శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 మే 2020 (18:23 IST)

కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన చైనా.. భారత సంతతి కోతులపై ప్రయోగం!!

కరోనా వైరస్‌కు జన్మస్థావరమైన చైనాలో ఈ వైరస్‌కు విరుగుడు లభించింది. చైనా వివిధ రకాలుగా జరిపిన ప్రయోగాల ఫలితంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌ను తొలుత కోతులపై ప్రయోగించగా, అవి మంచి ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది. 
 
చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ పురుడు పోసుకున్న విషయం తెల్సిందే. గత యేడాది డిసెంబరు నెలలో తొలి కరోనా కేసు చైనాలో నమోదైంది. ఆ తర్వాత ఈ వైరస్ మెల్లగా వ్యాపించి, దాదాపు 210 దేశాలను కుదిపేసింది. ఈ వైరస్ లక్షలాది మందికి సోకింది. అలాగే, ఈ వైరస్ బారినపడినవారిలో ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 2.83 లక్షల మంది చనిపోయారు. 
 
అత్యంత ప్రాణాంతకంగా మారిన ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ రంగంలోకి దిగి తగిన వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధలు జరుపుతున్నాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్‌లతో పాటు.. ఇజ్రాయేల్, భారత్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల శాస్త్రవేత్తలు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా పురుడు పోసుకున్న చైనాలో దీనికి విరుగుడు కనిపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. బీజింగ్ కేంద్రంగా పని చేసే సినోవాక్ బయోటిక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయగా, దీన్ని భారత సంతతికి చెందిన కోతులపై ప్రయోగించారు. సార్స్ కో-2 పేరుతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ను కోతిపై ప్రయోగించగా దీని ఫలితం మరో రెండువారాల తర్వాత తెలియనుంది.