ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (19:15 IST)

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు - నైట్ కర్ఫ్యూ పొడగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6123 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడి ఐదుగురు చనిపోయారు. అలాగే, 10795మంది కోలుకున్నారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,930 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903, గుంటూరులో 830, తూర్పుగోదావరిలో 731, కర్నూలులో 679 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి. 
 
నైట్ కర్ఫ్యూ పొడగింపు... 
ఏపీలో ఫిబ్రవరి 14వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఏపీలో రోజువారీ కరోనా కేసులు 10 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. కేసుల సంఖ్య అధికంగా ఉన్న తీవ్రత అంతగా లేదని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 
 
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి నైట్ కర్ఫ్యూ పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో జనవరి 18 నుంచి 31వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. 
 
తాజాగా ఈ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్‌ వేదికల్లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. 
 
వాణిజ్య సముదాయాలు, దుకాణాల్లో కోవిడ్‌ నిబంధనల ఉల్లంఘన జరిగితే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలుచేయాలని, సీటు విడిచి సీటు మార్కింగ్ చేయాలని ఆదేశించింది. ఆర్టీసీతో సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశించింది.