. వదిలేసిన గ్రామాలు..
గత రెండు నెలలుగా చోటుచేసుకున్న హింస వల్ల వేల మంది ప్రజలు తమ సొంత ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అలా హింసతో ప్రభావితమైన సుంగు గ్రామాన్ని మేం సందర్శించాం. అక్కడి కొందరు మహిళలు వాహనాలను పరిశీలిస్తూ కనిపించారు. వారిలో ఒకరైన నోరం సుమిత బీబీసీతో మాట్లాడారు. ఎవరైనా తుపాకులను తీసుకొస్తున్నారేమోనని పరిశీలించేందుకు మేం వాహనాలను తనిఖీ చేస్తున్నాం. ఎందుకంటే మా గ్రామం భద్రత మాకు ముఖ్యం అని ఆమె అన్నారు.
ఈ మహిళలు మెయితెయి వర్గానికి చెందిన వారు. కుకీలు తమపై దాడిచేస్తారని వీరు భయపడుతున్నారు. ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఇలాంటి చెక్‌పోస్టులు చాలా కనిపించాయి. సుంగులో ఒకప్పుడు మెయితెయి, కుకీ ప్రజలు కలిసి జీవించేవారు. మే 3వ తేదీ ఉద్రిక్తతల తర్వాత ఇక్కడి రెండు వర్గాల మధ్య శాంతి ఒప్పందం కూడా జరిగింది. అయితే, 24 రోజుల తర్వాత మే 28న మళ్లీ ఇక్కడ హింస చెలరేగింది. ఈ హింస వల్ల వేల మంది తమ ఇళ్లను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక్కడ మిగిలిన ప్రజలు కూడా భయం నీడన జీవిస్తున్నారు.
ఇక్కడి నుంచి వెళ్లిపోయిన వారిలో మెయితెయిలతోపాటు కుకీలు కూడా ఉన్నారు. ఇక్కడి జనాభా ఏడు వేల వరకూ ఉండేది. కానీ, ప్రస్తుతం ఇది వెయ్యికి తగ్గిపోయింది. ఇక్కడ కుకీలు జీవించే ప్రాంతాల నుంచి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సుంగు దగ్గర గస్తీ కాస్తున్న భద్రతా బలగాలు చెప్పాయి. సుంగులో కొంతమంది మాతో మాట్లాడారు. కానీ, వారు తమ పేర్లను వెల్లడించడానికి ఇష్టపడలేదు. ఇక్కడ అందరూ భయపడుతున్నారు. మా గ్రామాన్ని మేం కాపాడుకోవాలి. మా కుటుంబాన్ని మేం కాపాడుకోవాలి అని అన్నారు.
ఇక్కడ సుంగు లాంటి చాలా ప్రాంతాల్లో గ్రామస్థుల కంటే భద్రతా బలగాల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో స్థానికులే ఆయుధాలు పట్టుకొని గస్తీ కాస్తున్నారు. ఇక్కడి హింసపై దర్యాప్తు చేపట్టేందుకు ఒక జ్యుడీషియల్ కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పటుచేసింది. మరోవైపు సీబీఐ కూడా హింసపై దర్యాప్తు చేపడుతోంది. పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతోందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ, రోజూ ఇక్కడ చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు రెండు వర్గాల మధ్య దెబ్బతిన్న సంబంధాలకు అద్దం పడుతున్నాయి.