సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (22:50 IST)

ఏపీలో కరోనా విజృంభణ - గాలి జనార్ధన్ రెడ్డికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో మరోసారి 10 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో 88 మంది మృత్యువాత పడగా, 10,603 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 
 
నెల్లూరు జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 12, కడప జిల్లాలో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. ఇతర జిల్లాల్లోనూ కరోనా మహమ్మారి మృత్యుఘోష వినిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,884కి పెరిగింది.
 
తాజాగా 9,067 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య3,21,754కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,24,767 కాగా, ఇంకా 99,129 మంది చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు, కర్నాటక మైనింగ్ కింగ్, ఆ రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు వెల్లడైంది. ఓబుళాపురం మైనింగ్ స్కాంలో గత ఐదేళ్లుగా గాలి కండిషనల్ బెయిల్‌పై బయట ఉన్నారు.
 
కాగా, ఇటీవల కర్ణాటక ఆరోగ్యమంత్రి బి.శ్రీరాములుకు మాతృవియోగం కలిగింది. తన సన్నిహితుడైన శ్రీరాములు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకుగాను... గాలి సుప్రీంకోర్టును అభ్యర్థించి బళ్లారి వెళ్లేందుకు రెండ్రోజుల ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. 
 
అయితే, తనకు కరోనా సోకిందని, బళ్లారి వెళ్లలేకపోతున్నానని గాలి సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా, కరోనా లక్షణాలు పెద్దగా కనిపించకపోవడంతో ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇదిలావుండగా, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కొంత తగ్గుముఖం పట్టగా.. తాజాగా ఆదివారం 2,024 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆగస్టులో ఇవే అత్యధికమని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 22 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 4,426కి చేరింది. 
 
ఈ నెల 29న ఢిల్లీలో 1,954 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 6,881 ఆర్టీపీసీఆర్‌, సీబీనాట్‌, ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహించగా, 13,555 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికీ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,73,730కు చేరగా.. 1,54,171 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 14,793 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో కంటైనింగ్‌ జోన్ల సంఖ్య 820 ఉన్నట్లు వివరించింది.