శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (09:21 IST)

పీఎఫ్ వడ్డీరేటు తగ్గే అవకాశాలు..

ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) వడ్డీరేటు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను పీఎఫ్‌ వడ్డీరేటును నిర్ణయించడానికి వచ్చే నెల 4న శ్రీనగర్‌లో ఈపీఎఫ్‌వో కేంద్ర బోర్డు ట్రస్టీల సమావేశం జరుగబోతుంది. ఈ సందర్భంగా వడ్డీరేటుకు కోత పెట్టే వీలుందని సమాచారం. 
 
గతేడాది మార్చిలో జరిగిన సమావేశంలో వడ్డీరేటును 0.15 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో గత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను పీఎఫ్‌ వడ్డీరేటు ఏడేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 8.5 శాతంగానే ఉంది. 
 
2018-19లో ఇది 8.65 శాతంగా ఉండగా, ఇప్పుడు మరోసారి కోతకు ఆస్కారం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో చాలామంది విరాళాలు తగ్గిపోయాయి. మరోవైపు పీఎఫ్‌ సొమ్ము ఉపసంహరణలూ పెరిగిపోయాయి. 
 
ఈ క్రమంలో వడ్డీరేట్ల కోతకు ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు. 'మార్చి 4న శ్రీనగర్‌లో కేంద్ర బోర్డు ట్రస్టీల సమావేశం జరుగనుంది. త్వరలోనే ఎజెండా ప్రకటిస్తాం' అని ఈపీఎఫ్‌వో ట్రస్టీ కేఈ రఘునాథన్‌ తెలిపారు.
 
అయితే వడ్డీరేటుపై ఆయన ప్రస్తావించకపోయినా.. ఏటా ఆర్థిక సంవత్సరం ముగింపులోనే వడ్డీరేట్ల సవరణలు జరుగుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపుల తర్వాతే ట్రస్టీల సమావేశం అవుతుంది. దీంతో వడ్డీరేట్లపై ఓ నిర్ణయం తప్పక ఉండే అవకాశాలున్నాయి. 2015-16లో గరిష్ఠంగా 8.8 శాతం వడ్డీరేటు ప్రకటించారు.