సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2017 (10:17 IST)

పల్లెకెలె వన్డే మ్యాచ్ : శ్రీలంకపై చమటోడ్చి నెగ్గిన భారత్

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా పల్లెకెలెలో గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. తొలుత టాస్ ఓడిన శ్రీలంక 236 పరుగులు

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా పల్లెకెలెలో గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. తొలుత టాస్ ఓడిన శ్రీలంక 236 పరుగులు చేసి భారత్ ముందు 237 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది. అయితే ఆటకు వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 47 ఓవర్లలో 231 పరుగులుగా నిర్ణయించారు.
 
లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్ తొలుత పటిష్టంగా కనిపించి ఆ తర్వాత ఓటమి అంచుల వరకు చేరుకుంది. 109/0తో నిలకడా ఉన్న మంచి ఫామ్‌పై ఉన్న జట్టును శ్రీలంక బౌలర్ దనుంజయ దెబ్బతీశాడు. ఫలితంగా 131 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనీ, భువనేశ్వర్‌తో కలిసి భారత్‌ను గట్టెక్కించాడు. 
 
ఓపెనర్లు రోహిత్ శర్మ 45 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 54 పరుగులు చేయగా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 50 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49 పరుగులు చేసి అర్థ సెంచరీ చేజార్చుకున్నాడు. ధోనీ 45 (నాటౌట్), భవనేశ్వర్ కుమార్ (53) పరుగులు చేశారు. ఫలితంగా మరో 16 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో అకిల ధనుంజయ ఒక్కడే 6 వికెట్లు నేలకూల్చాడు. సిరివర్ధనకు ఒక వికెట్ దక్కింది.
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. సిరివర్ధన (58), కపుగెదెర (40), డిక్‌వెల్లా (31) రాణించగా గుణతిలక (19), మెండిస్ (19), తరంగ (9), మాథ్యూస్ (20)లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా, చాహల్ రెండు, హార్ధిక్ పాండ్యా, అక్సర్ పటేల్ చెరో వికెట్ నేలకూల్చారు. 54 పరుగులిచ్చి ఆరు వికెట్లు నేలకూల్చిన ధనుంజయకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.