బెంగళూరులో 543 మంది పిల్లలకు కరోనా పాజిటివ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతుంది. ఆగస్ట్ 1 నుంచి 11 వరకు 0-19 ఏండ్ల వయసు పిల్లల్లో 543 మందికి కరోనా సోకింది. 0-9 ఏండ్ల చిన్నారుల్లో 88 మందికి, 10-19 ఏండ్ల పిల్లల్లో 305 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు గ్రేటర్ బెంగళూరు నగర పాలక అధికారులు తెలిపారు.
499 కొత్త కేసుల్లో 263 కేసులు గత ఐదు రోజుల్లో నమోదయ్యాయని చెప్పారు. ఇందులో 88 కేసులు 9 ఏండ్లలోపు చిన్నారులు కాగా, 175 కేసులు 10-19 ఏండ్ల పిల్లలని వివరించారు. అయితే చాలా మంది పిల్లల్లో కరోనా లక్షణాలు లేకపోవడం లేదా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఎలాంటి మరణాలు నమోదు కాలేదని చెప్పారు.
పిల్లల్లో కరోనా పరిస్థితి ప్రస్తుతం సాధారణంగానే ఉన్నప్పటికీ ప్రమాదకరంగా మారవచ్చని బెంగళూరు ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. రానున్న రోజుల్లో చిన్నారుల కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు కరోనా టీకా వేయించుకోవాలని, రద్దీ ప్రాంతాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఇలాంటి పరిస్థితుల్లో 9-12 తరగతుల విద్యార్థులకు స్కూళ్లు తెరిచేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధం కావడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.