శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (17:27 IST)

డ్రాగా ముగిసిన అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్ - సిరీస్ భారత్ వశం

Kohli
అహ్మదాబాద్ వేదికగా బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌లోభాగంగా చివరిదైన టెస్ట్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో ఈ మ్యాచ్‌ నిర్ణీత సమయం కంటే ముందుగానే ముంగించేశారు. చివరి రోజైన సోమవారం ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని మ్యాచ్‌ను నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించేశారు. అంపైర్లు ఈ టెస్టు డ్రా అయినట్లు ప్రకటించారు. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీని భారత్ 2-1తో గెలుచుకుంది. 
 
ఈ సిరీస్‌లో భారత్ తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించగా.. మూడో టెస్టును ఆసీస్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇపుడు నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఈ టెస్ట్ సిరీస్ భారత్ వశమైంది. 
 
కాగా, ఐదో రోజైన సోమవారం చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌(90) రాణించగా..  లబుషేన్‌(63 నాటౌట్), స్మిత్‌(10 నాటౌట్)లు క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. 
 
మరోవైపు, ఈ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులు చేసిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కగా..  ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ సొంతం చేసుకున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినప్పటికీ.. భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 
 
సంక్షిప్త స్కోరు.. 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్ : 480
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 571
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 175-2 డిక్లేర్డ్‌