శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (16:32 IST)

మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీలకు కరోనా పాజిటివ్

Mallikarjun Kharge-Veerappa Moily
సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా వదిలిపెట్టట్లేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వైరస్ బాధితుల జాబితాలో చేరిపోయారు. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌‌లో ఉన్నారని ఢిల్లీలోని ఖర్గే ఆఫీస్‌ పేర్కొంది. కోవిడ్‌ బారిన పడిన మల్లికార్జున ఖర్గే  గత రెండు రోజుల పాటు తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 
 
ఇప్పటికే ఆయన రెండు డోసుల టీకా తీసుకున్నారని, అయితే ప్రికాషన్‌ డోస్‌ తీసుకునేందుకు ఇంకా అర్హులు కాలేదని తెలిపింది. అంతేగాకుండా ఢిల్లీలోని ఖర్గే ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 
 
కాగా.. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ‘మేకెదాటు’ పాదయాత్రలో ఖర్గే పాల్గొన్నారు. కావేరి నదికి అడ్డంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ మొత్తం 10 రోజుల పాటు ఆ యాత్ర కొనసాగింది. 
 
ఇందులో ఖర్గేతో సహా మరో కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఈ లాంగ్ మార్చ్‌లో పాల్గొన్న మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం, ఎమ్మెల్యే ఎన్ హెచ్ శివశంకరరెడ్డి వైరస్‌ బారిన పడ్డారు.