శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (15:45 IST)

ఊపిరితిత్తులే టార్గెట్‌గా కరోనా వైరస్ దాడి.. హెచ్చరిస్తున్న వైద్యులు...

దేశ ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్.. మనిషిలోని అంతర్గత అవయవాలైన ఊపిరితిత్తులే లక్ష్యంగా దాడి చేస్తోంది. ఇటీవల కాలంలో కరోనా బారినపడుతున్న వారికి వైద్యులు సీటీ స్కాన్ పరీక్షలు సిఫారసు చేస్తున్నారు. రోగుల ఊపిరితిత్తులు అత్యధిక మొత్తంలో ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు ఆ సీటీ స్కాన్‌ల ద్వారా వెల్లడైంది. 
 
దాదాపు ఊపిరితిత్తుల్లో 50 శాతం భాగం కరోనా వైరస్ ప్రభావానికి గురవడమేకాదు, వారిలో ఆక్సిజన్ స్థాయులు 85కి పడిపోయేలా చేస్తోంది. ఇదంతా ఒక్కరోజులోనే జరిగిపోతోందని వైద్య నిపుణులు కరోనా సెకండ్ వేవ్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఆరంభంలోనే సీటీ స్కాన్ తీయించుకోవడం వల్ల అనేకమంది కరోనా రోగులు ప్రాణాలు కాపాడేందుకు వీలవుతోందని వైద్యులు చెబుతున్నారు. గతేడాది సీటీ స్కాన్ తీయించుకున్న కరోనా రోగుల హెచ్ఆర్ సీటీ స్కోరు 25 పాయింట్లకు 6 నుంచి 8 పాయింట్ల వరకు నమోదైతే, సెకండ్ వేవ్ లో అది 12 నుంచి 14 వరకు నమోదవుతోందని నిపుణులు వెల్లడించారు. 
 
ఈ తరహా లక్షణాలు గతంలో వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తే, సెకండ్ వేవ్‌లో యువత కూడా కరోనా కారణంగా తీవ్ర స్థాయిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు గురవుతోందని తెలిపారు.
 
కాగా, దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా వ్యాపిస్తున్న విషయం తెల్సిందే. తొలి దశను మించిపోయేలా లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలతో భీతావహ పరిస్థితులను సృష్టిస్తోంది. 
 
సెకండ్ వేవ్‌లో కరోనాతో ఆసుపత్రి పాలైన వారికి ఆక్సిజన్ అందించాల్సి రావడం తప్పనిసరిగా మారింది. దాంతో దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీనికంతటికీ కారణం సెకండ్ వేవ్‌లో రూపాంతరం చెందిన కరోనా మహమ్మారి మానవ ఊపిరితిత్తులనే లక్ష్యంగా దాడి చేస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.