గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (10:27 IST)

మహిళల టీ20 ప్రపంచ కప్ - ఆరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా

australia womens cricket team
సౌతాఫ్రికా వేదికగా ఆదివారం జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీల్లో ఆస్ట్రేలియా జట్టు ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుపై 19 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఫలితంగా వరల్డ్ కప్ టైటిల్‌ను పదిలంగా తమవద్దే ఉంచుంకుంది. ఆస్ట్రేలియా జట్టుకు ఇది ఆరో టైటిల్ కావడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. ఈ క్రమంలో ఓపెనర్ బెత్ మూనీ ఆజేయంగా 74 పరుగులు చేయగా, ఆష్లే గార్డనర్ 29, వికెట్ కీపర్ అలిస్సా హీలీ 18 చొప్పున పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో ఇస్మాయిల్ 2, కాప్ 2, ఎంలబా 1, క్లో ట్రయోన్ 1 చొప్పున వికెట్లు తీశారు. 
 
ఆ తర్వాత 157 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 137 పరుగులు మాత్రమే చేసి 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓపెనర్ లారా ఓల్వార్ట్ ఒక్కరే 61 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. 
 
కాగా, గత టీ20 ప్రపంచ కప్ పోటీల్లో ఆస్ట్రేలియా అమ్మాయిలో విజేతలుగా నిలిచారు. తాజా విజయంతో వారు టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. మొత్తంగా చూస్తే ఆసీస్ మహిళల జట్టు ఇది ఆరో టీ20 టైటిల్ కావడం గమనార్హం. గతంలో 2010, 2012, 2014, 2018, 2020 సంవత్సరాల్లో జరిగిన టీ20 ప్రపంచ కప్ పోటీల్లో విజేతగా నిలించారు.