బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 మే 2021 (14:22 IST)

కరోనా మూడో దశలో పిల్లలపై ప్రభావం

కరోనా మూడో దశలో పిల్లలపై ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అయితే సెకండ్ వేవ్‌ చిన్నారులపై పంజా విసురుతోంది. ఏప్రిల్‌, మే నెలల్లో కొవిడ్‌ ఇబ్బందులతో 1-12 ఏళ్లలోపు పిల్లలు 274 మంది గాంధీ ఆసుపత్రిలో చేరారు. మరో నలుగురు నవజాత శిశువులు సైతం వైరస్ బారిన పడ్డారు.

కరోనా నుంచి కోలుకున్నాక చిన్నారుల్లో ఎంఐఎస్‌ (మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌) లక్షణాలు నెమ్మదిగా బయట పడుతున్నాయి. ఇప్పటికే గాంధీలో ఇద్దరు చిన్నారులు ఆయా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిలోఫర్‌లోనూ అయిదుగురు నవజాత శిశువుల్లో ఎంఐఎస్‌ లక్షణాలు కన్పించినట్లు వైద్యులు తెలిపారు. అయితే పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
 
తొలి, రెండో విడతల్లో ఇప్పటివరకు పిల్లలపై కరోనా అంతగా ప్రభావం చూపకపోవడం పెద్ద ఊరట కలిగించిందన్నారు గాంధీ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ సుచిత్ర. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంఐఎస్‌ పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె సూచిస్తున్నారు.

పిల్లల్లో జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలే ఉండి, ఇతర ఆరోగ సమస్యలేమీ లేకపోతే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలి. ఆయాసం, వేగంగా శ్వాస తీసుకోవాల్సి రావడం, ఆహారం సరిగ్గా తినలేకపోవడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే ఆసుపత్రిలో చేర్పించాలని డాక్టర్ పేర్కొన్నారు. కొందరు పిల్లల్లో కరోనా వచ్చి తగ్గాక 6-8 వారాల తర్వాత ఎంఐఎస్‌ కన్పిస్తోంది. తొలి విడతలో ఎక్కువ మంది పిల్లలు ఈ సమస్యతో నిలోఫర్‌, గాంధీలో చేరారు. ప్రస్తుతం అలా వస్తున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది.
 
పిల్లల్లో ఎంఐఎస్‌ లక్షణాలు:
* తీవ్రమైన కడుపు నొప్పి
* కాళ్లు, పొట్ట ఉబ్బరం
* విరేచనాలు, వాంతులు
విరేచనాలు, వాంతులు
* జ్వరం 8 రోజులకంటే ఎక్కువ ఉండటం
* నాలుక గులాబి రంగులోకి మారటం
* వేళ్ల సందులు, చేతి కింద నుంచి పొట్టులా రాలడం
కరోనా తొలి దశలో కొవిడ్‌తో గాంధీలో 700 మంది చిన్నారులు చేరగా.. 58 మందిలో ఎంఐఎస్‌ సమస్య బయటపడింది. ఒకరిద్దరు తప్ప..అంతా కోలుకున్నారు. రెండో వేవ్‌లో ఉద్ధృతి కారణంగా పిల్లల్లో ఈసారి ఎంఐఎస్‌ ముప్పు పెరగవచ్చని వైద్యులు అంటున్నారు.

దీంతో చిన్నారుల కోసం అవసరమైన వైద్య సదుపాయాల పట్ల వైద్యులు దృష్టి సారించారు. గాంధీలో చిన్నారుల కోసం 120, నవజాత శిశువులకు మరో 40 పడకలు ఉన్నాయి. ప్రస్తుతం 30 వెంటిలేటర్‌ పడకలు సిద్ధం చేశారు. పది మంది పిల్లల వైద్యులు, 21 మంది పీజీలు సేవలందిస్తారు. రోగుల సంఖ్య పెరిగితే వెంటిలేటర్లతో పాటు వైద్యులు, సిబ్బంది సంఖ్య సరిపోదని చెబుతున్నారు. అదనపు వెంటిలేటర్లు, హెచ్‌ఎస్‌ఎన్‌వో మాస్క్‌ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అత్యవసరంగా వీటిని సమకూర్చాల్సి ఉంది.