అమెరికాలో కరోనా విశ్వరూపం.. ఒకే రోజు 91,295 కేసులు
వచ్చే నెలలో శ్వేతసౌధం పీఠానికి ఎన్నికలు జరుగనున్నాయి. అంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధినేత ట్రంప్, ప్రత్యర్థి జో బైడెన్‌లు పోటీ చేస్తున్నారు. అయితే, అమెరికాలో శాంతించిందని భావించిన కరోనా మహమ్మారి ఒక్కసారిగా విశ్వరూపందాల్చింది. ఒకే రోజు ఏకంగా 91 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికా ప్రజలు వణికిపోతున్నారు.
నిజానికి కొన్ని రోజుల క్రితం వరకు కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉంది. అయితే, మరోసారి కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. గురువారం అమెరికాలో రికార్డు స్థాయిలో 91,295 కేసులు నమోదయ్యాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.
ఈ నెల 15 నుంచి అమెరికాలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 90 లక్షలు దాటిపోయింది. ఒక్కరోజులో అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో అమెరికా మరోసారి అగ్రస్థానానికి చేరింది.
కాగా, అమెురికా తర్వాత 80,88,851 కేసులతో భారత్ రెండో స్థానంలో ఉండగా, బ్రెజిల్ 54,96,400 కేసులతో మూడో స్థానంలో ఉంది. గురువారం బ్రెజిల్‌లో 26 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
అలాగే, రెండో వేవ్ మొదలైన ఫ్రాన్స్, యూకేల్లోనూ కరోనా విజృంభణ ఉద్ధృతంగా వుంది. నిన్న ఫ్రాన్స్ లో ఏకంగా 47,000 కేసులు నమోదుకాగా యూకేలో 23,000కి పైగా కేసులు నిర్ధారణ అయ్యాయి.