శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 28 మే 2020 (20:25 IST)

భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?

అమెరికా-చైనా .. గత కొన్నేళ్లుగా ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య సంబంధాల ఎలా ఉంటున్నాయో ప్రపంచం మొత్తానికి తెలుసు. తాజాగా కరోనావైరస్ మహమ్మారి కారణంగా అవి మరింత దిగజారాయి. అదే సమయంలో ఇటు భారత్-చైనా దేశాల మధ్య కూడా ఎప్పటికప్పుడు అనేక వివాదాలు తలెత్తుతునే ఉన్నాయి.

 
ఏప్రిల్ నెలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నియమ నిబంధనలను మార్చడం ద్వారా చైనాను తీవ్రంగా దెబ్బకొట్టింది భారత్. కోవిడ్-19 సంక్షోభం కారణంగా భారత్‌లో దెబ్బతిన్న చిన్న చిన్న కంపెనీలను చైనా ఎక్కడ టేకోవర్ చేస్తుందేమోనన్న భయంతో భారత్ ఈ పని చేసింది. ఓ వైపు కరోనా దేశంలో విజృంభిస్తున్న సమయంలోనే చైనాకు చెందిన ఓ బ్యాంక్ ఓ భారతీయ కంపెనీలో 1.01శాతం వాటాను కొనడం భారత్ ఆందోళనను మరింత పెంచింది. దీనిపై ఏప్రిల్ 12న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

 
దీంతో కొద్ది రోజుల తర్వాత భారత్‌లో ఎటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులైనా ఆటోమేటిగ్గా వచ్చేందుకు వీలు లేదని, భారత ప్రభుత్వం అనుమతి తప్పని సరి అని కేంద్రం ప్రకటించింది. ఈ దిశగా కొత్త నియమాలను రూపొందించింది. ఆ ప్రకారం దేశంలో విదేశీ వ్యక్తులు ఎటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా లేదా ఏదైనా సంస్థలో పెట్టుబడులు పెట్టాలన్నా తప్పని సరిగా కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందాలి. గతంలో ఈ నిబంధనలు కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇది సాధారణ పెట్టుబడుల నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.

 
కరోనా పుట్టుకపై విచారణకు అనుకూలంగా ఓటేసిన భారత్
కరోనావైరస్ విషయంలో అటు అమెరికా-ఇటు చైనాల మధ్య గత కొద్ది నెలలుగా వివాదం నెలకొంది. కరోనావైరస్ ఎక్కడ పుట్టింది? మానవుల్లోకి ఎలా ప్రవేశించింది? తదితర అంశాలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ డబ్ల్యూహెచ్ఓకి చెందిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో వివిధ దేశాలు ప్రవేశ పెట్టిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటేసింది.

 
తైవాన్ అధ్యక్షురాలి ప్రమాణ స్వీకారానికి భారత్ ఎంపీల హాజరు
ఈ వివాదం ఇలా ఉండగానే తైవాన్ అధ్యక్షురాలిగా రెండోసారి పదవీ చేపట్టిన త్సాయి ఇంగ్ వెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరపున ఇద్దరు బీజేపీ ఎంపీలు మీనాక్షీ లేఖీ, రాహుల్ కశ్వన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. భారత ప్రభుత్వం తరపున ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

 
ఈ చర్య ద్వారా ఓ రకంగా చైనాకు ఒక బలమైన సందేశాన్ని మోదీ ప్రభుత్వం పంపించినట్టయ్యిందని నిపుణులు భావిస్తున్నారు. నిజానికి తైవాన్‌ను ఒక సార్వభౌమాధికారం కల్గిన దేశంగా చైనా ఇప్పటికీ గుర్తించలేదు. తామెన్నటికీ చైనాలో భాగం కాదని వరుసగా రెండోసారి అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన సాయింగ్-వెన్ పదే పదే చెబుతూ ఉంటారు. దీంతో ఆమె వ్యవహారశైలిపై చైనా గుర్రుగా ఉంది. తైవాన్ తమ దేశంలో భాగమే అని చెబుతుంది చైనా. అవసరం అనుకుంటే బల ప్రయోగం ద్వారా ఆ దేశాన్ని ఆక్రమించగలమని చెబుతూ ఉంటుంది.

 
ఈ చర్యల ద్వారా చైనాకు భారత్ అసలు ఏం చెప్పదల్చుకుంటోంది?
చైనా పట్ల తాము ఏ మాత్రం సంతోషంగా లేమన్న విషయాన్ని భారత్ చెప్పదల్చుకున్నట్లు కనిపిస్తోందని లండన్‌లోని సిటీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు అతుల్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. "నేపాల్ తదితర దేశాలపై చైనా తన ప్రభావాన్ని చూపడం తగ్గించుకోవాలని భారత్ కోరుకుంటోంది. లేదంటే తైవాన్ వంటి తదితర ప్రాంతాలపై తాము కూడా తమ ప్రాబల్యాన్ని పెంచుకోగలమన్న సందేశాన్ని ఈ చర్యల ద్వారా ఇస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

 
సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు
భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. తూర్పు లద్దాఖ్ సహా లైన్ ఆఫ్ కంట్రోల్‌లోని పలు వివాదాస్పద ప్రాంతాల్లో రెండు దేశాలు తమ బలగాలను భారీ ఎత్తున పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. 2017లో తలెత్తిన డోక్లం వివాదం తర్వాత మళ్లీ సరిహద్దుల్లో ఈ స్థాయిలో బలగాలను మొహరించడం ఇదే తొలిసారి.

 
ఇప్పటికే ఆ ప్రాంతానికి చైనా 2 వేల నుంచి 2,500 మంది బలగాలను తరలించిందని భారత మిలటరీకి చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఆ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలను కూడా చేపడుతోందని ఆయన తెలిపారు. అటు చైనా కూడా ఇదే తరహా ఆరోపణలు చేసింది. గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్ అనధికారిక నిర్మాణాలను చేపడుతోందని చైనా ఆరోపించింది.

 
అయితే చైనా ఆరోపణల్ని గత వారంలో భారత విదేశాంగ శాఖ ఖండించింది. తాము సరిహద్దు నియమాలకు లోబడి గస్తీ కాస్తుంటే పదే పదే చైనా బలగాలు అడ్డొస్తున్నాయని ఆరోపించింది. భారత్ సరిహద్దుల్లోని దుందుడుకు చర్యల కారణంగానే రెండు దేశాల బలగాల మధ్య ఘర్షణ జరిగిందన్న చైనా ఆరోపణల్ని కూడా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఖండించారు.

 
మరోవైపు తాజా ఉద్రిక్త పరిస్థితులపై చర్చించేందుకు భారత రక్షణ శాఖ రాజ్ నాథ్ సింగ్ మంగళవారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ సహా త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. ప్రస్తుతం చైనా వ్యవహరిస్తున్న తీరును రాజ్ నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ వివరించారు.

 
రెండు దేశాల మధ్య ఒత్తిళ్లు ఎందుకు పెరుగుతున్నాయి?
ఓ వైపు ప్రపంచమంతా కోవిడ్-19 సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి కారణాలేంటి? ప్రస్తుతం చైనాపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. ముఖ్యంగా అమెరికా... ఎప్పుడైతే అమెరికా పదే పదే ఒత్తిడి చేస్తోందో దాని మిత్ర దేశాలు కూడా చైనాపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తాయి. అందరూ కలిసి ఒకేసారి ఒత్తిడి తీసుకొస్తే పరిణమాలు వేరుగా ఉంటాయి.

 
వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికాకు భారత్ చాలా ముఖ్యమైన దేశం. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయంగా సంఘీభావాన్ని పొందేందుకు భారత్ చైనాపై ఒత్తిడి పెంచుతూ ఉండవచ్చని భరద్వాజ అభిప్రాయపడ్డారు. "అది తైవాన్ విషయంలో కావచ్చు లేదా కోవిడ్-19 విషయంలో కావచ్చు చైనా అన్ని వైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. ఇటీవల హాంకాంగ్‌లో తలెత్తిన పరిణామాల నేపథ్యంలోనూ చైనాపై ఒత్తిడి పెరుగుతోంది" అని ఆయన అన్నారు.

 
అయితే ఈ విషయంలో భారత్ ముందు రెండు మార్గాలున్నాయని అతుల్ భరద్వాజ్ అంటున్నారు. ఒకటి అంతర్జాతీయ సంఘీభావం కాగా రెండోది ద్వైపాక్షికం అంటే, భారత్‌, చైనా దేశాలకు మాత్రమే పరిమితమైన వ్యవహారం. ద్వైపాక్షికమైతే, సరిహద్దు వివాదాలు పరిష్కారమవ్వాలని భారత్ కోరుకుంటుంది. కానీ, దీని వల్ల చైనా ఏమైనా ఒత్తిడికి గురవుతుందా?

 
‘‘అంతర్జాతీయ స్థాయిలో కలిసికట్టుగా చైనాపై ఒత్తిడి తెస్తే, దాని ప్రభావం మరోలా ఉంటుంది. ద్వైపాక్షిక స్థాయిలో వ్యవహరిస్తే ఓ ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటవుతుంది’’ అని అతుల్ భరద్వాజ్ బదులిచ్చారు. మొత్తంగా రెండు దేశాల మధ్య ఒత్తిళ్లు మరింత పెరగాలన్నా లేదా తగ్గాలన్నా అది చైనా పట్ల భారత్ వ్యవహరించే తీరుపైనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.