మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 39,742 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా శనివారం 535 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,71,901 కి చేరగా.. మరణాల సంఖ్య 4,20,551కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
 
మరోవైపు, శనివారం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నుంచి 39,972 మంది కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,05,43,138కి చేరింది. 
 
ప్రస్తుతం దేశంలో 4,08,212 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో కరోనా పాజిటివ్ రేటు 1.30 శాతం ఉండగా.. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది. మరణాల రేటు 1.34 శాతంగా ఉంది.