బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 మే 2021 (11:39 IST)

ఆనందయ్య శిష్యుడికి కరోనా పాజిటివ్.. మరో ఇద్దరికి కూడా..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య నాటు మందు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయిలో ఈ మందుపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఆనందయ్య బృందంలో వాలంటీర్‌గా పనిచేస్తోన్న ఓ యువకునికి కరోనా సోకింది. ఆ యువకుడి ద్వారా భార్య, కుమారుడుకి పాజిటివ్‌ వచ్చింది. 
 
శనివారం గ్రామంలో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించగా ఇది బయటపడింది. దీంతో ఒక్కసారిగా కృష్ణపట్నం ఉలిక్కిపడింది. ఆనందయ్య మందు కరోనాను తగ్గిస్తోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన టీమ్‌లోని వ్యక్తికి కరోనా రావడం చర్చనీయాంశమైంది. 
 
సుమారు 15 రోజుల నుంచి గ్రామంలోని కొందరు యువకులు, మహిళలు ఆనందయ్య టీమ్‌లో వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. ఆకులు, మూలికలు తీసుకురావడం, ఆకులు వలవడం, పొయ్యి మీద కాయడం వంటి పనులు చేస్తున్నారు. 
 
తొలుత కృష్ణపట్నం గ్రామం మొత్తం మందు పంపిణీ చేశారని, ఒక్కరూ కరోనా బాధితులు లేరని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల మెడికల్‌ ఆఫీసర్‌ గ్రామంలో 14 పాజిటివ్‌ కేసులు ఉన్నాయని మీడియాకు తెలిపారు. 
 
శనివారం గ్రామంలో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆనందయ్య టీమ్‌లో 15 రోజుల నుంచి పనిచేస్తోన్న కృష్ణపట్నం గ్రామంలోని కరణం వీధికి చెందిన కరణం సునీల్‌కు కరోనా నిర్ధారణ అయింది. ఆయన భార్య కరణం సాయి రమ్య, వారి మూడు సంవత్సరాల కుమారుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. సునీల్‌ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.