శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: మంగళవారం, 25 మే 2021 (20:09 IST)

corona: 2 లక్షల దిగువకు కొత్త కేసులు, 4 వేలకు దిగువకు మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి నిలకడగా తగ్గుముఖం పడుతోంది. చాలా రోజుల అనంతరం తాజాగా కొత్త కేసులు రెండు లక్షల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. క్రితంరోజు నాలుగు వేలకు పైగా మరణాలు నమోదు కాగా.. తాజాగా ఆ మార్కుకు దిగువన నమోదయ్యాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
 
సోమవారం 20,85,112 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,96,427మందికి పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 14 తర్వాత ఆ స్థాయిలో తగ్గుదల కనిపించడం ఇదే మొదటిసారి. ఇక 24 గంటల వ్యవధిలో 3,511 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 2,69,48,874కి చేరగా..3,07,231 మంది ప్రాణాలు వదిలారు.
 
ఇక క్రియాశీల కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 25,86,782 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 10.17 శాతానికి చేరింది. నిన్న 3,26,850 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.4 కోట్లకు పైబడ్డాయి. రికవరీ రేటు 88.69 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు నిన్న 24,30,236 మందికి కేంద్రం టీకాలు అందించింది. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 19,85,38,999కి చేరింది..