శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (09:22 IST)

నేడు విశాఖలో భారత్ - ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్

suryakumar
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోటీల్లో తలపడిన భారత్, ఆస్ట్రేలియా జట్లు మరోమారు పోరుకు సిద్ధమయ్యాయి. గురువారం నుంచి ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులోభాగంగా తొలి టీ20 మ్యాచ్‌కు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికకానుంది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన విషయం తెల్సిందే. పైగా, వన్డే ప్రపంచ కప్‌లో ఆడిన సీనియర్ క్రికెటర్లు ఎవరూ ఈ ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడటం లేదు. ఈ టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు యువకులతో కూడిన కొత్త జట్టును ప్రకటించి, సారథ్య బాధ్యతలను ప్రపంచ కప్‌లో పూర్తిగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించింది. 
 
ఈ నేపథ్యంలో జట్టు కూర్పు ఎలా ఉంటుందన్న అంశం ఇపుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. వైజాగ్ స్టేడియంలో ఇషాన్, రుతురాజ్ చెరో అర్థశతకం సాధించారు. వికెట్ కీపర్ ఇషాన్ ఆడతాడు. కానీ యశస్వితో కలిసి ఓపెనింగ్ చేస్తాడా? లేదా? వైస్ కెప్టెన్ రుతురాజ్ ఓపెనర్‌గా వస్తే ఇషాన్ మిడిలార్డర్‌లో ఆడతాడా? అన్నవి ప్రశ్నలు. కెప్టెన్ సూర్య మూడో స్థానంలో ఆడే అవకాశముంది. ఇక నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో వరుసగా తిలక్ వర్మ, శివమ్ దూబె, రింకు సింగ్ ఆడొచ్చు. బౌలింగ్ ముకేశ్, అర్జీప్, రవి బిష్ణోయ్‌కు పోటీ లేకపోవచ్చు. అయితే, మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లలో ఎవరు ఆడుతారన్న చర్చ సాగుతుంది. 
 
మరోవైపు, గత ఐదు టీ20ల్లో ఆస్ట్రేలియాపై మూడు సార్లు గెలిచినా.. ఈ ఫార్మాట్లో భారత్‌లో ఆధిపత్యం అయినా ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోలేం. ప్రపంచకప్‌లో దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా టీ20ల్లోనూ ప్రమాదకరమే. ఈ సిరీస్‌కు కెప్టెన్ అయిన మాథ్యూ వేడ్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. స్టాయినిస్, టిమ్ డేవిడ్ కలిసి అతను మెరుపు ముగింపునివ్వగలడు. గతంలో 7 టీ20ల్లో జట్టును నడిపించిన అనుభవం కూడా ఉంది. మ్యాక్స్‌వెల్ క్రీజులో నిలబడితే ఎంతటి విధ్వంసం సృష్టించగలడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్టేడియంలో ఈ ఆటగాడు ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. షార్ట్ కలిసి స్మిత్ ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంది. బౌలింగ్ విభాగంలో సీన్ అబాట్, ఎలిస్, బెహెండార్ఫ్, తన్వీర్ సంఘాలు ఆస్ట్రేలియాకు ప్రధాన అస్త్రాలు. 
 
ఇరు జట్ల అంచనా.. 
 
భారత్ : ఇషాన్ (వికెట్ కీపర్), యశస్వి, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబె, రింకు సింగ్, అక్షర్/సుందర్, రవి బిష్ణోయ్, అర్జీప్, ప్రసిద్ధి/అవేష్, ముకేశ్.
 
ఆస్ట్రేలియా : స్మిత్, షార్ట్, హార్డీ, ఇంగ్లిస్, స్టాయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్/వికెట్ కీపర్), అబాట్, ఎలిస్, బెహెండార్ఫ్, తన్వీర్ సంఘా.