శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (08:59 IST)

23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు - జారీ కానీ హాల్‌టిక్కెట్లు

జాతీయ ఉమ్మడి పరీక్ష (జేఈఈ) మెయిన్స్ ప్రవేశపరీక్షలు ఈ నెల 23 నుంచి 29వ తేదీల మధ్య జరుగనున్నాయి. ఈ ప్రవేశ పరీక్షల సమయం సమీపిస్తున్నప్పటికీ జాతీయ పరీక్షల నిర్వహణ (ఎన్.టి.ఏ) సంస్థ మాత్రం సోమవారం ఉదయం వరకు హాల్ టిక్కెట్లను జారీ చేయలేదు. నిజానికి ఏ ప్రవేశ పరీక్షకు అయినా వారం పది రోజుల ముందు హాల్ టిక్కెట్లను జారీచేయడం ఆనవాయితీ. కానీ, ఎన్.టి.ఏ. సంస్థ తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. 
 
దేశవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. అయినా సోమవారం ఉదయం వరకు ఈ సంస్థ హాల్‌టికెట్లు జారీ చేయలేదు. మూడు రోజుల క్రితం విద్యార్థులకు ఏ నగరం కేటాయించారో వెల్లడించినా.. పరీక్షా కేంద్రం ఏదన్నది ఇంకా తెలపలేదు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 
 
తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది ఈ పరీక్ష రాయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌టీఏను నెలకొల్పిన నాటి నుంచి పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు, ఫలితాల వెల్లడిలో విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రాలను సంప్రదించకుండా కొన్ని నెలల క్రితం జేఈఈ మెయిన్‌ తేదీలను ప్రకటించిన ఈ సంస్థ.. తర్వాత కొత్త కాలపట్టికను ప్రకటించి విమర్శల పాలైంది. 
 
ఆ సంస్థ తీరుతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహించే ఐఐటీలు కూడా పరీక్షల తేదీలను మార్చాల్చి వచ్చింది. జూన్‌ 21 నుంచి జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు మొదలవుతాయని గతంలో ప్రకటించిన ఎన్‌టీఏ.. మూడు రోజుల క్రితం ఈ నెల 23 నుంచి నిర్వహిస్తామని వెల్లడించింది. పక్కా ప్రణాళిక లేకపోవడం, రాష్ట్రాలను సంప్రదించకపోవడమే తప్పిదాలకు ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.