మారటోరియంలో వడ్డీ: రుణగ్రహీతలకు భారం పడనివిధంగా పరిష్కారం?
కరోనా మూలంగా మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయరాదని దాఖలైన పిటిషన్‌పై కేంద్రప్రభుత్వం, ఆర్‌బీఐ, బ్యాంకులకు రెండు వారాల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. కరోనా వైరస్ నేపథ్యంలో మారటోరియం విధించిన సమయంలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకులు చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.
రుణగ్రహీతలపై భారం పడకుండా రెండు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్‌బీఐ ఓ నిర్ధిష్ట విధానంతో రావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసును మరోసారి వాయిదా వేసేందుకు నిరాకరించి రెండు వారాల్లోగా రుణగ్రహీతలకు భారం పడనివిధంగా పరిష్కారంతో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.
రుణగ్రహీతలకు ఊరట ఇచ్చేలా బ్యాంకులతో ఉన్నతస్ధాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయని కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియ జేసింది.సెప్టెంబర్ చివరివారంలో కేసు విచారణ తిరిగి ప్రారంభమయ్యేవరకూ ఆయా ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా పరిగణించరాదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
అయితే మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ మాఫీ చేస్తే అది బ్యాంకింగ్ వ్యవస్థను బలహీనపరుస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయి. “కరోనా” వైరస్ నేపథ్యంలో రుణాల చెల్లింపుపై ఈ ఏడాది మార్చిలో మూడు నెలల మారటోరియం ప్రకటించి, తర్వాత ఆగస్ట్ 31 వరకూ రిజర్వ్ బ్యాంక్ పొడిగించింది.