శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 20 అక్టోబరు 2023 (22:41 IST)

జంపా కూలగొట్టాడు, వార్నర్ చితక్కొట్టాడు, పాకిస్తాన్ చిత్తు

David Warner
పాకిస్తాన్ జట్టు లక్ష్య ఛేదనలో తీవ్ర ఒత్తిడికి లోనై పరాజయం పాలైంది. బ్యాంటింగులో వార్నర్ పాకిస్తాన్ బౌలర్లను చితక్కొడితే... పాకిస్తాన్ బ్యాట్సమన్ల కీలక వికెట్లను ఆసీస్ బౌలర్ జంపా కూలగొట్టాడు. మొత్తమ్మీద ఆసీస్ విధ్వంసకర ఇన్నింగ్స్ 367 పరుగులను అధిగమించడంలో పాకిస్తాన్ చేతులెత్తేసింది. మరో 27 బంతులు మిగిలి వుండగానే 305 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. దీనితో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
 
పాక్ ఓపెనర్లు షఫీక్ 64 పరుగులు, హక్ 70 పరుగులతో గట్టి పునాది వేసినా మిడిల్ ఆర్డర్ బ్యాట్సమన్లు విజయమనే పటిష్టమైన గోడను కట్టలేకపోయారు. ఫలితంగా పరాజయం పాలయ్యారు. బాబర్ 18 పరుగులు, రిజ్వాన్ 46 పరుగులు, షకీల్ 30 పరుగులు, ఇఫ్తికర్ 26 పరుగులు, నవాజ్ 14, ఉసమా 0, ఆఫ్రిది 10, హసన్ అలి 8 పరుగులు చేసారు.  
 
తగ్యేదేలే... వార్నర్ దంచుడు
క్రికెట్ ప్రపంచంలో డేవిడ్ వార్నర్ తెలియనివారు వుండరు. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో వార్నర్ చాలా చాలా పాపులర్. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా అలా రాగానే ఇలా బన్నీ పాటలకు స్టెప్పులు వేసి ఇన్ స్టాగ్రాంలో పెట్టేస్తుంటాడు. ఇప్పుడు అదే డేవిడ్ వార్నర్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా పాకిస్తాన్ బౌలర్లతో ఆట ఆడుకున్నాడు. బంతులు వేయాలంటే పాక్ బౌలర్లు గజగజ వణికిపోయే స్థితికి తెచ్చాడు.
 
దొరికిన బంతిని దొరికినట్లు ఒకవైపు వార్నర్-మరోవైపు మార్ష్ చితక్కొట్టారు. వీరిరువురి ధాటికి ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 367 పరుగులు చేసింది. వార్నర్ 14x4, 9x6లతో చెలరేగి ఆడి 163 పరుగులు చేసాడు. మార్ష్ 10x4, 9x6లతో 121 పరుగులు చేసాడు. గ్లెన్ మాక్స్ డకౌటయ్యాడు. స్మిత్ 7 పరుగులు, స్టోనిస్ 21 పరుగులు, మార్నస్ 8 పరుగులు, మిట్చెల్లి స్టార్క్ 2 పరుగులు, జోష్ డకౌట్ అయ్యారు. కమిన్స్ 6 పరుగులు, జంపా 1 పరుగుతో నాటవుట్‌గా నిలిచారు. వాస్తవానికి వార్నర్ జోరును మిగిలిన మిడిలార్డర్ బ్యాట్సమన్లు చేసి వుంటే ఆస్ట్రేలియా పరుగులు 400 దాటి వుండేవే. కానీ చివర్లో పాక్ బౌలర్లకు తలొగ్గి వికెట్లు పారేసుకున్నారు.